Share News

ఆప్‌ను నేలమట్టం చేసే కుట్ర

ABN , Publish Date - Apr 04 , 2024 | 04:39 AM

లోక్‌సభ ఎన్నికలకు ముందే ఆమ్‌ ఆద్మీ పార్టీని (ఆప్‌ను) నేలమట్టం చేయాలనే దురుద్దేశంతోనే తనను అరెస్టు చేశారని ఆ పార్టీ అధినేత,

ఆప్‌ను నేలమట్టం చేసే కుట్ర

ఎన్నికలకు ముందే ఆ పని చేయాలని కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు

ఢిల్లీ హైకోర్టులో అభిషేక్‌ సింఘ్వీ వాదనలు

ఆయన పాత్రపై ఆధారాలున్నాయి: ఈడీ

తీర్పు రిజర్వు చేసిన న్యాయమూర్తి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికలకు ముందే ఆమ్‌ ఆద్మీ పార్టీని (ఆప్‌ను) నేలమట్టం చేయాలనే దురుద్దేశంతోనే తనను అరెస్టు చేశారని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో బుధవారం సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. పిటిషన్‌ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వు చేశారు. అంతకుముందు కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఆప్‌ను సర్వనాశనం చేసి ఢిల్లీలోని ఏడు లోక్‌సభ సీట్లలో విజయం సాధించాలనే లక్ష్యంలో భాగంగానే కేజ్రీవాల్‌ను కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ అరెస్టు చేయించిందని ఆరోపించారు. ఈ మేరకు, పోలింగ్‌ రోజు తొలి ఓటు పడటానికి ముందే ఆప్‌ను నేలమట్టం చేయడం ఈడీ ఉద్దేశమన్నారు. ఎన్నికలకు ముందు ఒక పార్టీ అధినేతను, ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం సరైంది కాదని, ఎన్నికల్లో అందరికీ సమానావకాశాలు కల్పించాలనే ప్రజాస్వామ్య మూలసూత్రాలను ఇది కాలరాస్తుందని సింఘ్వీ చెప్పారు. కేజ్రీవాల్‌ నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని, కానీ, దీనికోసం ఈడీ ఒక్కసారి కూడా ప్రయత్నించకుండా ఏకంగా అరెస్టు చేసిందని గుర్తు చేశారు. కొందర్ని అరెస్టు చేసి ఒత్తిడి తెచ్చి వారి నుంచి తమకు కావలసిన విధంగా ప్రకటనలు ఇప్పిస్తారని, అనంతరం వారికి బెయిల్‌ వచ్చేలా చూస్తారని, ఆ తర్వాత వారు అప్రూవర్లుగా మారేందుకు అంగీకరిస్తారని తెలిపారు. ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వారిలో ఇద్దరికి బీజేపీతో ప్రత్యక్ష సంబంధాలున్నాయని, ఒకరు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని సింఘ్వీ తెలిపారు. ఈడీ తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎ్‌సజీ) ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. కేజ్రీవాల్‌ ఢిల్లీ మద్యం కేసులో ప్రధాన కుట్రదారని, ఆయన మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఎన్నికల సమయంలో సీఎంను అరెస్టు చేయటమేమిటన్న వాదనను వ్యతిరేకిస్తూ.. ఒక రాజకీయ నాయకుడు ఎన్నికల ముందు హత్య చేసి తనను అరెస్టు చేయకూడదంటే అంగీకరిస్తామా అని ప్రశ్నించారు. ఒక ఉగ్రవాది ఆర్మీ వాహనాన్ని పేల్చి వేసి, ఎన్నికల్లో పోటీ పడుతున్నా కాబట్టి నన్నేమీ అనొద్దు అంటే ఊరుకుంటామా అని పేర్కొన్నారు. దీనికి సింఘ్వీ అభ్యంతరం తెలుపుతూ.. ఈ కేసుకు సంబంధం లేని విచిత్రమైన పోలికలు తెస్తున్నారని, మద్యం కేసులో కేజ్రీవాల్‌ అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఇంతవరకూ ఈడీ ఒక్క సాక్ష్యమూ సంపాదించలేదని గుర్తుచేశారు. ఏఎ్‌సజీ వాదనలు కొనసాగిస్తూ.. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌ పాత్రపై దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉన్నదని, అయితే, డబ్బులు చేతులు మారినట్లు తాము గుర్తించామని తెలిపారు. కుంభకోణం జరిగిందని, లాభాల వాటా శాతాన్ని పెంచి ముడుపులకు ఉపయోగించారని, హవాలా మార్గంలో ఎన్నికల సమయంలో డబ్బులు పంపారని పేర్కొన్నారు. ఈ మేరకు తమ వద్ద వాట్సాప్‌ చాట్‌లు, హవాలా ఆపరేటర్లు వెల్లడించిన వివరాలు ఉన్నాయన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. మరోవైపు, టీ, నీళ్లు కాచుకోవటానికి ఒక ఎలక్ట్రిక్‌ కెటిల్‌, పుస్తకాలు చదువుకోవటానికి కుర్చీ, టేబుల్‌ కావాలన్న కేజ్రీవాల్‌ విజ్ఞప్తికి ఢిల్లీలోని స్థానిక కోర్టు అంగీకరించి, వాటిని సమకూర్చాలని తీహాడ్‌ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, బుధవారం ఉదయం తన గదిని కేజ్రీవాల్‌ చీపురుతో స్వయంగా శుభ్రం చేసుకున్నారని జైలు అధికారవర్గాలు తెలిపాయి.

కేజ్రీవాల్‌ ఆరోగ్యం క్షీణిస్తోంది: ఆప్‌

అరెస్టు అనంతరం కేజ్రీవాల్‌ ఆరోగ్యం క్షీణిస్తున్నదని, ఆయన ఇప్పటికే 4.5 కిలోల బరువు తగ్గిపోయారని ఆప్‌ ఆందోళన వ్యక్తం చేసింది. తీవ్రమైన మధుమేహం సమస్యతో ఉన్న కేజ్రీవాల్‌ను జైలు పాలు చేసి ఆయన ప్రాణాలతో బీజేపీ చెలగాటమాడుతున్నదని ఆరోపించింది. ఈ మేరకు ఆప్‌ నేత, ఢిల్లీ మంత్రి ఆతిషీ బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘తీవ్రమైన మధుమేహం ఉన్న వారిలో షుగర్‌ లెవల్‌ 50 ఎంజీ/డీఎల్‌ కన్నా తగ్గితే అది అత్యంత ఆందోళనకరం. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడే కేజ్రీవాల్‌ షుగర్‌ లెవల్స్‌ మూడుసార్లు పడిపోయాయి. ఒకసారి ఏకంగా 46 ఎంజీ/డీఎల్‌కు తగ్గిపోయుంది. గత 12 రోజుల్లో కేజ్రీవాల్‌ 4.5 కిలోల బరువు తగ్గారు’ అని తెలిపారు. కేజ్రీవాల్‌కు ఏమైనా జరిగితే బీజేపీ వాళ్లను యావత్‌ దేశం మాత్రమే కాదు, దేవుడు కూడా క్షమించడన్నారు. అయుతే, సోమవారం తీహాడ్‌ జైలుకు వచ్చినప్పటి నుంచీ కేజ్రీవాల్‌ బరువు స్థిరంగా 65 వద్దే కొనసాగుతుందని, ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఇద్దరు డాక్టర్లు కూడా ఆయనను పరీక్షించారని జైలు అధికార యంత్రాంగం బుధవారం ప్రకటన విడుదల చేసింది. కాగా, కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఈ నెల 7వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆప్‌ సమష్టి నిరాహారదీక్షను చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీనికి దేశవ్యాప్తంగా ప్రజలు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చింది. మంగళవారం బెయిల్‌ మీద జైలు నుంచి విడుదలైన ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ, త్వరలో కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియా తదితర ఆప్‌ నేతలు కూడా విడుదలవుతారని ఆశిస్తున్నానని పేర్కొంటూ.. తీహార్‌ జైలు తాళాలు త్వరలో తెగిపడతాయని పేర్కొన్నారు.

ఆతిశీకి బీజేపీ పరువునష్టం నోటీసులు

ఈడీ అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో చేరాలంటూ తనకు ఆఫర్‌ వచ్చిందని, ఈ మేరకు ఓ వ్యక్తి ద్వారా ఆ పార్టీ రాయబారం పంపిందని ఆతిశీ చేసిన ఆరోపణలపై బీజేపీ పరువునష్టం నోటీసులు పంపించింది. తప్పుడు వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని నోటీసుల్లో పేర్కొంది.

Updated Date - Apr 04 , 2024 | 04:39 AM