‘ఎల్‌నినో’ తగ్గినా... వేసవిలో సెగలే!
ABN , Publish Date - Mar 06 , 2024 | 03:27 AM
ఎల్‌నినో బలహీనపడినప్పటికీ పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం నుంచి వచ్చే వేడిగాలులతో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ మార్చి నుంచి మే నెల వరకూ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) హెచ్చరించింది.

ఈసారి రికార్డు ఉష్ణోగ్రతలు: డబ్ల్యూఎంవో
న్యూఢిల్లీ, మార్చి 5: ఎల్‌నినో బలహీనపడినప్పటికీ పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం నుంచి వచ్చే వేడిగాలులతో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ మార్చి నుంచి మే నెల వరకూ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) హెచ్చరించింది. మార్చి-మే నెలల్లో ఎల్‌నినో కొనసాగడానికి 60ు అవకాశం ఉండగా, ఏప్రిల్ నుంచి జూన్ వరకూ తటస్థ పరిస్థితులు నెలకొనడానికి 80ు అవకాశం ఉందని డబ్ల్యూఎంవో అంచనా వేసింది. ‘2023 జూన్ నుంచి ప్రతి నెలా సరికొత్త ఉష్ణోగ్రత రికార్డును నెలకొల్పింది. దీనికి ఎల్‌నినో కూడా కొంతవరకూ దోహదం చేసింది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గత 10 నెలలుగా అసాధారణంగా పెరగడం ఆందోళనకరం’ అని డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్ సెలస్టే సౌలో పేర్కొన్నారు. కాగా, జూన్ నుంచి తటస్థ పరిస్థితులు ప్రారంభమై ఆగస్టు నాటికి లానినా మొదలవుతుందని ఐఎండీ అంచనా వేసింది.