Share News

మహారాష్ట్ర ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాక్‌

ABN , Publish Date - Oct 25 , 2024 | 01:39 AM

: దేశంలో ప్రతి రాజకీయ పార్టీ కుటుంబ రాజకీయాలకు దూరం గా ఉండాలని చెబుతుంటాయి.. కానీ ఆచరణ లో మాత్రం ఆ సూత్రాన్ని విస్మరించి.. తమ రక్త సంబంధీకులకే సీట్లు కేటాయిస్తుంటాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 20న జరగనున్న అసెంబ్లీ

మహారాష్ట్ర ఎన్నికల్లో ఫ్యామిలీ ప్యాక్‌

ప్రతి పార్టీలో రక్త సంబంధీకులకే సీట్లు.. పట్టున్న నియోజకవర్గాల్లో పాగాకు ప్లాన్‌

ముంబై, అక్టోబరు 24: దేశంలో ప్రతి రాజకీయ పార్టీ కుటుంబ రాజకీయాలకు దూరం గా ఉండాలని చెబుతుంటాయి.. కానీ ఆచరణ లో మాత్రం ఆ సూత్రాన్ని విస్మరించి.. తమ రక్త సంబంధీకులకే సీట్లు కేటాయిస్తుంటాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అక్కడ అన్ని పార్టీలు తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. అందులో ప్రతీ పార్టీ వారి ముఖ్య నేతల తనయులు, భార్య, సోదరి, సోదరులకు ఏదో ఒకచోట సీటు కేటాయించింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత అశోక్‌ చవాన్‌ తనయ శ్రీజయ చవాన్‌ ఇటీవల కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చే రగా.. వారి కుటుంబానికి కంచుకోట అయిన నాందేడ్‌ జిల్లాలోని భోకర్‌ నియోజకవర్గాన్ని బీజేపీ ఆమెకు కేటాయించింది. అలాగే ముంబై బీజేపీ అధినేత ఆశిష్‌ షేలర్‌ పశ్చిమ బాంద్రా నియోజకవర్గం నుంచి పోటీ కి దిగనుండగా.. ఆయన సోదరుడు వినోద్‌ షేలర్‌ను పశ్చిమ మలాడ్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ బరిలోకి దింపింది. శ్రీగొండ నియోజకవర్గం సిటింగ్‌ ఎమ్మెల్యే బాబన్‌రావ్‌ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా అక్కడి నుంచి ఆయన భార్య ప్రతిభా పచ్‌పూతేను బీజేపీ పోటీ చేయిస్తోంది. కాంకావ్లి నియోజకర్గ ఎమ్మెల్యే నితేశ్‌ సోదరుడు నీలేశ్‌ ఇటీవల బీజేపీ నుంచి ఉద్ధవ్‌ శివసేనలో చేరగా.. ఆయనకు పార్టీ కుడాల్‌ నియోజవర్గాన్ని కేటాయించింది. రాష్ట్ర మంత్రి ఉదయ్‌ సామంత్‌ సోదరుడు కిరణ్‌ సామంగ్‌కు శిందే శివసేన రాజాపూర్‌ సీటు నుంచి బరిలోకి దింపుతోంది. అలాగే ఆ పార్టీ ఎంపీలు సందీపన్‌ భూమరే, రవీంద్ర వైకర్‌ తమ వారికి సీట్లు దక్కించుకోవడంలో సఫలమయ్యారు. భూమరే కుమారుడు విలాస్‌.. పైథాన్‌ నియోజకవర్గం నుంచి, వైకర్‌ భార్య మనీశా తూర్పు జోగేశ్వరీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఎన్సీపీ నేత పంకజ్‌ భుజ్‌బల్‌ నాసి క్‌ జిల్లాలోని యోలా నియోజకవర్గం నుంచి, ఆయన సోదరుడు చాగన్‌ భుజ్‌బల్‌ ఇండిపెండెంట్‌గా అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఉద్ధవ్‌ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే వర్లి నియోజకవర్గం నుంచి ఆయన సోదరుడు వరుణ్‌ సర్దేశాయ్‌ తూర్పు బాంద్రా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. శరద్‌ పవార్‌ మనవడు రోహిత్‌ పవార్‌ అహిల్యా నగర్‌ స్థానం బరిలోకి దిగారు. ఇలా అన్ని పార్టీలు.. ముఖ్య నేతల కుటుంబసభ్యులకు సీట్లు కేటాయించాయి. కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ పట్టున్న నేత ఆకస్మికంగా మృతి చెందడంతో వారి వారసులకు పార్టీలు సీట్లు కేటాయించాయి. ఏదీ ఏమైనా గెలుపే లక్ష్యంగా మహారాష్ట్రలో ప్రతి పార్టీ పూర్తి ఫ్యామిలీ ప్యాక్‌తో బరిలోకి దిగాయి.


48 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో నిలువనున్న అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను గురువారం కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇందులో 48 మందికి చోటు కల్పించింది. సకోలి నుంచి మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నానా పటోలే, కరాడ్‌ సౌత్‌ నుంచి మాజీ సీఎం పృథ్వీరాజ్‌ చవాన్‌, బ్రహ్మపురి నుంచి విజయ్‌ వాడెట్టివర్‌, నాగ్‌పూర్‌ నార్త్‌ నుంచి మాజీ మంత్రి నితిన్‌ రౌత్‌, సంగమనేర్‌ నుంచి మాజీ మంత్రి బాలాసాహెబ్‌ థోరట్‌ను పోటీలోకి దింపుతోంది.

Updated Date - Oct 25 , 2024 | 01:39 AM