‘ఇండియా’ ఎన్నికల భేరి!
ABN , Publish Date - Mar 04 , 2024 | 04:55 AM
లోక్‌సభ ఎన్నికలకు విపక్ష ‘ఇండియా’ కూటమి ప్రచార భేరి మోగించింది. ఆదివారం బిహార్ రాజధాని పట్నాలో భారీ ర్యాలీ నిర్వహించింది.
పట్నాలో భారీ స్థాయిలో ‘జనవిశ్వాస్ మహా ర్యాలీ’
రాహుల్, ఖర్గే, అఖిలేశ్, తేజస్వి, లాలూ హాజరు
వామపక్షాల నేతలూ.. నితీశ్‌పై నేతల విసుర్లు
ఆయన్ను మళ్లీ కూటమిలోకి తీసుకోవద్దు: ఖర్గే
ఈసారి వస్తే బయటకు నెట్టేస్తా: లాలూ
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, బిహార్‌లో ఓడిస్తే
బీజేపీ అధికారంలోకి రాదు: అఖిలేశ్‌యాదవ్
పట్నా, మార్చి 3: లోక్‌సభ ఎన్నికలకు విపక్ష ‘ఇండియా’ కూటమి ప్రచార భేరి మోగించింది. ఆదివారం బిహార్ రాజధాని పట్నాలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఆ రాష్ట్రంలో ‘ఇండియా’ కూటమికి సారథ్యం వహిస్తున్న ఆర్‌జేడీ.. ‘జనవిశ్వాస్ మహా ర్యాలీ’ పేరిట పెద్దఎత్తున బహిరంగ సభ నిర్వహించింది. తేజస్వి యాదవ్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘జనవిశ్వాస యాత్ర’ ముగింపు సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీ సంపూర్ణంగా విజయవంతమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సమాజ్‌వాదీ, ఆర్‌జేడీ, వామపక్షాల అగ్ర నేతలు, అఖిలేశ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్, తేజస్వి, సీతారాం ఏచూరి, డి.రాజా, దీపాంకర్ భట్టాచార్య తదితరులు హాజరయ్యారు. మధ్యప్రదేశ్‌లో భారత్ జోడో న్యాయ యాత్రలో ఉన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా పట్నా వచ్చి ర్యాలీలో పావుగంట సేపు మాట్లాడి.. మైకు ఖర్గేకు ఇచ్చి తిరిగి వెళ్లిపోయారు. బిహార్లోని మహాకూటమితో తెగతెంపులు చేసుకుని తిరిగి ఎన్డీయూ గూటికి చేరిన సీఎం నితీశ్‌కుమార్‌పై వారంతా విరుచుకుపడ్డారు. 17 నెలలపాటు ఉపముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వి రాష్ట్రంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించారని ఖర్గే కొనియాడారు. నితీశ్ మళ్లీ కూటమి మారే అవకాశం ఉందని.. ఇక ఆయన్ను ఆహ్వానించవద్దని సూచించారు. లాలూ యథాప్రకారం నితీశ్‌పై చెణుకులు విసిరారు. ‘2017లో కూడా ఇలాగే ఆయన ఫిరాయించారు.
అప్పుడు ఆయన్ను నేను దూషించలేదు. పల్టూరామ్ అని మాత్రమే అన్నాను. ఆ బిరుదు ఆయన చర్యలకు అనుగుణంగానే ఉంది. సోషల్ మీడియాలో ఆయనపై వ్యంగ్య వీడియోలు వచ్చాయి. అవి చూశాకైనా ఆయన సిగ్గుపడలేదా’ అని వ్యాఖ్యానించారు. ఈసారి మళ్లీ తన వద్దకు వస్తే ఆయన్ను బయటకు నెట్టేస్తానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో కుటుంబ పాలనను విమర్శిస్తున్న ప్రధాని మోదీపై మండిపడ్డారు. ‘మోదీకి సొంత కుటుంబం లేకపోతే నేనేం చేస్తాను? ఆయనెప్పుడూ రామాలయం గురించి మాట్లాడుతుంటారు. ఆయన అసలైన హిందువే కాదు. హిందూ సంప్రదాయంలో తల్లి చనిపోతే గుండు చేయించుకుంటారు. మోదీ చేయించుకోలేదు’ అని వ్యాఖ్యానించారు. యూపీ, బిహార్లలో కలిపి మొత్తం 120 లోక్‌సభ స్థానాలు ఉన్నాయని.. ఈ రాష్ట్రాల్లో ఆ పార్టీని ఓడిస్తే కేంద్రంలో అది అధికారంలోకి రావడం అసాధ్యమని అఖిలేశ్ అన్నారు. ‘కొన్ని సార్లు ఇక్కడకు వెళ్తారు.. కొన్ని సార్లు అక్కడకు వెళ్తారు.. జారిపడతారు’ అని నితీశ్‌ను తేజస్వి ఎద్దేవాచేశారు. ఈ ర్యాలీకి రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌జేడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు కేరళ ఆర్‌జేడీ అధ్యక్షుడు ఎంవీ శ్రేయమ్స్‌కుమార్ ప్రత్యేకంగా అక్కడి నుంచి వచ్చారు.