Share News

కాంగ్రెస్‌ గెలిస్తే.. మీ సంపదను ముస్లింలకు పంచేస్తారు

ABN , Publish Date - Apr 22 , 2024 | 03:36 AM

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ గెలిస్తే.. మీ సంపదను ముస్లింలకు పంచేస్తారు

తల్లుల మెడలోని మంగళసూత్రాలనూ వదలరు

రాజస్థాన్‌ ఎన్నికల ర్యాలీలో ప్రధాని సంచలన వ్యాఖ్యలు

జైపూర్‌, ఏప్రిల్‌ 21: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాజస్థాన్‌లోని బన్స్వారాలో, జలోర్‌ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో ఆయన పాల్గొని, ప్రసంగించారు. అర్బన్‌ నక్సల్‌ మనస్తత్వం కలిగిన ఆ పార్టీ నాయకులు మన తల్లులు, సోదరీమణుల మెడల్లోని మంగళసూత్రాలను కూడా వదలరని, వాళ్లు ఆ స్థాయికి కూడా వెళ్లగలరని మండిపడ్డారు. తల్లులు, సోదరీమణుల వద్ద ఉన్న బంగారాన్ని లెక్కపెట్టి, దాని గురించి పూర్తి సమాచారం సేకరిస్తామని, తర్వాత ఆ ఆస్తిని పంపిణీ చేస్తామని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్నారని తెలిపారు. ఈ దేశంలోని ఆస్తులపై ముస్లింలకు మొదటి హక్కు ఉందని గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వమే చెప్పిందని మోదీ గుర్తుచేశారు. ఈ లెక్కన దేశ ప్రజల ఆస్తులను ఎక్కువమంది పిల్లలు ఉన్నవారికి పంపిణీ చేయనున్నారని ఆరోపించారు. ‘‘మీ ఆస్తులను చొరుబాటుదారులకు పంచుతారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును వారికి ఇవ్వడం మీకు ఆమోదయోగ్యమేనా? మీ కష్టార్జితాన్ని జప్తు చేసే హక్కు ప్రభుత్వాలకు ఉందా?’ అని ఆయన ప్రశ్నించారు. మన తల్లుల వద్ద ఉన్న బంగారం ప్రదర్శన కోసం కాదని, అది వారి ఆత్మగౌరవానికి సంబంధించినదని స్పష్టం చేశారు. మంగళసూత్రం విలువ బంగారంలోనో, దాని ధరలోనో లేదని, ఆమె కలలకు ప్రతిరూపమైన దాన్ని లాక్కోవడం గురించి వారు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 2006లో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన వివాదాస్పద ‘ఫస్ట్‌ క్లెయిమ్‌’ వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. కాంగ్రెస్‌ ప్రస్తుతం వామపక్షాల కబంధ హస్తాల్లో చిక్కుకుందని, ఆ పార్టీ మేనిఫెస్టో ఆందోళనకరంగా, తీవ్ర భావజాలంతో ఉందని ఆరోపించారు.

చేసిన పాపాలకు కాంగ్రె్‌సను దేశం శిక్షిస్తోంది

కాంగ్రెస్‌ చేసిన పాపాలకు దేశం ఆ పార్టీని శిక్షిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఒకప్పుడు 400సీట్లు గెలుచుకున్న పార్టీ... ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో 300 సీట్లలో కూడా పోటీ చేయలేకపోతోందని ఎద్దేవా చేశారు. వారికి పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉందని, దీనికి కాంగ్రెస్సే స్వయంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయలేనివారు, గెలవలేనివారు బరిలో నుంచి పలాయనం చిత్తగించారని అన్నారు. ‘‘రాజస్థాన్‌ నుంచి దక్షిణాది నేత ఒకరిని కాంగ్రెస్‌ రాజ్యసభకు పంపింది. ఈ రాష్ట్ర సమస్యలపై ఆయన సభలో ఎప్పుడూ మాట్లాడలేదు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కూడా మీరు రాజ్యసభకు పంపారు. ఆయన ఆనారోగ్యంతో ఉన్నారు. మీ రాష్ట్రంలో ఎన్నడైనా ఆయన్ను చూశారా? ఇప్పుడు మీరు మరో నేతను కాపాడారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేని వారు రంగాన్ని వీడి రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎంపికయ్యారు’’ అని పరోక్షంగా సోనియా గాంధీని ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. ‘‘తొలిదశ పోలింగ్‌లోనే సగం రాజస్థాన్‌ కాంగ్రె్‌సను శిక్షించింది. దేశభక్తిని అణువణువునా నింపుకున్న రాజస్థాన్‌కు.. కాంగ్రెస్‌ ఎన్నటికీ దేశాన్ని బలోపేతం చేయలేదని తెలుసు. 2014కు ముందునాటి పరిస్థితులు మళ్లీ రావాలని ఈ దేశం కోరుకోవడం లేదు. బంధుప్రీతి, అవినీతి అనే చెదపురుగులను వ్యాప్తి చేయడం ద్వారా కాంగ్రెస్‌ దేశాన్ని నిర్వీర్యం చేసింది. నేడు దేశం మొత్తం ఆ పార్టీపై ఆగ్రహంతో ఉంది. అది చేసిన పాపాలకు శిక్షిస్తోంది. కాంగ్రె్‌సపై చాలా ఆగ్రహంతో ఉన్న యువత... మళ్లీ ఆ పార్టీ ముఖం చూడలనుకోవడం లేదు’’ అని మోదీ అన్నారు.

కూటమిలో కుమ్ములాటలు

ఇండియా కూటమి పరిస్థితి ఎగిరేలోపే దారం తెగిన గాలిపటంలా తయారైందని ప్రధాని విమర్శించారు. అది పేరుకు మాత్రమే పొత్తు అని, చాలా రాష్ట్రాల్లో కూటమిలోని భాగస్వామ్య పార్టీలు పరస్పరం కొట్లాడుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికల్లో దేశంలో దాదాపు 25శాతం సీట్లలో ఈ కూటమికి చెందిన వారు ఒకరిపై మరొకరు పోటీ పడుతున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందే ఈ స్థాయిలో కొట్టుకుంటున్నారంటే... ఇక ఆ తర్వాత దోచుకోవడానికి ఇంకెంతకు తెగిస్తారో ఊహించుకోవచ్చని, ఇలాంటి వారికి ఇంత పెద్ద దేశాన్ని అప్పగిస్తామా అని మోదీ ప్రశ్నించారు. కాగా, సంపద పంపీణీ విషయంలో తమ పార్టీని లక్ష్యంగా చేసుకొని మోదీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ మండిపడింది. మొదటి దశ లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితి నిరాశజనకంగా ఉండటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకే మోదీ ఇలాంటి అబద్ధాలకు తెగబడ్డారని ఖర్గే దుయ్యబట్టారు. మోదీ అవాస్తవాలను 140 కోట్ల దేశ ప్రజలు నమ్మరని ఆయన పేర్కొన్నారు.

దక్షిణాదిలో రికార్డు సీట్లు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21: ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ భారతదేశం రికార్డు స్థాయి సీట్లతో బీజేపీని ఆశీర్వదిస్తుందని మోదీ ధీమా వ్యక్తంచేశారు. దక్షిణ భారత్‌ వ్యాప్తంగా తాను పర్యటిస్తున్నానని, తాను వెళ్లినప్పుడు అద్భుతమైన స్పందనను చూస్తున్నానని పేర్కొన్నారు. దక్షిణాదితో తమ పార్టీకి దగ్గరి సంబంధం ఉందని, తమ పార్టీ అధ్యక్షుల్లో ముగ్గురు దక్షిణాది నుంచే వచ్చారని చెప్పారు. 1984లో కేవలం రెండు సీట్లకే పరిమితమైనప్పుడు అందులో ఒకటి దక్షిణ భారతదేశం నుంచి ఉన్నట్టు మోదీ గుర్తు చేశారు. కేరళకు చెందిన మాతృభూమి వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ విషయాలు పేర్కొన్నారు.

Updated Date - Apr 22 , 2024 | 03:36 AM