Share News

ఉజ్జయినీ ఆలయంలో అగ్ని ప్రమాదం!

ABN , Publish Date - Mar 26 , 2024 | 03:06 AM

హోలీ పర్వదినాన మధ్యప్రదేశ్‌ ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. పండుగ కావడంతో సోమవారం తెల్లవారుజాము నుంచే గర్భగుడిలో పూజలు ప్రారంభించారు.

ఉజ్జయినీ ఆలయంలో అగ్ని ప్రమాదం!

పూజారులు సహా 14 మందికి గాయాలు

ఉజ్జయినీ, మార్చి 25: హోలీ పర్వదినాన మధ్యప్రదేశ్‌ ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. పండుగ కావడంతో సోమవారం తెల్లవారుజాము నుంచే గర్భగుడిలో పూజలు ప్రారంభించారు. ఉదయం 5.55 గంటల సమయంలో ‘భస్మహారతి’ ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూజారులు, ఆలయ సేవకులు సహా మొత్తం 14 మంది అందులో చిక్కుకొని గాయపడ్డారు. హారతి సమయంలో కర్పూరం వెలుగుతుండగా గులాల్‌ చల్లడంతో అగ్గి రాజుకుందని.. గర్భగుడిలో రంగులు పడకుండా కట్టిన వస్త్రాలకు మంటలు అంటుకొని ప్రమాదం జరిగిందని ఉజ్జయినీ కలెక్టర్‌ నీరజ్‌ కుమార్‌ వివరించారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.లక్ష సాయంతో పాటు వారికి అత్యుత్తమ చికిత్స ఉచితంగా అందిస్తామని సీఎం మోహన్‌యాదవ్‌ అన్నారు. ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.

Updated Date - Mar 26 , 2024 | 08:03 AM