Share News

Lok Sabha Election2024: ఈసీలో కలకలం!.. అనూహ్యంగా ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ రాజీనామా

ABN , Publish Date - Mar 10 , 2024 | 04:19 AM

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న తరుణంలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల సంఘం (ఈసీ) కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆ

Lok Sabha Election2024: ఈసీలో కలకలం!.. అనూహ్యంగా ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ రాజీనామా

గత నెలలో మరో కమిషనర్‌ పదవీ విరమణ

ఎన్నికల సంఘంలో మిగిలింది సీఈసీ ఒక్కరే

కమిషనర్ల నియామకానికి సిద్ధమవుతున్న కేంద్రం

అరుణ్‌ గోయల్‌ నియామకమూ వివాదాస్పదమే

2022లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన

మరుసటి రోజే కమిషనర్‌గా నియామకం

అప్పట్లో కేంద్రాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, మార్చి 9: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న తరుణంలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల సంఘం (ఈసీ) కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అరుణ్‌ గోయల్‌ రాజీనామాతో ఈసీలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ మాత్రమే మిగిలారు. ఇద్దరు కమిషనర్లలో ఒకరైన అనూ్‌పచంద్ర పాండే గత నెలలో రిటైరయ్యారు. అరుణ్‌ గోయల్‌ పదవీ కాలం 2027 డిసెంబరు 5వ తేదీ వరకు ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సీఈసీ రాజీవ్‌ కుమార్‌ పదవీ విరమణ చేసిన తర్వాత ఆ పదవిని అరుణ్‌ గోయల్‌ చేపట్టే అవకాశం కూడా ఉంది. కానీ, ఆయన హఠాత్తుగా రాజీనామా చేయటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఆయన రాజీనామాకు గల కారణాలేమిటో వెల్లడి కాలేదు. 2022 నవంబరులో ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్‌ నియామకం కూడా వివాదాస్పదమైంది. 1985 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన అరుణ్‌ గోయల్‌ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. రిటైర్మెంట్‌కు కేవలం ఆరు వారాల వ్యవధి మిగిలి ఉండగా.. 2022 నవంబరు 18న స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆ మరుసటి రోజే ఆయనను కేంద్రప్రభుత్వం ఎన్నికల కమిషనర్‌గా నియమించింది. దీనిని వ్యతిరేకిస్తూ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ.. ప్రభుత్వం మెరుపువేగంతో గోయల్‌ నియామకానికి ఆమోదం తెలపటాన్ని విచారణ సందర్భంగా ప్రశ్నించింది. ఈ విధంగా అరుణ్‌ గోయల్‌ నియామకం పెద్ద వివాదమే సృష్టించింది. ఇప్పుడు ఆయన హఠాత్‌ రాజీనామా కూడా పలు ప్రశ్నలు రేకెత్తిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈసీలో ఖాళీల నేపథ్యంలో కొత్త కమిషనర్ల నియామకానికి కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2020 ఆగస్టులోనూ అప్పటి ఎన్నికల సంఘం కమిషనర్లలో ఒకరైన అశోక్‌ లావాసా తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించిన పలు కేసుల్లో ఈసీ తీసుకున్న నిర్ణయాలను ఆయన వ్యతిరేకించారు. ముఖ్యంగా, మోదీ, అమిత్‌షాల కోడ్‌ ఉల్లంఘనలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం.

తొలుత ఈసీలో సీఈసీ ఒక్కరే!

చాలాకాలంపాటు ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) ఒక్కరే ఉండేవారు. 1989 అక్టోబరు 16న తొలిసారిగా ఇద్దరు అదనపు కమిషనర్లను తొలిసారిగా నియమించారు. వారు మరుసటి ఏడాది జనవరి 1వ తేదీ వరకే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 1993 అక్టోబరు 1న ఇద్దరు అదనపు కమిషనర్లను నియమించారు. అప్పటి నుంచీ సీఈసీతోపాటు ఇద్దరు కమిషనర్లు నియమితులవుతున్నారు. ఏకాభిప్రాయం సాధ్యం కానప్పుడు మెజారిటీ ఆధారంగా నిర్ణయాలు ఈసీలో తీసుకుంటున్నారు.

తీవ్ర ఆందోళన కలిగిస్తోంది..: టీఎంసీ

లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ రాజీనామా చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కాంగ్రెస్‌ పేర్కొంది. దీనిపై కచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. ఎన్నికల సంఘం పనితీరులో పారదర్శకత లేదని స్పష్టమవుతోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆరోపించారు. ప్రభుత్వ ఒత్తిడులతో రాజ్యాంగ బద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం (ఈసీఐ) పని తీరు ప్రశ్నార్థకమవుతోందన్నారు. ‘2019 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడినా క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని అశోక్‌ లావాసా వ్యతిరేకించారు. దీంతో ఆయన ఎన్నో విచారణలను ఎదుర్కోవాల్సి వచ్చింది’ అని వేణుగోపాల్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. అరుణ్‌ గోయెల్‌ రాజీనామాతో ఎదురయ్యే పరిస్థితులు చాలా ఆందోళన కలిగిస్తున్నాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీ సాకేత్‌ గోఖలే అన్నారు.

కమిషనర్ల నియామకం ఎలా జరుగుతుంది?

భారత రాజ్యాంగంలోని 324 నుంచి 329 అధికరణలు ఎన్నికల సంఘం సభ్యుల నియామకం, జీతభత్యాలు, కాలపరిమితి, విధులను తెలియజేస్తున్నాయి. ఆర్టికల్‌ 324(2) అధికరణలో సభ్యుల నియామకాన్ని రాష్ట్రపతి చేపడతారని పేర్కొంటూనే.. పార్లమెంటు ఏదైనా చట్టాన్ని చేస్తే.. దాని ప్రకారం నియామకాలు ఉండాలని స్పష్టం చేసింది. అయితే.. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి గత ఏడాది వరకు కేంద్ర ప్రభుత్వం విచక్షణ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకాలు జరిగేవి. సుప్రీం కోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం గతేడాది ‘ద చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ అండ్‌ అదర్‌ ఎలక్షన్‌ కమిషనర్స్‌ అపాయింట్‌మెంట్‌ యాక్ట్‌-2023’ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం.. తొలుత కేంద్ర న్యాయశాఖ మంత్రి, ఇద్దరు కేంద్ర కార్యదర్శులతో సెర్చ్‌ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ ఐదుగురి పేర్లను సెలెక్షన్‌ కమిటీకి పంపాలి. సెలక్షన్‌ కమిటీకి ప్రధాని చైర్మన్‌గా ఉంటారు. లోక్‌సభలో విపక్ష నేత, ప్రధాని సూచించే కేంద్ర మంత్రి సభ్యులుగా ఉంటారు. సెలెక్షన్‌ కమిటీకి కొన్ని విచక్షణాధికారాలుంటాయి. సెర్చ్‌ కమిటీ పరిగణనలోకి తీసుకోని పేర్లను సైతం అవసరమనుకుంటే సెలెక్షన్‌ కమిటీ పరిశీలించవచ్చు. సెలెక్షన్‌ కమిటీ పంపే పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు. సీఈసీ, కమిషనర్లు ఆరేళ్లపాటు లేదా 65 ఏళ్ల వరకూ పదవిలో ఉంటారు.

Updated Date - Mar 10 , 2024 | 06:56 AM