Share News

వెంట్రుక ముక్కతో దొరికిపోయాడు

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:51 AM

ముప్పై ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసును లండన్‌ పోలీసులు ఛేదించారు. భారతీయ సంతతికి చెందిన హంతకుడికి 19 ఏళ్ల జైలుశిక్ష పడేట్లు చేశారు.

వెంట్రుక ముక్కతో దొరికిపోయాడు

1994లో బ్రిటన్‌లో కొలంబియా యువతి హత్య

పెరిగిన టెక్నాలజీతో 30 ఏళ్లకు పరిష్కారమైన కేసు

హంతకుడు భారతీయ సంతతికి చెందినవాడే

లండన్‌, మార్చి 26: ముప్పై ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసును లండన్‌ పోలీసులు ఛేదించారు. భారతీయ సంతతికి చెందిన హంతకుడికి 19 ఏళ్ల జైలుశిక్ష పడేట్లు చేశారు. కొలంబియా నుంచి 1980ల్లో పొట్టకూటి కోసం లండన్‌కు వలస వచ్చిన మరీనా అక్కడ డేవిడ్‌ కొప్పల్‌ను పెళ్లి చేసుకున్నారు. 11ఏళ్లపాటు కాపురం సంతోషంగా గడిచింది. అయితే, ఆమెకు కొలంబియాలో గత వివాహానికి సంబంధించిన పిల్లలను పోషించాల్సిన బాధ్యత ఉండటం, సంపాదిస్తున్న డబ్బు సరిపోకపోవడంతో భర్తకు ఇష్టం లేకపోయినా స్థానికంగా మసాజ్‌ పార్లర్‌లో ఉద్యోగంలో చేరింది. తర్వాత వేశ్యావృత్తిలో కూడా దిగింది. ఇదే విషయంలో వారిద్దరికీ తరచూ గొడవలు అయ్యేవి. డేవిడ్‌ కొప్పెల్‌ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. మరీనా వేశ్యావృత్తిని కొనసాగిస్తూనే వారాంతంలో భర్త దగ్గరకు వెళ్లి వస్తుండేది. 1994 జూలైలో కొత్త ఫ్లాట్‌ కూడా తీసుకుంది. అదే ఏడాది ఆగస్టు 8న ఆమె ఫ్లాట్‌లోనే దారుణ హత్యకు గురైంది. మరుసటి రోజు మరీనా ఎంతకీ ఫోన్‌ ఎత్తకపోవడంతో డేవిడ్‌ ఆమె ఫ్లాట్‌కు వెళ్లాడు. భార్య మృతదేహాన్ని చూసి వెంటనే పోలీసులకు కాల్‌ చేశాడు. మెరీనా హత్యకు సంబంధించి అనుమానితుల్లో భారతీయ సంతతికి చెందిన 21 ఏళ్ల సందీప్‌ పటేల్‌ కూడా ఉన్నాడు. ప్లాస్టిక్‌ బ్యాగు మీద సందీప్‌ వేలి ముద్రలు కూడా ఉన్నాయి. ఆ ప్లాస్టిక్‌ బ్యాగు సందీప్‌ తండ్రి నిర్వహించే పుస్తకాల షాపు నుంచి రావడంతో అక్కడ పనిచేసే సందీప్‌ వేలిముద్రలు పడే అవకాశం ఉందని భావించి వదిలేశారు. 2008లో కేసును తిరగదోడినపుడు గదిలో దొరికిన ఆమె చేతి వేలి ఉంగరంలో హంతకుడి వెంట్రుక ఉన్నట్లు గమనించారు. అప్పటికి డీఎన్‌ఏ టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందకపోవడంతో వెంట్రుకను దాచారు. 2022లో మరీనా కేసు మరోసారి తిరగదోడారు. పోలీసులు దాచిపెట్టిన నిందితుడి వెంట్రుకకు డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ చేసేశారు. నేరగాళ్ల డేటాబే్‌సను స్కాన్‌ చేయగానే సందీప్‌ పటేల్‌ డీఎన్‌ఏతో సరిపోలింది. ఆధారాలన్నీ సరిపోలడంతో 2023 జనవరిలో సందీప్‌ పటేల్‌ను అరెస్టు చేశారు.

Updated Date - Mar 27 , 2024 | 08:14 AM