Share News

CAA : అమల్లోకి సీఏఏ

ABN , Publish Date - Mar 12 , 2024 | 03:03 AM

సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పుడో 2019లో ఆమోదించిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ)..

CAA : అమల్లోకి సీఏఏ

పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలు

నోటిఫై చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌ నుంచి వలస వచ్చిన

ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని ప్రసాదించే చట్టం

ఎలాంటి పత్రాలూ లేకున్నా ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చాన్స్‌

రాజ్యాంగ నిర్మాతల వాగ్దానాన్ని మోదీ నెరవేర్చారు: అమిత్‌షా

ఒక వర్గాన్ని ఏకీకృతం చేసేందుకే సీఏఏ అమలు: విపక్షాలు

న్యూఢిల్లీ, మార్చి 11: సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పుడో 2019లో ఆమోదించిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ).. ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌లో మత మైనారిటీలుగా హింసకు గురై.. ఎలాంటి పత్రాలూ లేకుండా 2014 డిసెంబరు 31కి ముందు మనదేశానికి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చే చట్టమిది. ఆయా దేశాల నుంచి ఇక్కడికి వచ్చినవారిలో ముస్లింలు మినహా మిగతా మతాలవారికి.. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు ఈ చట్టం కింద మన పౌరసత్వం ఇస్తారు. దీనికి దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుందని.. ఇందుకోసం ఒక వెబ్‌సైట్‌ను రూపొందించామని కేంద్ర హోం శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ చట్టం కింద మన పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేవారిని ఎలాంటి పత్రాలూ అడగబోమని ఆయన వెల్లడించారు. మతప్రాతిపదికన పౌరసత్వాన్ని ఇచ్చే ఈ వివాదాస్పద చట్టం 2019 డిసెంబరులో.. ఉభయ సభలతోపాటు, రాష్ట్రపతి ఆమోదం కూడా పొందిన సంగతి తెలిసిందే. అయితే, నిబంధనలు నోటిఫై చేయనందున ఇన్నాళ్లుగా అమల్లోకి రాలేదు. నిజానికి ఏదైనా చట్టం రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందాక.. ఆరునెలల లోపే దానికి సంబంధించిన నిబంధనలను రూపొందించి విడుదల చేయాలని పార్లమెంటరీ వర్క్‌ మాన్యువల్‌ చెబుతోంది. అలా కాని పక్షంలో మరింత గడువు కావాలని సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీని కోరాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కేంద్ర హోం శాఖ 2020 నుంచి పొడిగింపులు కోరుతూ వస్తోంది. సోమవారం విడుదల చేసిన నిబంధనలు.. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌లో మత మైనారిటీలుగా ఉన్నవారు మనదేశ పౌరసత్వాన్ని పొందడానికి ఉపకరిస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ఆయా దేశాల్లో నివసించే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లకు మన రాజ్యాంగ నిర్మాతలు చేసిన వాగ్దానాన్ని ప్రధాని మోదీ నెరవేర్చారని కొనియాడారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చి తీరుతామని ఆయన ఇటీవలికాలంలో పలు సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా... ఒక వర్గాన్ని ఏకీకృతం చేసేందుకే సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ సర్కారు ఈ ఉత్తర్వులు జారీ చేసిందని కాంగ్రెస్‌ సహా పలు పార్టీలు మండిపడ్డాయి. ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాల వెల్లడికి ఎస్‌బీఐకి మరింత గడువు ఇవ్వడానికి సుప్రీంకోర్టు తిరస్కరించడంతో.. పత్రికల్లో దానిపై పతాక శీర్షికల్లో వచ్చే వార్తలను ఆపడానికే మోదీ సర్కారు హుటాహుటిన సీఏఏ నిబంధనలను విడుదల చేసిందని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ జైరామ్‌ రమేశ్‌ ఆరోపించారు. నిబంధనలు నోటిఫై చేయడానికి తొమ్మిదిసార్లు పొడిగింపులు కోరి.. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు విడుదల చేయడమంటే, అది ఎన్నికల్లో ఒక వర్గాన్ని.. ప్రత్యేకించి పశ్చిమబెంగాల్‌, అసోంలో ఒక వర్గాన్ని పోలరైజ్‌ చేయడం కోసమేనని జైరామ్‌ రమేశ్‌ దుయ్యబట్టారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఈ చట్టాన్ని.. మతపరంగా విభజించే చట్టంగా అభివర్ణించారు. తమ రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు కానీయబోమని స్పష్టం చేశారు. కాగా.. 2019లో ఉభయసభల ఆమోదం పొందాక ఈ చట్టాన్ని నిరసిస్తూ వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనల్లో, పోలీసు చర్యల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో.. సోమవారం డిల్లీలోని షాహీన్‌ బాఘ్‌, జామియా తదితర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

కీలకాంశాలు

పాక్‌, అఫ్గాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి.. 2014 డిసెంబరు 31కి ముందు ఇక్కడికి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చే లక్ష్యంతో రూపొందించిన చట్టమిది. దీని ప్రకారం..

అలా వచ్చి మనదేశ పౌరసత్వం కోరేవారు గడిచిన ఏడాది మొత్తం భారత్‌లో నివసించి ఉండాలి. గత పద్నాలుగేళ్లలో కనీసం ఐదేళ్లు ఇక్కడ గడిపి ఉండాలి. గతంలో ఈ వ్యవధి 11 సంవత్సరాలుగా ఉండేది.

రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలులో పొందుపరచిన.. అసోం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలోని గిరిజన ప్రాంతాలను ఈ చట్టంలో మినహాయించారు.

ఏ భారతీయుడి పౌరసత్వాన్నీ ఈ చట్టం కింద తొలగించరు. పైన పేర్కొన్న మూడు దేశాల్లో మతపరమైన అణచివేతకు గురవుతూ.. భారత్‌కు తప్ప వేరే ఏ దేశానికీ వెళ్లే దిక్కులేని ముస్లిమేతరులకుమన పౌరసత్వం కల్పించడమే ఈ చట్టం లక్ష్యం.

Updated Date - Mar 12 , 2024 | 03:59 AM