Share News

మెట్టు దిగిన హమాస్‌

ABN , Publish Date - Jan 03 , 2024 | 03:48 AM

ఇజ్రాయెల్‌పై భీకర పోరు చేస్తున్న హమాస్‌ ఉగ్ర సంస్థ ఎట్టకేలకు మెట్టు దిగింది. వెస్ట్‌బ్యాంక్‌తోపాటు.. గాజాలో పాలస్తీనా అథారిటీ ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది.

మెట్టు దిగిన హమాస్‌

గాజాలో పాలస్తీనా అథారిటీ సర్కారుకు ఓకే

ప్రకటించిన హమాస్‌ నేత ఇస్మాయిల్‌ హనియే

ఐడీఎఫ్‌ దాడుల్లో హమాస్‌ నేత సలేహ్‌ అరౌరీ హతం

జ్రాయెల్‌పై భీకర పోరు చేస్తున్న హమాస్‌ ఉగ్ర సంస్థ ఎట్టకేలకు మెట్టు దిగింది. వెస్ట్‌బ్యాంక్‌తోపాటు.. గాజాలో పాలస్తీనా అథారిటీ ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము అంగీకరిస్తామని హమాస్‌ పొలిటికల్‌ బ్యూరో అధిపతి ఇస్మాయిల్‌ హనియే మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు టెలివిజన్‌ ప్రసంగం చేశారు. ‘‘ఈ నిర్ణయం వెనక ఖతార్‌, ఈజిప్ట్‌ మధ్యవర్తిత్వం ఉంది. ఈ యుద్ధంతో అమాయక పౌరులు చనిపోతున్నారు. వారి కోసం కాల్పుల విరమణను కోరుతున్నాను’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌ నుంచి అపహరించిన బందీలను అప్పగించడానికి.. తమ ఖైదీలను విడుదల చేయాలని ఆయన పునరుద్ఘాటించారు. బందీలు-ఖైదీల మార్పిడి జరగాల్సిందేనన్నారు. గతంలో కాల్పుల విరమణ సందర్భంగా ఇజ్రాయెల్‌ కూడా పాలస్తీనా అథారిటీ సర్కారు డిమాండ్‌ను ముందు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు హమాస్‌ కూడా అందుకు అంగీకరించడంతో.. యుద్ధం ముగిసే అవకాశాలున్నట్లు ఈజిప్ట్‌ తెలిపింది. మరోవైపు, లెబనాన్‌లోని మిష్రిఫియాలోని హిజ్బుల్లా షెల్టర్‌లో హమాస్‌ అగ్రనేతలు తలదాచుకున్నారనే సమాచారంతో ఐడీఎఫ్‌ మంగళవారం ఆ ప్రాంతాలపై రాకెట్ల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో హమాస్‌ పొలిటికల్‌ బ్యూరో డిప్యూటీ చీఫ్‌ సలేహ్‌ అల్‌-అరౌరీ హతమయ్యాడు. కాగా, ఇజ్రాయెల్‌ గివాటి బ్రిగేడ్‌లో డివిజన్‌ కమాండర్‌ హరేల్‌ ఇటా.. ఓ నవజాత శిశువును గాజా స్ట్రిప్‌ నుంచి అపహరించడంపై ఆధారాలు లభించాయని, దర్యాప్తు చేస్తున్నామని ఐడీఎఫ్‌ మంగళవారం తెలిపింది. - సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - Jan 03 , 2024 | 07:02 AM