ఖర్గేను కాంగ్రెస్ అవమానించింది
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:13 AM
వయనాడ్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వయనాడ్ లోక్‌సభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున ప్రియాంకా గాంధీ బుధవారం నామినేషన్

దళితుడనే ఆయనను దూరం పెట్టారు.. బీజేపీ ఆరోపణ
న్యూఢిల్లీ, అక్టోబరు 24: వయనాడ్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వయనాడ్ లోక్‌సభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున ప్రియాంకా గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ అవమానించిందని బీజేపీ ఆరోపించింది. ప్రియాంకాతోపాటు నామినేషన్ దాఖలు చేసే గదిలోకి ఆయనను పంపలేదని, దీంతో ఆయన గది బయటే వేచి ఉండాల్సి వచ్చిందని పేర్కొంది. దళితుడైనందుకే ఇలా చేశారని విమర్శించింది. ఖర్గే ఆ గది బయటే వేచిచూస్తున్న వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ పార్టీ నేతలు.. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, అమిత్ మాలవీయ ఈ విషయంలో కాంగ్రె్‌సను ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ఖర్గే వంటి సీనియర్ పార్లమెంటేరియన్, దళిత నాయకుడి పట్ల గాంధీ కుటుంబం ప్రవర్తించిన తీరు, ఆయనకు చేసిన అవమానం చూస్తే చాలా బాధగా ఉందని వారన్నారు. కాగా బీజేపీ నేతలు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ విరుచుకుపడింది. సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీతో కలిసి ఖర్గే కూర్చున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.