Share News

బీజేపీలో చేరితే దావూద్‌పైనా కేసులుండవు!

ABN , Publish Date - Mar 31 , 2024 | 04:45 AM

మాఫియాడాన్‌ దావూద్‌ ఇబ్రహీం బీజేపీలో చేరితే ఆయన మీద కూడా ఎటువంటి కేసులు ఉండవని, ఏకంగా ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడు కూడా కావచ్చని కాంగ్రెస్‌ పార్టీ ఎద్దేవా చేసింది.

బీజేపీలో చేరితే దావూద్‌పైనా కేసులుండవు!

రాజ్యసభ ఎంపీ కూడా కావచ్చు: రాహుల్‌

న్యూఢిల్లీ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): మాఫియాడాన్‌ దావూద్‌ ఇబ్రహీం బీజేపీలో చేరితే ఆయన మీద కూడా ఎటువంటి కేసులు ఉండవని, ఏకంగా ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడు కూడా కావచ్చని కాంగ్రెస్‌ పార్టీ ఎద్దేవా చేసింది. బీజేపీ మిత్రపక్షం ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం) నేత ప్రఫుల్‌ పటేల్‌పై గతంలో నమోదు చేసిన అభియోగాలను సీబీఐ తాజాగా ఉపసంహరించుకున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ ఈ పోలిక తీసుకొచ్చింది. ఇతర పార్టీలలో ఉన్నప్పుడు కళంకితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులు బీజేపీలోగానీ, దాని మిత్రపక్షాలలోగానీ చేరగానే ఎలా పునీతులవుతారని ప్రశ్నించింది. బీజేపీ ‘వాషింగ్‌ మెషిన్‌’లో వారిని ‘మోదీ వాషింగ్‌ పౌడర్‌’తో కడిగి శుభ్రపరుస్తున్నారా? అని నిలదీసింది. ఈ మేరకు శనివారం కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్‌ నేత పవన్‌ ఖేరా అధ్వర్యంలో.. ‘బీజేపీ వాషింగ్‌ మెషిన్‌’ పేరుతో విలేకరుల ఎదుట ఒక వినూత్న ప్రదర్శన నిర్వహించారు. సదరు ‘వాషింగ్‌ మెషిన్‌’ లోకి వెళ్తే ఎటువంటి అవినీతిపరులకైనా క్లీన్‌చిట్‌ లభిస్తుందని ఎద్దేవా చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న హిమంత బిశ్వశర్మ, ముకుల్‌ రాయ్‌, సువేందు అధికారి, నారాయణ్‌ రాణే, అశోక్‌ చవాన్‌ తదితర 21 మంది నేతలు బీజేపీలో చేరగానే వారిపై ఉన్న ఆరోపణలు అన్నీ తొలగిపోయాయని, బీజేపీలో వారికి ఎంతో ప్రాధాన్యం కూడా ఇచ్చారని పవన్‌ఖేరా గుర్తు చేశారు. ఇదే విధంగా దావూద్‌ ఇబ్రహీం బీజేపీ వాషింగ్‌ మెషిన్‌లోకి వెళ్లినా కూడా స్వచ్ఛంగా బయటకు వస్తాడన్నారు.

బలవంతపు వసూళ్ల సర్కార్‌: రాహుల్‌

బీజేపీతో ఉంటే బెయిలు.. లేకుంటే జైలు అన్న విధానాన్ని కేంద్రం పాటిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు. ఓవైపు బీజేపీ ప్రభుత్వం వసూళ్ల దందాకు పాల్పడుతోందని, మరోవైపు ప్రతిపక్షాల బ్యాంకుఖాతాలను స్తంభింపజేస్తూ, విపక్ష సీఎంలను జైలు పాలు చేస్తూ, విమర్శకులను అణచివేస్తూ, ఎన్నికలు కూడా పారదర్శకంగా జరగకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. చూడబోతే దేశాన్ని ఒక ప్రభుత్వం నడుపుతున్నట్లుగా లేదని ఓ క్రిమినల్‌ గ్యాంగ్‌ (నేరగాళ్ల ముఠా) నడుపుతున్నట్లుగా అనిపిస్తోందన్నారు. మరోవైపు, ఆదివారం ఢిల్లీలో రాంలీలా మైదానంలో ఇండియా కూటమి బహిరంగసభను ‘ప్రజాస్వామ్య పరిరక్షణ సభ’ పేరుతో నిర్వహిస్తామని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్‌ వెల్లడించారు. కూటమికి చెందిన 28 పార్టీల నేతలు హాజరవుతారని తెలిపారు. కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో ఈ సభను నిర్వహిస్తున్నారు.

కాంగ్రె్‌సకు నగదు విరాళాలు రూ.626 కోట్లు!

కాంగ్రెస్‌ పార్టీకి జారీ చేసిన తాఖీదులు, ఇది ట్యాక్స్‌ టెర్రరిజం అంటూ ఆ పార్టీ చేసిన ఆరోపణలపై ఐటీ శాఖ స్పందించింది. పన్నుల చెల్లింపుల్లో ఆ పార్టీ అవకతవకలకు సంబంధించిన ఆధారాలను ఇప్పటికే సేకరించామని ఐటీశాఖ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఎన్నికల బాండ్ల పథకంలో రెండో అతిపెద్ద దాతగా ఉన్న మేఘా సంస్థతోపాటు మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ అనుచరుడి కంపెనీ నుంచి కాంగ్రెస్‌ నిబంధనలకు విరుద్ధంగా నగదు విరాళాలను సేకరించినట్టు 2019 ఏప్రిల్‌లో తాము జరిపిన సోదాల్లో గుర్తించామని ఐటీ అధికారులు తాజాగా వెల్లడించారు. 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి 2019 ఏప్రిల్‌ వరకు రూ.626 కోట్ల వరకు విరాళాలను ఆ పార్టీ నగదు రూపంలో స్వీకరించినట్టు తెలిపారు. అందువల్లే తాజా నోటీసులు జారీ చేశామన్నారు. కాంట్రాక్టులు కట్టబెట్టినందుకే మేఘా సంస్థ ఆ నగదు విరాళాలు ఇచ్చిందని, కమల్‌నాథ్‌ సన్నిహితుల విరాళాలు కూడా కుంభకోణమేనని తెలిపారు.

Updated Date - Mar 31 , 2024 | 04:45 AM