హిందూమతంపై కాంగ్రెస్ వ్యతిరేకత బహిర్గతం
ABN , Publish Date - Jan 12 , 2024 | 05:45 AM
అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠ కార్యక్రమానికి తమ పార్టీ అగ్రనేతలు హాజరు కావడం లేదన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని బీజేపీ తప్పుబట్టింది. ఇది భారతదేశ సంస్కృతి, హిందూ మతం పట్ల ఆ పార్టీకి అంతర్లీనంగా ఉన్న వ్యతిరేకతను బహిర్గతం చేసిందని ఆరోపించింది.

మోదీపైన ఆ పార్టీ నేతలకు అసూయ, ద్వేషం
ఇప్పుడు దేవుడినే వ్యతిరేకిస్తున్నారు: బీజేపీ
న్యూఢిల్లీ, జనవరి 11: అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠ కార్యక్రమానికి తమ పార్టీ అగ్రనేతలు హాజరు కావడం లేదన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని బీజేపీ తప్పుబట్టింది. ఇది భారతదేశ సంస్కృతి, హిందూ మతం పట్ల ఆ పార్టీకి అంతర్లీనంగా ఉన్న వ్యతిరేకతను బహిర్గతం చేసిందని ఆరోపించింది. ప్రధాని మోదీపై అసూయ, ద్వేషంతో పాటు ఆత్మన్యూనతా భావం వంటి కారణాలతో దేశాన్ని వ్యతిరేకించే స్థాయికి కాంగ్రెస్ వెళ్లిందని, ఇప్పుడు ఏకంగా దేవుడినే వ్యతిరేకిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ధ్వజమెత్తారు. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, అత్యున్నత విలువలకు అయోధ్యలోని రామమందిరం ప్రతీకగా పేర్కొన్నారు. అయితే కాంగ్రె్‌సకు, అలాంటి భావజాలమే ఉన్న దాని మిత్రపక్షాలకు అతివాద రాజకీయాలే ముఖ్యమన్నారు. మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని కర్ణాటక సీఎం సిద్దరామయ్య సమర్థించారు. మతపరమైన కార్యక్రమాన్ని బీజేపీ నేతలు రాజకీయ వ్యవహారంగా మార్చారని ఆరోపించారు. దీనికి నిరసనగా ఆలయ ప్రతిష్ఠను నాలుగు శంకరాచార్య మఠాల పీఠాధిపతులు బహిష్కరించారని చెప్పారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధాన్ని రాజేశాయి. హిందుత్వకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమేనని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు సీటీ రవి మండిపడ్డారు. ‘‘సోమనాథ్ ఆలయాన్ని సర్దార్ పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్, కేఎం మున్షీ పునర్నిర్మించారు అప్పుడు ప్రధానిగా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ, ఆ ఆలయాన్ని సందర్శించనే లేదు. అలాంటప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం అయోధ్యకు ఎలా వెళ్తుంది? ముందు తమకు ఆహ్వానం అందలేదన్నారు. అది అందిన తర్వాత దానిని అంగీకరించడానికి నిరాకరిస్తున్నారు’’ అని రవి ధ్వజమెత్తారు.
రామమందిర ప్రతిష్ఠకు ఆడ్వాణీ: వీహెచ్‌పీ
రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ అగ్రనేత ఆడ్వా ణీ(96) అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కానున్నారని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు అలోక్ కుమార్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి వస్తానని ఆడ్వాణీ చెప్పారని, అవసరమైతే ఆయన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తాను కూడా అయోధ్యకు రావడానికి ప్రయత్నిస్తానని పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ చెప్పారన్నారు. రామమందిరం ట్రస్టు ఆహ్వానాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు తిరస్కరించడంపై అలోక్ స్పందించారు. ప్రధాని మోదీని ఆహ్వానించిన విధంగానే ప్రతిపక్ష నేతలకూ ఆహ్వానాలు పంపామన్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అన్ని పార్టీల అధ్యక్షులనూ ఆహ్వానించామని తెలిపారు. అయోధ్యకు రావాలా, వద్దా అనే విషయాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అలోక్ పేర్కొన్నారు.