Share News

Asia-Pacific : ఆసియా-పసిఫిక్‌లో భారతే కీలకం

ABN , Publish Date - Jan 06 , 2024 | 04:40 AM

భారత్‌, అమెరికా మధ్య రక్షణ వాణిజ్యం 25బిలియన్‌ డాలర్లకు చేరిందని, రెండు దేశాల మధ్య పెరిగిన సాన్నిహిత్యానికి ఇది నిదర్శనమని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ అన్నారు.

Asia-Pacific : ఆసియా-పసిఫిక్‌లో భారతే కీలకం

భారత్‌, అమెరికా మధ్య పరస్పర సహకారం,సుస్థిర శాంతికి సంయుక్తంగా కృషి చేస్తున్నాం

అమెరికన్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ లార్సన్‌

హైదరాబాద్‌, జనవరి5: భారత్‌, అమెరికా మధ్య రక్షణ వాణిజ్యం 25బిలియన్‌ డాలర్లకు చేరిందని, రెండు దేశాల మధ్య పెరిగిన సాన్నిహిత్యానికి ఇది నిదర్శనమని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ అన్నారు. అమెరికన్‌ కాన్సులేట్‌ సహకారంతో కట్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ శుక్రవారం ‘డెలివరబుల్స్‌ టూ డెలివరీస్‌’ అనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించింది. ఇందులో లారన్స్‌ మాట్లాడుతూ రక్షణరంగంతోపాటు పర్యావరణం, అంతర్జాతీయ చట్టా లు, మానవ హక్కులు, నైపుణ్య రంగాల్లో భారత్‌, అమెరికాలు ఉమ్మడిగా కృషి చేస్తున్నాయన్నారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతం లో శాంతి నెలకొంటేనే ప్రపంచశాంతి సాధ్యమని అమెరికా భావిస్తోందని,భారత్‌ సహకారంతోనే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. క్వాడ్‌ ఏర్పాటుతోపాటు ఉమ్మడి సైనిక విన్యాసాల ద్వారా ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో సుస్థిర శాంతికి కృషి చేస్తున్నామన్నారు. రెండు దేశాల మధ్య కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలున్నా పరస్పర సహకారానికి అవి అడ్డుకావని అభిప్రాయపడ్డారు. గల్వాన్‌లో చైనా దురాక్రమణకు పాల్పడుతున్న విషయం అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా మొదట సమాచారం అందిందని, తద్వారా సకాలంలో స్పందించగలిగామని రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ పవన్‌ ఆనంద్‌ తెలిపారు. భారత్‌-అమెరికా దేశాధినేతల మధ్య సుహృద్భావం నెలకొందని, అయినా ఇరు దేశాల మధ్య మరింత విశ్వాసం పెంపొందాల్సిన అవసరం ఉంద న్నారు. సమావేశంలో కట్స్‌ ఇంటర్నేషనల్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆర్నబ్‌ గంగూలీ, రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ కపూర్‌, రిటైర్డ్‌ కెప్టెన్‌ సరబ్‌జీత్‌, ఇంటెలిజెన్స్‌ మాజీ అనలిస్ట్‌ హరీందర్‌ షెకాన్‌, పొలిటియా రీసెర్చ్‌ ఫౌండేషన్‌ సారథి సంజయ్‌ పులిపాక తదితరులు పాల్గొన్నారు.

ఏరోస్పేస్‌ హబ్‌గా హైదరాబాద్‌

ప్రముఖ ఏరోస్పేస్‌ కంపెనీలు హైదరాబాద్‌లో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయని తెలంగాణ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ విభాగం డైరెక్టర్‌ పీఏ ప్రవీణ్‌ తెలిపారు. మేక్‌ ఇన్‌ ఇండియాతోపాటు అమెరికాతో మైత్రీ బంధం ఫలితంగా రక్షణరంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఏరోస్పేస్‌, రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే సంస్థల హబ్‌గా హైదరాబాద్‌ నిలవడానికి ఇది ఎంతో తోడ్పడుతోందని చెప్పారు. ఇప్పటికే వెయ్యికి పై గా కంపెనీలు రక్షణ, సాంకేతిక విభాగాల్లో రాణిస్తున్నాయని, వీటిలో కనీసం 200కంపెనీలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయన్నారు.

Updated Date - Jan 06 , 2024 | 04:40 AM