Share News

రాజ్యాంగాన్ని మార్చే దమ్ము బీజేపీకి లేదు

ABN , Publish Date - Mar 18 , 2024 | 03:55 AM

బీజేపీదంతా హడావుడేనని.. రాజ్యాంగాన్ని మార్చేంత దమ్ము ఆ పార్టీకి లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు.

రాజ్యాంగాన్ని మార్చే దమ్ము బీజేపీకి లేదు

ఆ పార్టీదంతా హడావుడే.. ప్రజలు మావైపే

ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఐటీ లేకుండా..

ప్రధాని మోదీ ఎన్నికలకు వెళ్లలేరు

56 అంగుళాల ఛాతీ కాదు.. మోదీ డొల్ల మనిషి

2 పార్టీల పోరాటం కాదు.. సిద్ధాంతాల సమరం

బీజేపీది కేంద్రీకృత పాలన.. మాది వికేంద్రీకరణ

వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని కోరాం

కానీ, మా విజ్ఞప్తులను ఈసీఐ పట్టించుకోలేదు

ఐఐటీయన్‌ కంటే రైతు తెలివి తక్కువ వాడేం కాదు

భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో రాహుల్‌

ముంబై, మార్చి 17: బీజేపీదంతా హడావుడేనని.. రాజ్యాంగాన్ని మార్చేంత దమ్ము ఆ పార్టీకి లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రజలు, న్యాయం తమవైపే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్నది రెండు పార్టీల మధ్య పోరాటం కాదని, సిద్ధాంతాల సమరమని వ్యాఖ్యానించారు. ఓ వ్యక్తికి అన్నీ తెలిసినట్లుగా చూపుతూ కేంద్రీకృత పాలన సాగించాలనేది బీజేపీ విధానం అయితే, దీనికి పూర్తి భిన్నంగా తమది వికేంద్రీకరణ విధానమన్నారు. ప్రజల గొంతు వినాలని భావిస్తామని తెలిపారు. పార్లమెంటులో తమకు మూడొంతుల మెజారిటీ ఉంటే రాజ్యాంగాన్ని మార్చేస్తామంటూ బీజేపీ నేత అనంత్‌ హెగ్డే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే రాహుల్‌ స్పందించారు. మణిపూర్‌ నుంచి జనవరి 14న చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర 63వ రోజైన శనివారం మహారాష్ట్ర రాజధాని ముంబైలో ముగిసింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్మారకమైన చైతన్య భూమి వద్ద రాజ్యాంగ పీఠికను పఠించారు. నగరంలో జాతిపిత గాంధీజీ నివసించిన మణి భవన్‌ నుంచి ఆగస్టు క్రాంతి మైదాన్‌కు ఆదివారం నిర్వహించిన న్యాయ సంకల్ప పాదయాత్రలో రాహుల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పాదయాత్రలో.. శివాజీ పార్క్‌లో జరిగిన ఇండియా కూటమి బహిరంగ సభలో రాహుల్‌ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ‘‘మోదీ, ఆరెస్సె్‌సలు.. జ్ఞానం ఒక వ్యక్తికే ఉన్నాయని భావిస్తాయి. రైతుల, కార్మికులు, నిరుద్యోగులకు తెలివి లేదనుకుంటాయి. ఐఐటీ డిగ్రీ ఉన్నంతనే ఓ వ్యక్తికి రైతు కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని భావించలేం’’ అని వ్యాఖ్యానించారు. ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలు లేకుండా మోదీ ఎన్నికలకు వెళ్లలేరని విమర్శించారు. ‘‘56 అంగుళాల ఛాతీ అని చెప్పుకొనే మోదీ ఓ డొల్ల మనిషి. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పడగొట్టారు. మహారాష్ట్ర నేత ఏకంగా సోనియాగాంధీ వద్ద కంటతడి పెట్టుకున్నారు.

ఈ శక్తులతో పోరాడలేకపోయానని వాపోయారు. మేము వీవీప్యాట్‌ స్లిప్పులనే లెక్కించాలని ఈసీఐని కోరాం. కానీ, మా వినతిని పట్టించుకోలేదు’’ అని రాహుల్‌ పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్వేషాలను ఎత్తిచూపేందుకే ‘భారత్‌ జోడో యాత్ర’లను నిర్వహించినట్లు వివరించారు. తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘనవిజయం సాధించి, కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ‘‘మేము లౌకిక, సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఎలక్టోరల్‌ బాండ్లతో బీజేపీ అవినీతి బయటపడింది. కమలదళం నాశనం చేసిన భారతదేశ ఆత్మను పరిరక్షించే ప్రయత్నమే రాహుల్‌గాంధీ జోడో యాత్ర’’ అని పేర్కొన్నారు. తమ కూటమికి ‘ఇండియా’ అని నామకరణం చేసినప్పటి నుంచి.. బీజేపీ ఆ పదాన్నే ఉచ్ఛరించడం మానేసిందన్నారు. విపక్ష నేతలపై ‘అవినీతి’ ముద్ర వేయడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని, ఎలక్టోరల్‌ బాండ్లు బీజేపీనే అవినీతి పార్టీ అని నిరూపించాయని, ఆ పార్టీది ‘వైట్‌కాలర్‌’ కరప్షన్‌ అని ఆరోపించారు. ఎన్‌సీపీ(పవార్‌ వర్గం) అధినేత శరద్‌పవార్‌ మాట్లాడుతూ బీజేపీ తప్పుడు హామీలతో ప్రజలను వంచించిందన్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ మాట్లాడుతూ.. తమ(ఇండియా కూ టమి) పోరాటం మోదీపైనో.. అమిత్‌షాపైనో కా దని, ‘విద్వేష సిద్ధాంతం’పైనే అని అన్నారు. ప్ర జలు ఏకమైతే.. నియంతృత్వం అంతమవుతుందని శివసేన(ఠాక్రేవర్గం) చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మహబూబా ముఫ్తీ, ఝార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పన, కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక, మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్‌ గాంధీ, అంబేడ్కర్‌ మనవడు, వంచిత్‌ బహుజన్‌ ఆఘాడీ(వీబీఏ) చీఫ్‌ ప్రకాశ్‌ అంబేడ్కర్‌, ఇండియా కూటమిలోని పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ రాలేదు. అయితే.. ఓ లేఖను తన ప్రతినిధులతో పంపారు. రాహుల్‌ అరుదైన వ్యక్తి అని, ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఓడిస్తారని అఖిలేశ్‌ పేర్కొన్నారు.

Updated Date - Mar 18 , 2024 | 03:56 AM