ఇన్సులిన్ ఇంజెక్షన్లకు ఆ మాత్రతో చెల్లు!
ABN , Publish Date - Nov 25 , 2024 | 03:55 AM
సముద్రంలో స్క్విడ్ చేప కదిలే విధానాన్ని ఎప్పుడైనా గమనించారా? అది ప్రమాద సమయంలో చాలా వేగంగా వెళ్తుంది.
సూక్ష్మ సూదుల అవసరం లేకుండానే..
కడుపు గోడల్లోకి మందు ప్రవేశపెట్టే గోలీ
స్క్విడ్ చేపలు కదిలే తీరు ఆధారంగా..
అభివృద్ధి చేసిన ఎంఐటీ శాస్త్రవేత్తలు
మార్కెట్లోకొస్తే మధుమేహులకు ఊరట
న్యూయార్క్: సముద్రంలో స్క్విడ్ చేప కదిలే విధానాన్ని ఎప్పుడైనా గమనించారా? అది ప్రమాద సమయంలో చాలా వేగంగా వెళ్తుంది. అందుకు అది వాడే టెక్నిక్.. జెట్ ప్రొపల్షన్. అది తన శరీరపు పైపొర ద్వారా నీటిని లోపలికి పీల్చుకుని.. కడుపు పైభాగంలో ఉండే ఒక నాళం ద్వారా బయటికి వేగంగా వదులుతుంది. ఆ క్రమంలో పుట్టే శక్తి ద్వారా వేగంగా ముందుకు కదులుతుంది. ఇదే టెక్నిక్ ఆధారంగా సూక్ష్మ సూదుల అవసరం లేకుండానే మన కడుపులోకి, పేగుల్లోకి ఔషధాన్ని ప్రవేశపెట్టగలిగే గుళికలను (క్యాప్సూల్) మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. ట్రయల్స్ పూర్తయి ఈ క్యాప్సూల్స్ అందుబాటులోకి వస్తే నిత్యం పొట్ట భాగంలో ఇన్సులిన్ ఇంజెక్షన్లు చేసుకోవాల్సిన మధుమేహ బాధితులు, అదే రీతిలో నిత్యం ఇంజెక్షన్లు చేసుకోవాల్సినవారికి ఎంతో ఉపయోగపడతాయి. నిజానికి ఇలా ఇన్సులిన్ తరహా ఔషధాలను నోటి ద్వారా తీసుకున్నప్పుడు.. ఔషధం మన ఆహారనాళం గుండా కడుపులోకి చేరి పనిచేసేలోగా చాలా రసాయనిక మార్పులకు గురవుతుంది. అందుకే వాటిని తప్పనిసరిగా ఇంజెక్షన్ రూపంలోనే ఇస్తారు.
అలా కాకుండా వాటిని కూడా నోటి ద్వారా తీసుకునే వీలు కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు చాలాకాలంగా కృషి చేస్తున్నారు. ఆ క్రమంలో వారికి తోచిన ఆలోచన.. జీర్ణ రసాలకు ప్రభావితం కాని విధంగా ఔషధాన్ని గుళికల్లో ఉంచి, వాటిని నోటి ద్వారా శరీరంలోకి పంపి.. ఆ క్యాప్సూల్స్‌కు ఉన్న అతి సన్నని సూదుల ద్వారా మందు విడుదల చేసేలా చూడడం. ఆ సూదులు కడుపు గోడల్లోకి చొచ్చుకుపోయి మందును విడుదల చేస్తాయి. అంటే.. బయటి నుంచి ఇంజెక్షన్ చేయడానికి బదులుగా కడుపులోపల ఇంజెక్షన్ చేయడమన్నమాట. అలా కడుపు లోపల సైతం సూదులు ఉపయోగించకుండానే మందును మన కడుపు గోడల్లోకి విడుదల చేయడానికే ఎంఐటీ శాస్త్రజ్ఞులు స్క్విడ్‌ల గమన విధానాన్ని అధ్యయనం చేశారు. దాని ఆధారంగా వారు రెండు రకాల క్యాప్సూల్స్ రూపొందించారు. వాటిలో ఎలాంటి సూక్ష్మ సూదులూ ఉండవు. అవి మందును ఒక ధారలాగా కడుపు గోడల్లోకి చొచ్చుకుపోయేంత వేగంగా స్ర్పే చేస్తాయి. ఈ రెండు క్యాప్సూల్స్‌లో ఒకటి బ్లూబెర్రీ ఆకారంలో ఉంటే, మరొకటి ట్యూబ్ ఆకారంలో ఉంటుంది. ప్రయోగాల్లో భాగంగా ఎంఐటీ శాస్త్రజ్ఞులు ఈ క్యాప్సూల్స్ ద్వారా పందులు, కుక్కల కడుపు భాగంలోకి ఇన్సులిన్‌ను, జన్యు చికిత్సలో భాగంగా కొన్ని రకాల ఆర్‌ఎన్‌ఏలను విజయవంతంగా ప్రవేశపెట్టగలిగారు. మనుషులపై పరీక్షలు విజయవంతమై ఈ క్యాప్సూల్స్ మార్కెట్లోకి వస్తే మధుమేహ బాధితులకు ఇంజెక్షన్ల బెడద తప్పిపోతుంది!!