Share News

‘పతంజలి’కి కోర్టు ధిక్కరణ నోటీసులు

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:29 AM

కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న ఆరోపణలపై యోగా గురు బాబా రాందేవ్‌ ఆధ్వర్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థకు, దాని ఎండీ ఆచార్య బాలకృష్ణకు మంగళవారం సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.

‘పతంజలి’కి కోర్టు ధిక్కరణ నోటీసులు

తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వైద్య

ఉత్పత్తుల ప్రకటనలపై సుప్రీం ఆంక్షలు

తప్పుడు సమాచారం ఇవ్వొద్దన్న ఆదేశాలు

ఉల్లంఘించినట్టు ఐఎంఏ ఫిర్యాదు

యోగాతో మధుమేహం, ఉబ్బసం పూర్తిగా

తగ్గుతాయనడంపై అభ్యంతరం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న ఆరోపణలపై యోగా గురు బాబా రాందేవ్‌ ఆధ్వర్యంలోని పతంజలి ఆయుర్వేద సంస్థకు, దాని ఎండీ ఆచార్య బాలకృష్ణకు మంగళవారం సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకూడదన్న కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారన్న ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పతంజలి సంస్థ తయారు చేసే వైద్య ఉత్పత్తుల ప్రకటనలపై ఆంక్షలు విధించింది. అలోపతిపై ‘పతంజలి’ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోందంటూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా పతంజలి సంస్థ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ గత ఏడాది ఐఎంఏ పిటిషన్‌ వేసింది. ప్రత్యామ్నాయ వైద్య విధానాల పేరుతో కొన్ని సూచనలు చేసి తప్పుడు ప్రకటనలు ఇచ్చిందని ఆరోపించింది. విచారణ జరిపిన ధర్మాసనం తప్పుడు, తప్పుదోవ పట్టించే ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలు అమలు కావడం లేదని ఐఎంఏ తరఫున సీనియర్‌ న్యాయవాది పి.ఎ్‌స.పట్వాలియా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. యోగా ద్వారా మధుమేహం, ఉబ్బస వ్యాధులు పూర్తిగా నయమవుతాయంటూ ప్రకటనలు ఇచ్చిందని తెలిపారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పతంజలి సంస్థకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను మార్చి 15కు వాయిదా వేసింది.

Updated Date - Feb 28 , 2024 | 03:29 AM