Share News

రేపు ఢిల్లీలో మళ్లీ రైతుల నిరసన

ABN , Publish Date - Feb 12 , 2024 | 03:15 AM

వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలనే డిమాండ్‌పై మరోసారి ఫిబ్రవరి 13న వేలాది మంది రైతులు ఢిల్లీని చుట్టుముట్టనున్నారు.

రేపు ఢిల్లీలో మళ్లీ రైతుల నిరసన

అష్టదిగ్భంధనం చేసిన భద్రతాదళాలు.. పంజాబ్‌, హరియాణా సరిహద్దులు మూత

నేటి సాయంత్రం చండీగఢ్‌లో రైతులతో కేంద్రం చర్చలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలనే డిమాండ్‌పై మరోసారి ఫిబ్రవరి 13న వేలాది మంది రైతులు ఢిల్లీని చుట్టుముట్టనున్నారు.పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, యూపీ, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీలో ప్రవేశించనున్నారు. సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ సంఘ్‌తో పాటు 200 రైతు సంఘాల తరఫున కనీసం 20 వేలమందికి పైగా రైతులు 2,500 ట్రాక్టర్లలో ఢిల్లీలో భారీ మార్చ్‌ నిర్వహించేందుకు సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే రైతుసంఘాలు అనేక రాష్ట్రాల్లో 40కి పైగా రిహార్సల్స్‌ జరిపారని, 100 సమావేశాలు జరిపారని సమాచారం అందడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నివాసాల ఎదురుగా కూడా వారు నిరసన ప్రదర్శనలు నిర్వహించనునన్నట్లు సమచారం అందడంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, హరియాణా పొలిమేరలను ఇప్పటికే అష్టదిగ్బంధనం చేశారు. సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే రైతులను తరలించడం కోసం హరియాణా సర్కారు రెండు పెద్ద స్టేడియాలను తాత్కాలిక జైళ్లుగా మార్చింది. ఏడు జిల్లాల్లో మొబైల్‌, ఇంటర్నెట్‌ సర్వీసుల్ని నిలిపివేశారు. కాగా, సోమవారం సాయంత్రం రైతుల డిమాండ్లపై చండీగఢ్‌లో కేంద్ర మంత్రులు అర్జున్‌ ముండా, గోయల్‌, నిత్యానంద్‌రాయ్‌ చర్చలు జరపనున్నారని పంజాబ్‌ కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ జనరల్‌ సెక్రటరీ తెలిపారు. మరోవైపు, రైతుల నిరసనలకు, మంగళవారం నిర్వహించతలపెట్టిన భారీ మార్చ్‌కు కాంగ్రెస్‌ అఽధ్యక్షుడు ఖర్గే మద్దతు ప్రకటించారు.

పంజాబ్‌-భారత్‌ మధ్య సరిహద్దులా: మాన్‌

రైతులతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరపాలని, పంజాబ్‌కు భారత్‌కు మధ్య సరిహద్దులు సృష్టించవద్దని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ హితవు పలికారు. జాతీయ రహదారులు, ఇతర రోడ్లపై హరియాణా ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో మాన్‌ స్పందించారు. ‘హరియాణాలో ఏం జరుగుతుంది? పంజాబ్‌ సరిహద్దు వెంబడి వాళ్లు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉన్నట్లు ఫెన్సింగ్‌లను పంజాబ్‌ సరిహద్దులో ఏర్పాటు చేస్తున్నారా?’ అని మాన్‌ నిలదీశారు.

Updated Date - Feb 12 , 2024 | 03:15 AM