Share News

‘ఉపాధి’ వేతనం పెంపు

ABN , Publish Date - Mar 29 , 2024 | 06:38 AM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలి రేట్లను సవరించారు. దీంతో ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు వివిధ రాష్ట్రాలలో 4ు నుంచి 10ు వరకు కూలి రేట్లు

‘ఉపాధి’ వేతనం పెంపు

కూలి రేట్లు సవరించిన కేంద్రం

తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా 10% పెంపు

న్యూఢిల్లీ, మార్చి 28: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలి రేట్లను సవరించారు. దీంతో ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు వివిధ రాష్ట్రాలలో 4ు నుంచి 10ు వరకు కూలి రేట్లు పెరగనున్నాయి. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఎన్నికల కమిషన్‌ నుంచి అనుమతి పొంది.. సవరించిన కూలిరేట్లను ఈనెల 27వ తేదీన నోటిఫై చేసింది. ఆ నోటిఫికేషన్‌ ప్రకారం నైపుణ్యం లేని కార్మికులకు అత్యధికంగా హరియాణాలో రోజుకు రూ.374, అత్యల్పంగా అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌ రాష్ట్రాలలో రూ.234 చెల్లించనున్నారు. ఈ పథకం కింద కూలీలకు ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల పని కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో కూలీ రేటు రూ.28 పెరిగి, రూ.300కు చేరింది. నోటిఫికేషన్‌లోని వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, గోవాలలో సుమారు 10ు వరకు కూలీ రేటును పెంచారు.

కనీసం రూ.400 అయినా చేయలేదు: కాంగ్రెస్‌..

ఉపాధి కూలీల వేతనాలను రూ.400 చేస్తామని ‘శ్రామిక న్యాయ్‌’ గ్యారెంటీలో తామ హామీ ఇచ్చామని, మోదీ ప్రభుత్వం కనీసం అంతకైనా పెంచలేదని కాంగ్రెస్‌ విమర్శించింది. ‘ఉపాధి కూలీలకు శుభాకాంక్షలు. ప్రధానమంత్రి మీ వేతనాన్ని 7 రూపాయలు పెంచారు. అంత పెద్ద మొత్తంతో మీరు ఏం చేస్తారని బహుశా ఆయన మిమ్మల్ని అడగొచ్చు. మీ పేరుతో థాంక్యూ మోదీ ప్రచార కార్యక్రమాన్ని రూ.700 కోట్ల వ్యయంతో ప్రారంభించే అవకాశం కూడా ఉంది’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే కార్మికులకు కనీస వేతనాన్ని రూ.400కు పెంచుతుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 06:38 AM