Share News

Valentine's Day: చేతిలో చేయి వేసి.. ఒకరినొకరు చూసుకుంటూ.. కారుణ్య మరణం

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:37 AM

వాలంటైన్స్‌ డేకి కొద్ది రోజుల ముందు నెదర్లాండ్స్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని డ్రైస్‌ వాన్‌ ఆగ్ట్‌, ఆయన సతీమణి యూజీనీ ఇద్దరూ ఒకేసారి మృత్యుఒడిలోకి చేరారు.

Valentine's Day: చేతిలో చేయి వేసి.. ఒకరినొకరు చూసుకుంటూ.. కారుణ్య మరణం

డచ్‌ మాజీ ప్రధాని దంపతుల కారుణ్య మరణం

93 ఏళ్ల వయసులో 70 ఏళ్ల ప్రేమకు ముగింపు

అమ్‌స్టర్‌డ్యామ్‌/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: వాలంటైన్స్‌ డేకి కొద్ది రోజుల ముందు నెదర్లాండ్స్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధాని డ్రైస్‌ వాన్‌ ఆగ్ట్‌, ఆయన సతీమణి యూజీనీ ఇద్దరూ ఒకేసారి మృత్యుఒడిలోకి చేరారు. 93 ఏళ్ల వయసున్న వీరు అక్కడి చట్టం ప్రకారం కారుణ్య మరణాన్ని ఎంచుకొని, చివరి క్షణాల్లో ఒకరి చేతిలో మరొకరు చేతులు వేసుకుని, ఒకరినొకరు చూసుకుంటూ ఈ నెల 5న కన్నుమూశారు. దీంతో వీరి మధ్య 70 ఏళ్ల ప్రేమ బంధానికి తెరపడింది. ‘1977 నుంచి 1982 వరకూ ప్రధానిగా సేవలందించిన వాన్‌ ఆగ్ట్‌ 93వ పుట్టినరోజు జరుపుకొన్న మూడు రోజుల తర్వాత స్వగ్రామమైన నిజ్‌మెగెన్‌లో తన ప్రియమైన భార్య యూజీనీ చేతిలో చేయి వేసి, ఆమెతో పాటే మరణించారు’ అని ఆయన స్థాపించిన హక్కుల సంస్థ ‘వాన్‌ ఆగ్ట్స్‌ క్లబ్‌’ ప్రకటించింది. 2019లో బ్రెయిన్‌ హేమరేజ్‌ బారిన పడిన వాన్‌ ఆగ్ట్‌ ఆ తర్వాత పూర్తిగా కోలుకోలేకపోయారు.ఒకరిని విడిచి మరొకరు జీవించలేమని నిర్ణయించుకున్న తర్వాత వారు కారుణ్య మరణాన్ని ఎంచుకున్నారు. కాగా, 2002లో నెదర్లాండ్స్‌లో కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేసిన తర్వాత అక్కడ ఇలాంటి కేసులు నాలుగు రెట్లు పెరిగాయి. 2022లోనే 8,720 మంది దీన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ ఏడాది 26 జంటలు కోరుకుంటే 2023లో ఇది 58 జంటలకు పెరిగింది.

Updated Date - Feb 15 , 2024 | 07:28 AM