Share News

రైలు టికెట్లకూ డబ్బుల్లేవ్‌

ABN , Publish Date - Mar 22 , 2024 | 04:57 AM

తమ పార్టీ బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేయటం వల్ల రైలు టికెట్లు కూడా కొనలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నామని కాంగ్రెస్‌ అగ్రనేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

రైలు టికెట్లకూ డబ్బుల్లేవ్‌

పార్టీ బ్యాంకు ఖాతాల స్తంభనతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించలేకపోతున్నాం

ఎవరికీ రెండు రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి

మోదీ కుట్ర ప్రకారమే మా ఆర్థిక వనరులపై దాడి

తక్షణం బ్యాంకు ఖాతాల స్తంభనను తొలగించాలి

మీడియాతో కాంగ్రెస్‌ నేతలు సోనియా, ఖర్గే, రాహుల్‌

ఓటమి తప్పదనే సాకులు చెబుతున్నారు: బీజేపీ

కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను జప్తు చేయలేదు.. రూ.135 కోట్లను రికవరీ చేశాం: ఐటీ వర్గాలు

న్యూఢిల్లీ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): తమ పార్టీ బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేయటం వల్ల రైలు టికెట్లు కూడా కొనలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నామని కాంగ్రెస్‌ అగ్రనేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ రెండు రూపాయాలూ ఇవ్వలేని స్థితిలో ఉన్నామని తెలిపారు. ఎన్నికల వేళ ఇది అత్యంత తీవ్రమైన దాడి అని.. ప్రధాని మోదీ కుట్రపూరితంగా దీనిని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల బరిలో పోటీ పడటానికి తమకూ సమాన అవకాశాలు లభించేలా రాజ్యాంగ సంస్థలు జోక్యం చేసుకోవాలని, తమ ఖాతాల స్తంభనను తక్షణం ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. ఇది కాంగ్రె్‌సకు మాత్రమే పరిమితమైన అంశం కాదని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే విషయమని చెప్పారు. పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీలతో కలిసి కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీని ఆర్థికంగా కుప్పకూల్చేందుకు ప్రధాని మోదీ ఒక పద్ధతి ప్రకారం కుట్రను అమలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలక్టోరల్‌ బాండ్లతో బీజేపీ అత్యధికంగా ప్రయోజనం పొందిందని, కాంగ్రె్‌సను మాత్రం ఆర్థికంగా అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ కనీవినీ ఎరగనిదన్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రజలు తమకు ఇచ్చిన విరాళాలను కూడా వాడుకోకుండా తమ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారని తెలిపారు. పార్టీ ఖాతాల నుంచి డబ్బును బలవంతంగా లాక్కొంటున్నారన్నారు. పరిస్థితులు చాలా ఆందోళనకరంగా తయారయ్యాయని, ఇది కాంగ్రె్‌సను మాత్రమే కాకుండా భారత ప్రజాస్వామ్యాన్ని కూడా మౌలికంగా ప్రభావితం చేసే తీవ్రమైన అంశమని సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం తమ పార్టీ బ్యాంకు ఖాతాల స్తంభనను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

బీజేపీది డేంజరస్‌ గేమ్‌: ఖర్గే

ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ పడకూడదని, ఎన్నికలు ఏకపక్షంగా తమకు అనుకూలంగా జరగాలని బీజేపీ భావిస్తోందని ఖర్గే ఆరోపించారు. బీజేపీ ప్రమాదకరమైన ఆట ఆడుతోందని, ఇది దేశంపై దీర్ఘకాలంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరించారు. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే.. ఎన్నికల్లో పోటీ పడటానికి అందరికీ సమాన అవకాశాలుండాలి. దేశంలోని రాజ్యాంగబద్ధమైన సంస్థలు స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని కోరుకుంటే బ్యాంకు ఖాతాలను ఉపయోగించుకోవటానికి కాంగ్రె్‌సకు అనుమతించాలి’ అని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు పన్నుల నుంచి మినహాయింపు ఉంటుందని, బీజేపీ కూడా ఎన్నడూ పన్ను చెల్లించలేదన్నారు. అయినప్పటికీ, తమను పన్ను చెల్లించాలని చెబుతున్నారని, దీనిపై కోర్టు తుది తీర్పు కోసం వేచి చూస్తామని ఖర్గే తెలిపారు. సుప్రీంకోర్టు చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న ఎన్నికల బాండ్ల పథకం కింద బీజేపీ తన ఖాతాలో రూ.6 వేల కోట్లకు పైగా నగదు జమ చేసుకున్నదని.. ఆ పార్టీకి లభించే నగదుకు ఎలాంటి లెక్కలుండవని ఖర్గే ఆరోపించారు.

భారత్‌లో ప్రజాస్వామ్యం లేదు: రాహుల్‌

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా నేరపూరిత చర్యలకు పాల్పడ్డారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ‘ఎన్నికలకు రెండు నెలల ముందు పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయటం వల్ల మా పార్టీ అభ్యర్థులకు, కార్యకర్తలకు అండగా ఉండలేకపోతున్నాం. మా పార్టీ నేతలు విమానంలో కాదుకదా రైలులో కూడా ప్రయాణించలేకపోతున్నారు. మా పార్టీకి దేశంలోని ఓటర్లలో 20 శాతం మంది ఓటేశారు. కానీ, ఇప్పుడు ఏ అవసరానికైనా ఓ రెండు రూపాయలు చెల్లించే పరిస్థితి కూడా మాకు లేకుండా పోయింది. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించలేకపోతున్నాం’ అని రాహుల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన కోర్టులు, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలు ఉన్నప్పటికీ.. ఏమీ జరగటం లేదన్నారు. ‘నేడు భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు. భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేది శుద్ధ అబద్ధం’ అని రాహుల్‌ పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్‌ నేతల ఆరోపణలపై ఐటీ శాఖ అధికారిక వర్గాలు స్పందిస్తూ.. ఆ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయలేదని, రూ.135 కోట్ల మొత్తాన్ని మాత్రం ఆ ఖాతాల నుంచి రికవరీ చేశామని తెలిపాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టాక్స్‌ రిటర్నులకు 2018 డిసెంబరు 31వ తేదీ గడువు కాగా, కాంగ్రెస్‌ పార్టీ 2019 ఫిబ్రవరిలో రిటర్నులు దాఖలు చేసిందని ఆ వర్గాలు తెలిపాయి. ఒక నగదు విరాళం రూ.2 వేలకు మించొద్దనే నిబంధనను ఉల్లంఘిస్తూ ఆ పార్టీ రూ.14 లక్షల నగదు విరాళాలు సేకరించిందని పేర్కొన్నాయి. కాగా, తమ బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేయటాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆదాయపు పన్ను అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఈ నెల 8న తోసిపుచ్చింది. హైకోర్టులోనూ కాంగ్రె్‌సకు ఉపశమనం లభించలేదు.

ఓటమికి సాకు: బీజేపీ

వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థమైనందునే కాంగ్రెస్‌ పార్టీ ఓ సాకును వెతుక్కుంటోందని బీజేపీ విమర్శించింది. తమ హయాంలో అనేక కుంభకోణాల ద్వారా పోగు చేసుకున్న సొమ్మును ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలంటూ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నేతలు తమ తప్పులను దిద్దుకోవాల్సింది పోయి దేశంలోని ప్రజాస్వామ్యంపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ ఎంతగా మాట్లాడితే కాంగ్రెస్‌ అంత నష్టపోతుందని బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 04:57 AM