Share News

బస్తర్‌ మే సవాల్‌

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:28 AM

ఛత్త్‌సగఢ్‌లోని బస్తర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి తొలి విడతలో ఈనెల 19న ఎన్నికలు జరుగనున్నాయి.

బస్తర్‌ మే సవాల్‌

1998 నుంచి బీజేపీకి కంచుకోటగా బస్తర్‌

మోదీ హవా ఉన్నా 2019లో ఓటమి

తాజా ఎన్నికల్లో తిరిగి గెలుపుపై ఆశలు

తొలివిడతలో ఈనెల 19న ఇక్కడ ఎన్నికలు

(ఆంధ్రజ్యోతి-సెంట్రల్‌ డెస్క్‌)

ఛత్త్‌సగఢ్‌లోని బస్తర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి తొలి విడతలో ఈనెల 19న ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య గట్టి పోటీ ఉండొచ్చని భావిస్తున్న నియోజకవర్గాలలో ఇదొకటి. కొండగావ్‌, నారాయణ్‌పూర్‌, బస్తర్‌, జగ్దల్‌పూర్‌, చిత్రకోట్‌, దంతెవాడ, బీజాపూర్‌, కొంటా అసెంబ్లీ స్థానాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. హల్బ, భట్ర, గోండు తెగల ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు. 1998 నుంచి ఈ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా ఉంది. ఛత్తీ్‌సగఢ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రేగా ఖ్యాతిగాంచిన బీజేపీ నేత బలిరామ్‌ కశ్యప్‌ ఇక్కడ నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. భత్ర తెగ మేలు కోసం ఆయన విశేషంగా కృషి చేయడంతో ఆ తెగ ఓటర్లంతా బీజేపీ వెంట నిలిచారు. 2011లో ఆయన మరణించినప్పటి నుంచి ఆయన కుమారుడు దినేశ్‌ కశ్యప్‌ ఇక్కడ ఎంపీగా కొనసాగుతూ వచ్చారు. అయితే, 2019లో బీజేపీ ఆయనకు టికెట్‌ నిరాకరించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బైదు రామ్‌ కశ్యప్‌ ఇక్కడ ఓటమి పాలయ్యారు. ఆయనపై కాంగ్రెస్‌ అభ్యర్థి దీపక్‌ బైజ్‌ విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో కొత్త అభ్యర్థి మహేశ్‌ కశ్య్‌పను బీజేపీ ఇక్కడ బరిలోకి దింపింది. ఈయన వీహెచ్‌పీ, బజరంగదళ్‌లలోనూ క్రియాశీలకంగా వివిధ స్థాయిల్లో పనిచేశారు. ఈయన పేరులోనూ కశ్యప్‌ ఉండటం ఆ పార్టీకి కలిసొస్తుందని భావిస్తున్నారు. మరోవైపు సీనియర్‌ నేత కవాసీ లఖ్మాను ఇక్కడ పోటీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ కోరింది. అయితే, లఖ్మా మాత్రం తన కుమారుడు హరీశ్‌ కవాసీకి టికెట్‌ ఇవ్వాలని అడుగుతున్నారు. కొంటా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు గెలిచిన లఖ్మా ఛత్తీ్‌సగఢ్‌ కేబినెట్‌ మంత్రిగా కూడా పనిచేశారు. 2013లో దర్భ లోయలో నక్సల్‌ దాడితో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది.

ఆ దాడిలో 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరిని నక్సల్స్‌ కిడ్నాప్‌ చేశారు. ఆ దాడి నుంచి లఖ్మా ప్రాణాలతో బయటపడటంపై ఆయన ప్రత్యర్థులు ఇప్పటికీ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆయనకు నార్కో ఆనాలసిస్‌ పరీక్ష చేయాలని కూడా పలువురు డిమాండ్‌ చేశారు. ఓటర్లతో మమేకమయ్యే ప్రత్యేక నైపుణ్యం వల్ల ఆయన ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తున్నారని స్థానిక నేతలు చెబుతున్నారు. దీంతోపాటు స్థానిక భాషలన్నింటిలోనూ మాట్లాడగలగడం ఆయనకు కలిసివచ్చింది. అయితే, నారాయణ్‌పూర్‌ కొండగావ్‌ అసెంబ్లీ సెగ్మెంట్లలో లఖ్మాకు అంతగా మద్దతు లేదని చెబుతున్నారు. దీంతోపాటు కాంగ్రె్‌సలోని వర్గపోరు బీజేపీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు దీపక్‌ బైజ్‌ ఈ నియోజకవర్గం నుంచి తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరగా అధిష్ఠానం నిరాకరించింది. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. 2013 నక్సల్స్‌ దాడిలో మరణించిన ప్రముఖ గిరిజన నేత మహేంద్ర కర్మ కుమారుడు చవీంద్ర కర్మ కూడా ఈసారి తనకు టికెట్‌ నిరాకరించడంపై అసంతృప్తితో ఉన్నారు. గతేడాది నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో చవీంద్ర కర్మ దంతెవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాగా, నక్సల్స్‌ను పూర్తిగా అంతమొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన ప్రకటన తమ పార్టీకి కలిసి వస్తుందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. గతేడాది నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మతమార్పిడుల అంశాన్ని బీజేపీ తెరపైకి తెచ్చింది. తాజా ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని కొనసాగించాలనుకుంటోంది. మొత్తంగా జాతీయవాదం డోసు, నక్సల్‌ వ్యతిరేక సెంటిమెంటు, మతమార్పిడుల అంశంతోపాటు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు కూడా ఈ ఎన్నికల్లో బీజేపీకి కలిసి వస్తాయని అనుకుంటున్నారు.

Updated Date - Apr 03 , 2024 | 03:28 AM