Share News

గడువును పెంచం!

ABN , Publish Date - Mar 12 , 2024 | 03:05 AM

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాల వెల్లడికి సమయం కావాలంటూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

గడువును పెంచం!

‘‘ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించాలంటూ మేం ఫిబ్రవరి 15న తీర్పు ఇచ్చాం. ఇప్పటివరకు దీనిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పలేదు. ‘ఇదిగో మేం ఈ పని చేశాం. మాకు మరికొంత సమయం కావాలి’ అని చెప్పి ఉండాల్సింది. ఎస్‌బీఐ నుంచి మేం ఆ నిష్పాక్షికతను ఆశిస్తాం.’’

- సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యలు

ఎన్నికల బాండ్ల వివరాలు నేడు ఈసీకి ఇవ్వండి

ఎస్‌బీఐని ఆదేశించిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం

గడిచిన 26 రోజుల్లో ఏం చర్యలు తీసుకున్నారని నిలదీత

గడువు పొడిగింపు కోరుతూ వేసిన పిటిషన్‌ కొట్టివేత

ఎస్‌బీఐ ఇచ్చిన వివరాల్ని 15 సాయంత్రం 5 గంటల్లోగా

అధికారిక సైట్‌లో పెట్టాలని ఈసీకి ఆదేశం

మోదీ అసలు స్వరూపం బయటపడబోతోంది: రాహుల్‌

న్యూఢిల్లీ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఎలక్టోరల్‌ బాండ్ల వివరాల వెల్లడికి సమయం కావాలంటూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మంగళవారం (మార్చి 12) సాయంత్రంకల్లా ఆ వివరాలన్నింటినీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించి తీరాల్సిందేనని.. ఎన్నికల కమిషన్‌ ఆ వివరాలను వచ్చే శుక్రవారం (మార్చి 15) సాయంత్రం 5 గంటలకల్లా తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించాలని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను మార్చి 13లోగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలంటూ ఫిబ్రవరి 15న తాము ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే.. ‘ఉద్దేశపూర్వక ఉల్లంఘన’గా భావించి ఎస్‌బీఐపై తగినచర్యలు చేపడతామని హెచ్చరించింది. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని ఫిబ్రవరి 15న సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. 2019 ఏప్రిల్‌ 12 నుంచి ఎన్నికల బాండ్లను కొన్నవారి వివరాలు, వాటి విలువ, వాటిని ఎవరు స్వీకరించారు? అనే వివరాలను మార్చి 6లోగా ఈసీకి తెలపాలని ఎస్‌బీఐకి.. మార్చి 13లోగా ఆ వివరాలను తన వెబ్‌సైట్‌లో పెట్టాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఎస్‌బీఐ నిర్ణీత గడువులోపు ఆ వివరాలను ఈసీకి సమర్పించకపోగా.. అందుకు ఇచ్చిన గడువును జూన్‌ 30 దాకా పొడిగించాలని సుప్రీంను కోరింది. దీంతో ఎస్‌బీఐపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఎస్‌బీఐ తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే వాదనలు వినిపించారు. దాతలు, గ్రహీతలకు సంబంధించిన వివరాలు ఎస్‌బీఐ శాఖల్లోని రెండు చోట్ల ఉంచినందున.. వాటన్నింటినీ సేకరించి, సరిచూసుకోవడానికి మరింత సమయం కావాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సరిచూసే ప్రక్రియ వద్దంటేగనక.. మూడువారాల్లో వివరాలు సమర్పించగలమన్నారు. ఇందుకు ధర్మాసనం.. అలా సరిపోల్చాలని తాము ఆదేశించలేదని గుర్తుచేసింది. కేవలం ఆ వివరాలను ఈసీకి ఇవ్వాలని చెప్పినట్టు వివరించింది. అంతేకాదు.. ఫిబ్రవరి 15నాటి తీర్పులో తాము ఇచ్చిన ఆదేశాల అమలుకు ఎస్‌బీఐ తీసుకున్న చర్యలు ఏంటని కూడా ధర్మాసనం నిలదీసింది. ‘‘గడిచిన 26 రోజుల్లో మీరు ఏమేం చర్యలు తీసుకున్నారు? మీరు దాఖలు చేసిన అప్లికేషన్‌లో ఆ వివరాలేవీ లేవు’’ అని ప్రశ్నించింది. దీనికి సాల్వే.. కోర్టు ఆదేశాల మేరకు బాండ్ల జారీని నిలిపివేసినట్టు తెలిపారు. తమ ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎస్‌బీఐ చైర్మన్‌, ఎండీని ఆదేశించారు.

మోదీ విరాళాల వ్యాపారం..

ఎస్‌బీఐ వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించడంపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. మోదీ సర్కారు కుటిల తంత్రాల నుంచి ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు మరోసారి కాపాడిందని కొనియాడింది. ‘‘నరేంద్రమోదీ విరాళాల వ్యాపారం బయటపడబోతోంది’’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. ‘‘పగ్గాలు చేపట్టిన 100 రోజుల్లోగా.. స్విస్‌బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన (మోదీ) సర్కారు.. సొంత బ్యాంకులో సమాచారాన్ని దాచడానికి ఆపసోపాలు పడింది’’ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల బాండ్లు భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలవబోతున్నాయని.. అవినీతి పారిశ్రామికవేత్తలతో సర్కారు మిలాఖత్‌ను బయటపెట్టడం ద్వారా నరేంద్రమోదీ అసలు స్వరూపాన్ని దేశ ప్రజలకు చూపబోతున్నాయని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

Updated Date - Mar 12 , 2024 | 03:05 AM