Share News

ధర్మాసనం నుంచి కమల దళంలోకి..

ABN , Publish Date - Mar 06 , 2024 | 03:30 AM

కలకత్తా హైకోర్టు జడ్జి పదవికి రాజీనామా చేసిన జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ బీజేపీలో చేరనున్నారు.

ధర్మాసనం నుంచి కమల దళంలోకి..

బీజేపీలో చేరనున్న కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్‌

రాజీనామా చేసిన గంటల్లోనే ప్రకటన

కోల్‌కతా, మార్చి 5: కలకత్తా హైకోర్టు జడ్జి పదవికి రాజీనామా చేసిన జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ బీజేపీలో చేరనున్నారు. పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే ఆయన ఈ మేరకు ప్రకటించారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని మంగళవారం ఉదయమే రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలకు పంపించారు. పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న ఉపాధ్యాయుల భర్తీ కుంభకోణం, తదితర అంశాలపై ఆయన గతంలో తీర్పులు ఇవ్వడం గమనార్హం. రాజీనామా అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తృణమూల్‌ అవినీతికి మారుపేరుగా మారిందని ఆరోపించారు. బీజేపీ జాతీయ పార్టీ కావడం, తృణమూల్‌ అవినీతిపై పోరాడుతున్నందువల్లనే ఆ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. బహుశా గురువారం ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని వెల్లడించారు. బీజేపీ నాయకత్వం తనతో సంప్రదింపులు జరిపిందని తెలిపారు. ఉపాధ్యాయ భర్తీ కుంభకోణంపై తాను తీర్పు ఇచ్చిన తరువాత తృణమూల్‌ నాయకులు తనను దుర్భాషలాడారని, అందుకే రాజకీయాల్లో చేరి తృణమూల్‌పై పోరాడాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఆ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని, మరో రెండు అరెస్టులు జరిగితే ఆ పార్టీ ఉనికే ఉండదని అన్నారు. ప్రఽధాని మోదీ కష్టజీవి అని, మతాన్ని, దేవుడ్ని నమ్ముకొని దేశం కోసం ఎంతో చేస్తున్నారని ప్రశంసించారు. అభిజిత్‌ గ న్యాయమూర్తిగా ఉన్నప్పుడు పలు అసాధారణ నిర్ణయాలు తీసుకొని వివాదాస్పదునిగా మారారు. విచారణ జరుపుతున్న కేసుపై ఇంటర్వ్యూ ఇవ్వడం, దీనిపై ఏకంగా సుప్రీంకోర్టుకే నోటీసులు ఇవ్వడం, సహచర జడ్జిపై విమర్శలు చేయడం, లాయర్లతో ఘర్షణకు దిగి విమర్శలకు గురయ్యారు.

Updated Date - Mar 06 , 2024 | 03:30 AM