Share News

జైలు నుంచే బెంగళూరు పేలుళ్ల కుట్ర!

ABN , Publish Date - Mar 06 , 2024 | 03:28 AM

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం పేలుళ్లకు పాల్పడిన ఘటనలో ఐదుగురు అనుమానితులను ఎన్‌ఐఏ మంగళవారం తమిళనాడులో అదుపులోకి తీసుకుంది.

జైలు నుంచే బెంగళూరు పేలుళ్ల కుట్ర!

ఏడు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

ఐదుగురు అనుమానితులు అదుపులోకి

బెంగళూరు, మార్చి 5(ఆంధ్రజ్యోతి): బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం పేలుళ్లకు పాల్పడిన ఘటనలో ఐదుగురు అనుమానితులను ఎన్‌ఐఏ మంగళవారం తమిళనాడులో అదుపులోకి తీసుకుంది. తమిళనాడు, కర్ణాటక, కేరళ సహా 7 రాష్ట్రాల్లోని మొత్తం 17 ప్రదేశాలలో ఎన్‌ఐఏ సోదాలు జరిపింది. హార్డ్‌ డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లతోపాటు కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. 16 మందికి నోటీసులు జారీ చేసింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న అనుమానిత ఉగ్రవాదులు జైలు నుంచే విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నారని ఎన్‌ఐఏ గుర్తించింది. రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కూడా అందులో భాగమేనని భావిస్తోంది. కీలకసూత్రధారులుగా భావిస్తున్న లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన టి.నాసిర్‌, జునైద్‌ అహ్మద్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు ఉగ్రవాదుల నుంచి బెదిరింపు ఈ-మెయిల్స్‌ వచ్చాయి. రామేశ్వరం ఘటన ట్రయల్‌ మాత్రమేనని, 2.5 మిలియన్‌ డాలర్లు చెల్లించకపోతే మరిన్ని విధ్వంసాలు సృష్టిస్తామని ఆ మెయిల్స్‌లో హెచ్చరించినట్టు సిద్దరామయ్య తెలిపారు. మరోవైపు, ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిని చంపేస్తామన్న మహ్మద్‌ రసూల్‌ అనే వ్యక్తిపై కర్ణాటకలోని యాదగిరి జిల్లా సురపుర పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. యాదగిరి జిల్లాకు చెందిన మహ్మద్‌ రసూల్‌ తెలంగాణలోని హైదరాబాద్‌కు వెళ్లి స్థిరపడ్డాడు. అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు సురపుర పోలీసులు మంగళవారం మీడియాకు తెలిపారు.

Updated Date - Mar 06 , 2024 | 03:28 AM