Share News

బీజేపీ మాయ నుంచి బయటపడితేనే బతుకు

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:57 AM

ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన పేరుతో అధికారంలో ఉన్న బీజేపీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.

బీజేపీ మాయ నుంచి బయటపడితేనే బతుకు

మేం అధికారంలోకి వచ్చాక 30లక్షల ఉద్యోగాల భర్తీ

న్యూఢిల్లీ, మార్చి 26: ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన పేరుతో అధికారంలో ఉన్న బీజేపీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. బీజేపీ మాయ నుంచి బయటపడితేనే దేశ యువత రాత మారుతుందని అన్నారు. యువత ఉపాధి కల్పనకు ప్రధాని మోదీ వద్ద ఉన్న ప్రణాళిక లేంటని ఆయన ప్రశ్నించారు. యువ న్యాయ్‌ ద్వారా ఉపాధి విప్లవం చేపట్టాలని కాంగ్రెస్‌ సంకల్పించిదని, తాము అధికారంలోకి వస్తే ‘పెహ్లీ నౌక్రీ పక్కీ’ పథకం ద్వారా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. మరోవైపు అసంఘటిత కార్మికులకు ఉద్దేశించిన అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) పథకంపై అధికార బీజేపీ.. కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం రాజుకుంది. ఈ పథకం ప్రచారంలో తప్ప వాస్తవంలో లబ్ధిదారులకు చేరడం లేదని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ఆరోపించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ఇచ్చే పెన్షన్‌ ఏ మూలకు రాదని, స్కీమ్‌ను సరిగా డిజైన్‌ చేయలేదని జైరాం విమర్శించారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల స్పందించారు. జైరాం రమేశ్‌ వాస్తవాలను విస్మరించారని పేర్కొన్నారు. ఏపీవై కింద చందాదారులకు కనీసం 8ు ప్రతిఫలం అందేలా ప్రభుత్వ హామీ ఉందని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా, విపక్షాలతో కూడిన ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే సీఏఏను చించి చెత్త బుట్టలో పడేస్తామని కేరళలో ఓ కార్యక్రమంలో థరూర్‌ స్పష్టం చేశారు.

Updated Date - Mar 27 , 2024 | 01:57 AM