Share News

Doreen Fernandes: మంత్రి బంధువుకి ఇల్లు అమ్మిన మహిళ.. 19 ఏళ్ల తర్వాత న్యాయం.. అసలేంటీ కథ?

ABN , Publish Date - Jan 03 , 2024 | 10:08 PM

సాధారణంగా.. ఒక ప్రాపర్టీకి సంబంధించిన డీల్ కుదుర్చుకున్నప్పుడు అప్పటికప్పుడే యజమానికి డబ్బులివ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ మొత్తం డబ్బులు ఒకేసారి ఇవ్వలేకపోతే.. లోన్ లేదా మరే ఇతర మార్గాల్లోనూ ఆ మొత్తాన్ని...

Doreen Fernandes: మంత్రి బంధువుకి ఇల్లు అమ్మిన మహిళ.. 19 ఏళ్ల తర్వాత న్యాయం.. అసలేంటీ కథ?

Doreen Fernandes: సాధారణంగా.. ఒక ప్రాపర్టీకి సంబంధించిన డీల్ కుదుర్చుకున్నప్పుడు అప్పటికప్పుడే యజమానికి డబ్బులివ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ మొత్తం డబ్బులు ఒకేసారి ఇవ్వలేకపోతే.. లోన్ లేదా మరే ఇతర మార్గాల్లోనూ ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ ప్రాసెస్ మొత్తానికి పెద్దగా సమయమైతే పట్టదు. కానీ.. ఒక మహిళకు మాత్రం ఏకంగా 19 సంవత్సరాల తర్వాత తన ప్రాపర్టీకి సంబంధించిన డబ్బులు అందాయి. తనకు రావాల్సిన డబ్బుల కోసం ఆమె దాదాపు రెండు దశాబ్దాల పాటు పోరాటం చేయాల్సి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

డోరీన్ ఫెర్నాండెజ్ (78) అనే మహిళ తన పూర్వీకుల బంగ్లాను 1994లో రహేజాస్‌కి రీడెవలప్‌మెంట్‌కి ఐదు ఫ్లాట్‌ల ఎక్స్‌ఛేంజ్ కింద ఇచ్చారు. అయితే.. రహేజాస్ డెవలపర్స్ ఆ బంగ్లాను మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్ మేనల్లుడు సమీర్ భుజ్‌బల్‌కు చెందిన పర్వేష్ కన్‌స్ట్రక్షన్‌కు విక్రయించింది. అక్కడ ఆ సంస్థ కొన్ని అంతస్తుల భవనాన్ని నిర్మించింది. అయితే.. ఫెర్నాండెజ్ కుటుంబానికి మాత్రం ఒక్క రూపాయి కూడా అందలేదు. తన ఆస్తికి సంబంధించి డబ్బు దక్కకపోవడంతో ఫెర్నాండెజ్ న్యాయపోరాటం మొదలుపెట్టారు. అయితే.. తాను ఆ బంగ్లాను రహేజా కంపెనీ నుంచి కొన్నానంటూ సమీర్ భుజ్‌బల్ అప్పట్లో చెప్పారు. మానవతా దృక్పథంతో ఆమెకు రూ.50 లక్షల ఆఫర్ కూడా చేశారు. కానీ.. ఫెర్నాండెజ్ మాత్రం దాన్ని తిరస్కరించి, తన పోరాటాన్ని కొనసాగించారు.


ఎట్టకేలకు 19 సంవత్సరాల తర్వాత డోరీన్ ఫెర్నాండెజ్‌కు న్యాయం దక్కింది. పర్వేష్ కన్‌స్ట్రక్షన్ నుండి ఆమెకు రూ.8.41 కోట్లు అందాయి. ఆమెకు న్యాయం చేకూర్చడంలో సామాజిక కార్యకర్త, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ నాయకురాలు అంజలి దమానియా కూడా కృషి చేశారు. 2014-15లో భుజ్‌బల్, ఆయన మేనల్లుడు మాజీ ఎంపీ సమీర్ అరెస్ట్ అయినప్పుడు.. ఫెర్నాండెజ్ కుటుంబ దుస్థితిని ఆమె ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. కానీ.. కొన్నాళ్లకే ఆ వ్యవహారం కనుమరుగైంది. ఇప్పుడు ఆమెకు న్యాయం దక్కడంతో.. ఆమె ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఫెర్నాండెజ్ బకాయిల్ని పర్వేష్ ఖన్‌స్ట్రక్షన్స్ చెల్లించిందని, తన ముగ్గురు ఆటిస్టిక్ పిల్లల భవిష్యత్తు గురించి ఆమె ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఇదే సమయంలో.. ఫెర్నాండెజ్‌కు బకాయిలు చెల్లింపులయ్యేలా చేసినందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లకు అంజలి దమానియా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుప్రియా సూలే ఈ విషయంలో చాలా సహాయం చేశారని, ఆమెకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. మరోవైపు.. ఈ న్యాయ పోరాటంలో ఫెర్నాండెజ్ చాలా కష్టాలు ఎదుర్కుంది. 2021లో తన భర్త క్లాడ్ ఫెర్నాండెజ్‌ను కోల్పోయింది. ప్రస్తుతం తన ముగ్గురు ఆటిస్టిక్ కుమారులతో కలిసి నివసిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తనకు న్యాయం దక్కడంతో.. తనకు చాలా సంతోషంగా ఉందని, ఇప్పుడు తన ముగ్గురు కుమారుల భవిష్యత్తు సురక్షితంగా ఉందని చెప్పారు.

‘‘దీని కోసం నేను చాలాకాలం నుంచి వేచి చూస్తున్నాను. ఎన్నో సమావేశాలకు హాజరుకావలసి వచ్చింది. నాకు న్యాయం చేకూర్చడంలో సహాయంలో చేసిన అంజలి దమానియాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా కొడుకులు సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు నేను ఈ డబ్బును పొదుపు చేయాలి. వారికి ప్రత్యేక అవసరాలంటూ కొన్ని ఉన్నాయి. చాలా శ్రద్ధ తీసుకోవాలి. వాళ్లు మూడు ఫ్లాట్‌ల అమౌంట్‌ని ఇచ్చారు. నిజానికి.. ఐదు ఫ్లాట్స్ ఇస్తామని వాగ్ధానం చేశారు. కానీ.. ఇప్పుడు మాకు లభించిన దానితో సంతృప్తి చెందాను. భవిష్యత్తులో మెరుగైన జీవితాన్ని గడపాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని డొరీన్ ఫెర్నాండెజ్ చెప్పుకొచ్చారు.

Updated Date - Jan 03 , 2024 | 10:08 PM