Poonam Pandey no more : పూనమ్ పాండే కన్నుమూత
ABN , Publish Date - Feb 03 , 2024 | 05:26 AM
ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే అకాల మరణం చెందారు. కొంతకాలంగా గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతున్న 32 ఏళ్ల పూనమ్ గురువారం రాత్రి కన్నుమూశారు.
32 ఏళ్లకే గర్భాశయ కేన్సర్‌తో మృతి
ఇన్‌స్టా వేదికగా ఆమె మేనేజర్ వెల్లడి
ముంబై, ఫిబ్రవరి 2: ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే అకాల మరణం చెందారు. కొంతకాలంగా గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతున్న 32 ఏళ్ల పూనమ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె మేనేజర్ శుక్రవారం ఉదయం ధ్రువీకరించారు. ‘ఈ రోజు చాలా బాధకర విషయాన్ని తెలియజేయాల్సి వచ్చినందుకు చింతిస్తున్నాము. మన ప్రియతమ నటి పూనమ్ పాండే గర్భాశయ కేన్సర్‌తో గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ విషాద సమయంలో ఆమెను స్మరించుకుంటూ.. వారి కుటుంబ గోప్యతకు భగం కలిగించవద్దని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. అయితే మరణానికి సంబంధించిన వివరాలు వెల్లడించడానికి ఆమె కుటుంబం అందుబాటులో లేదు.
వివాదాస్పద వ్యాఖ్యలతో పాపులర్
పూనమ్ పాండే ప్రముఖ మోడల్. 2013లో తొలిసారిగా ఆమె నషా అనే హిందీ చిత్రంలో నటించారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచేవారు. 2011 వన్డే ప్రపంచకప్ సందర్భంగా టీమిండియా ఫైనల్లో గెలిస్తే నగ్నంగా కనిపిస్తానని ప్రకటించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆమె చివరగా.. నటి కంగనారనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘లాక్ అప్’ మొదటి సీజన్‌లో కనిపించారు. షోలో విజయం సాధించలేకపోయినప్పటికీ అభిమానుల సంఖ్యను పెంచుకున్నారు. 2020లో శామ్ బాంబేను వివాహం చేసుకున్న పూనమ్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. అయితే.. వారి వైవాహిక జీవితం ఎంతోకాలం కొనసాగలేదు. పెళ్లయిన కొద్దిరోజులకే శామ్‌పై ఆమె గృహ హింస ఆరోపణలు చేశారు. తర్వాత విడిపోయారు.