Share News

ఉగ్రవాదాన్ని పెంచే దేశాలను ఏకాకిని చేయాలి

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:55 AM

ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సమర్థించలేమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

ఉగ్రవాదాన్ని పెంచే దేశాలను ఏకాకిని చేయాలి

ఎస్‌సీవో సదస్సులో ప్రధాని మోదీ పిలుపు

అస్తానా, జూలై 4: ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సమర్థించలేమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న, ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన దేశాలను ఏకాకిని చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. కజకిస్థాన్‌ అధ్యక్షతన అస్తానాలో నిర్వహిస్తున్న షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఎస్‌సీవో) సదస్సులో మోదీ సందేశాన్ని విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ చదివి వినిపించారు. ‘‘ఎస్‌సీవో ఒక సూత్ర ఆధారిత సంస్థ. ఇది దాని సభ్య దేశాల పరస్పర అంగీకారంతో నడుస్తుంది. ఇవి మిగిలిన దేశాల సార్వభౌమత్వాన్ని, స్వాతంత్ర్యాన్ని, ప్రాంతీయ ఐక్యతను, సమానత్వాన్ని పరస్పరం గౌరవిస్తాయి. అలాగే ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో మరొకటి జోక్యం చేసుకోదు’ అని మోదీ పేర్కొన్నారు. ఎస్‌సీవో వాస్తవ లక్ష్యాల్లో ఒకటైన ఉద్రవాద నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

భారత్‌, చైనా సరిహద్దు సమస్యల సత్వర పరిష్కారం

సరిహద్దు వివాదానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలను రెట్టింపు చేయాలని భారత్‌, చైనా అంగీకరించాయి. గురువారం ఎస్‌సీవో సదస్సుకు హాజరయ్యేందుకు కజకిస్థాన్‌లోని అస్తానా వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అక్కడ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దు వెంబడి సమస్యల పరిష్కారానికి చర్చలను వేగవంతం చేయాలని ఇద్దరు నేతల మధ్య అంగీకారం కుదిరింది.

Updated Date - Jul 05 , 2024 | 07:03 AM