కూలి చేసైనా భార్యకు భరణం ఇవ్వండి
ABN , Publish Date - Jan 29 , 2024 | 03:26 AM
ఉద్యోగం, ఆదాయం లేనందున విడాకులిచ్చిన భార్యకు మనోవర్తి చెల్లించలేనంటూ భర్త చెప్పడం తగదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.
ఆదాయం లేదని ఎగవేత తగదు.. అలహాబాద్ హైకోర్టు ఆదేశం
లఖ్‌నవూ, జనవరి 28: ఉద్యోగం, ఆదాయం లేనందున విడాకులిచ్చిన భార్యకు మనోవర్తి చెల్లించలేనంటూ భర్త చెప్పడం తగదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. భార్యకు భరణం చెల్లించడం భర్త విధి అని తెలిపింది. కూలిపనులు చేసైనా సరే మనోవర్తి ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌కు చెందిన న్యాయమూర్తి జస్టిస్ రేణు అగర్వాల్ ఆదేశాలు ఇచ్చారు. ఆరోగ్యంగా ఉన్నందున కూలిపనులైనా చేసి రోజుకు రూ.300-400 సంపాదించవచ్చని, అందులో నెలకు రూ.2,000 భార్యకు ఇవ్వాలని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ జంటకు 2015లో వివాహం జరిగింది. భర్త, అత్తమామలు వరకట్నం కోసం వేధిస్తున్నారని పేర్కొంటూ ఆమె మరుసటి సంవత్సరమే పుట్టినింటికి వెళ్లిపోయింది. విడాకుల కోసం ఆమె ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేయగా ఆ న్యాయస్థానం అనుకూలంగా స్పందించింది. ప్రతి నెలా మనోవర్తి ఇవ్వాలని ఆదేశించింది. మనోవర్తి చెల్లించకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఆయన వాదనలు వినిపిస్తూ తనకు కొద్ది పాటి భూమే ఉందని, కూలి పనులు చేసుకొని బతుకుతున్నానని తెలిపాడు. తనకు ఆరోగ్యం బాగులేదని, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ల బాధ్యతలను చూసుకోవాల్సి ఉందని వివరించాడు. తాను అద్దె ఇంట్లో ఉంటున్నానని, ఆమె ప్రయివేటు స్కూలులో పనిచేస్తూ నెలకు రూ.10 వేలు సంపాదిస్తోందని చెప్పాడు. అయితే ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించలేదు. ఆమె టీచరుగా పనిచేస్తోందనడానికి ఎలాంటి ఆధారాలు చూపలేదని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్నందున రోజువారీ కూలి పనులైనా చేసి సంపాదించవచ్చని, దాని నుంచి భరణం చెల్లించాలని సూచించారు.