Share News

Canada : కెనడాలో భారతీయ విద్యార్థులకు బహిష్కరణ ముప్పు

ABN , Publish Date - May 26 , 2024 | 06:04 AM

వలసదారులను స్వాగతించడంలో ముందుండే కెనడాలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో అక్కడి ప్రభుత్వానికి ఇప్పుడు కెనడియన్ల నుంచే తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఆ దేశానికి చెందిన అతిచిన్న

Canada : కెనడాలో భారతీయ విద్యార్థులకు  బహిష్కరణ ముప్పు

న్యూఢిల్లీ, మే 25: వలసదారులను స్వాగతించడంలో ముందుండే కెనడాలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో అక్కడి ప్రభుత్వానికి ఇప్పుడు కెనడియన్ల నుంచే తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఆ దేశానికి చెందిన అతిచిన్న ప్రావిన్స్‌... ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్స్‌(పీఈఐ) అధిక సంఖ్యలో తరలివస్తున్న వలసదారులతో సతమతమవుతోంది. దీంతో తన ఇమిగ్రేషన్‌ పర్మిట్లను తగ్గించేందుకు ఇటీవల కొన్ని నిబంధనల్లో మార్పులు చేసింది. వలసదారులకు ఇచ్చే పర్మిట్లలో 25ు కోత విధించింది. ఈ చర్య అంతర్జాతీయ విద్యార్థులపై ప్రభావం చూపింది. ప్రస్తుతం అక్కడున్న వందలాది మంది భారత విద్యార్థులు బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నారు. దీంతో నిబంధనల మార్పును వ్యతిరేకిస్తూ అక్కడి ప్రభుత్వంపై వీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత వలసదారులకు తామెందుకు వ్యతిరేకమో పీఈఐ వాసులు వివరించారు. తమ ప్రావిన్స్‌లో నివసిస్తున్న వలసదారులు తమ ఉపాధి అవకాశాలను హరిస్తున్నారని, కెనడాలో శాశ్వత నివాసానికి, పౌరసత్వానికి స్టూడెంట్‌ వీసాను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్య సంరక్షణ, గృహనిర్మాణ మౌలిక సదుపాయాల రంగాల్లో నెలకొన్న తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో వలసదారుల సంఖ్యను తగ్గించడానికి ప్రొవిన్షియల్‌ నామినీ ప్రోగ్రామ్‌ (పీఎన్‌పీ) ఇమిగ్రేషన్‌ నిబంధనల్లో మార్పులు చేసినట్లు పీఈఐ ప్రధాని తెలిపారు. పీఈఐ 2018లో 1,070 పీఎన్‌పీ స్లాట్లు ప్రకటించింది. 2023లో వీటి సంఖ్య 2,050కి చేరింది. ప్రస్తుతం దీనిపై 25శాతం కోత విధించి 1,600కు తగ్గించినా కూడా 2018తో పోలిస్తే ఇది 75శాతం ఎక్కువేనని నివేదికలు పేర్కొంటున్నాయి.


16 మంది మృతికి కారకుడైన డ్రైవర్‌కు బహిష్కరణ శిక్ష

దారుణ రోడ్డు ప్రమాదానికి కారకుడైన భారత మూలాలు ఉన్న ట్రక్‌ డ్రైవర్‌కు కెనడా ప్రభుత్వం బహిష్కరణ శిక్ష విధించింది. తిరిగి భారత్‌కు వెళ్లిపోవాలని ఆదేశించింది. జస్‌కీరత్‌ సింగ్‌ సిద్ధు అనే డ్రైవర్‌ 2018 ఏప్రిల్‌ 6న సిగ్నల్‌ను దాటి ట్రక్‌ను ముందుకు నడిపించి జూనియర్‌ హాకీ టీం సభ్యులు వెళ్తున్న బస్సును ఢీకొట్టాడు. దాంతో 16 మంది హాకీ క్రీడాకారులు మరణించగా, 13 మంది గాయపడ్డారు. ప్రమాదకరంగా వాహనం నడపడం సహా 16 విధాలుగా నేరం చేశాడని గుర్తించిన కోర్టు 2019లో జైలు శిక్ష విధించింది. గత ఏడాది ఆయన పెరోల్‌పై విడుదలయ్యాడు. శుక్రవారం మరోసారి పరిశీలన జరిపిన ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ రిఫ్యూజీ బోర్డు ఆయనను భారత్‌కు తిప్పి పంపించివేయాలని నిర్ణయించింది. అయితే, దీనిపై అప్పీలు చేస్తామని సిద్ధు చెప్పారు.

Updated Date - May 26 , 2024 | 07:14 AM