Share News

Ayodhya Ram Temple : వెయ్యేళ్లు మన్నేలా.. అయోధ్య రామాలయ విశేషాలెన్నో!

ABN , Publish Date - Jan 21 , 2024 | 04:50 AM

అయోధ్య రామాలయ నిర్మాణంలో విశేషాలెన్నెన్నో..! పూర్తిస్థాయిలో ప్రాచీన ‘నాగర’ శైలిలో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణంలో.. అత్యాధునిక సాంకేతికతనూ వినియోగించారు. సరయూ నది ఒడ్డున..

Ayodhya Ram Temple : వెయ్యేళ్లు మన్నేలా.. అయోధ్య రామాలయ విశేషాలెన్నో!

పూర్తిగా.. ప్రాచీన ‘నాగర’ శైలిలో నిర్మాణం

సిమెంట్‌, స్టీల్‌ లేకుండానే కట్టడాలు

భూకంపాలనూ తట్టుకునేలా నిర్మాణం

అయోధ్య రామాలయ నిర్మాణంలో విశేషాలెన్నెన్నో..! పూర్తిస్థాయిలో ప్రాచీన ‘నాగర’ శైలిలో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణంలో.. అత్యాధునిక సాంకేతికతనూ వినియోగించారు. సరయూ నది ఒడ్డున.. ఇసుకమేటలుగా ఉండే నేలపై.. వెయ్యేళ్లకు పైగా మన్నికగా ఉండేలా మూడంతస్తుల ఆలయాన్ని నిర్మించడం వెనక.. అనేక మంది వైజ్ఞానికుల కఠోర శ్రమ ఉంది. పటిష్ఠమైన పునాదులకు సైన్స్‌ బాటలు వేస్తే.. అత్యంత ప్రాచీనమైన కట్టడ శైలిలో బాలరాముడి ఆలయం నిర్మితమైంది. స్టీల్‌(ఉక్కు), సిమెంట్‌ లేకుండా నిర్మితమైన ఆలయ నిర్మాణం విశేషాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..!

ఉక్కును ఎందుకు వాడలేదంటే..?

ప్రాచీన నాగర/ఉత్తరభారత శిల్పకళ శైలిలో కేవలం రాతినే వినియోగించేవారు. నల్లరాయి, ఇసుకరాయి, ఎర్ర ఇసుక రాయి, గ్రానైట్‌, పాలరాయి.. ఇలా వేర్వేరు రాళ్లను వాడినా.. వాటిని అతికించేందుకు ఎక్కడా కూడా సిమెంట్‌, చివరకు సున్నపురాయిని కూడా వాడేవారు కాదు. నాగర, ద్రావిడ శిల్పకళా శైలిలో.. రాళ్ల మధ్య ఇంటర్‌లాకింగ్‌ పద్ధతిని అందిపుచ్చుకునేవారు. అంటే.. గోడ నిర్మాణంలో వాడే మొదటి రాయికి, రెండో రాయితో లింకు ఉండేలా జాగ్రత్తపడేవారు. 13వ శతాబ్ది వరకు ‘నాగర’ శైలి నిర్మాణాల్లో ఈ పద్ధతిని వాడినా.. 1250లో కోణార్క్‌ సూర్య దేవాలయ నిర్మాణంలో ఇనుమును ఉపయోగించారు. అప్పటి నుంచి నాగర శైలిలో ఇనుము భాగమైంది. కానీ, అయోధ్య మందిరం విషయంలో మాత్రం పూర్తిస్థాయిలో ప్రాచీన నాగర(13వ శతాబ్దికి పూర్వం) శైలిని అనుసరించారు. సిమెంట్‌, ఉక్కును వాడకపోవడానికి గల కారణాలను ఈ నిర్మాణంలో పాలుపంచుకున్న సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీబీఆర్‌ఐ-రూర్కీ) డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రదీ్‌పకుమార్‌ రామంచర్ల వివరించారు. ‘‘కట్టడాల్లో ఉక్కు జీవితకాలం 80-90 ఏళ్ల వరకు ఉంటుంది. కానీ, శతాబ్దాల వరకు ఈ ఆలయం పటిష్ఠంగా ఉండాలని నిర్ణయించాం. అందుకే ఉక్కును పూర్తిగా దూరం పెట్టాం. అందుకే ఈ ఆలయం వెయ్యేళ్ల దాకా మన్నికగా ఉంటుంది. అంతేకాదు..! ఈ మూడంతస్తుల నిర్మాణం 2,500 సంవత్సరాల వరకు భూకంపాలను తట్టుకుని, నిలబడగలదు’’ అని ఆయన పేర్కొన్నారు.

ఇసుక నేలతో పెద్ద చిక్కు..!

ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడానికి ముందు స్ట్రక్చరల్‌ ఇంజనీర్లు, నిపుణులు పలుమార్లు సాయిల్‌ టెస్ట్‌ చేశారు. సరయూ నది సమీపంలో ఉండడం వల్ల అడుగభాగమంతా ఇసుకతో నిండి ఉంది. అలాంటి నేలపై భారీ కట్టడాలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు. దాంతో మన శాస్త్రవేత్తలు ఇసుక నేల ప్రభావం లేకుండా ఉండేందుకు 2.7 ఎకరాల భూమిని 15మీటర్ల లోతు వరకు తవ్వారు. ఆ మట్టి, ఇసుకను తీసివేశారు. ఆ తర్వాత లేయర్లుగా దృఢమైన మట్టిని నింపారు. సాంకేతికత సాయంతో ఏ రకం మట్టి అడుగులో ఉండాలి? అనే అంశాలను బేరీజు వేసుకుని, మొత్తం 47 లేయర్లలో బేస్‌ను పూర్తిచేశారు. దాంతో 13.5 మీటర్ల లోతులో రాతిలాగా పటిష్ఠమైన పునాదిని వేశారు. ఆ తర్వాత పునాది మరింత బలంగా ఉండేలా దక్షిణ భారతదేశం నుంచి తెప్పించిన 6.3 మీటర్ల మందంతో గ్రానైట్‌ను పైభాగంలో వినియోగించారు.

ఆలయ నిర్మాణంలో ప్రముఖులు..

శ్రీరామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అయోధ్య రామాలయాన్ని నిర్మించగా.. ఈ మహా క్రతువులో ఎందరెందరో భాగస్వాములయ్యారు. వీరిలో శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఇస్రో కూడా కీలక సహకారాన్ని అందించింది. గర్భాలయ స్ట్రక్చరల్‌ డిజైన్లను, ఆలయ పునాదులను ‘సూర్య తిలక్‌’ సంస్థ రూపొందించింది. ఆలయ నమూనాలను చంద్రకాంత్‌ సోంపుర రూపొందించారు. ఈయన వంశీయులు 15 తరాలుగా ఆలయ నిర్మాణ నమూనాలను రూపొందించగా.. వీరి సహకారంతో 100కు పైగా దేవాలయాలు రూపుదిద్దుకున్నాయి.

ప్రతి భాగం ప్రత్యేకమే..!

రామాలయంలో బయటి నుంచి సందర్శకులకు కనిపించే భాగాన్ని రాజస్థాన్‌ నుంచి తెప్పించిన ‘బన్సీ పహర్‌పూర్‌’ పింక్‌ ఇసుకరాయితో నిర్మించారు. ఆలయం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 160, మొదటి అంతస్తులో 132, రెండో అంతస్తులో 74 చొప్పున ఇసుక రాతి పిల్లర్లను ఏర్పాటు చేశారు. గర్భగుడి నిర్మాణానికి అత్యంత మేలిమిరకం మక్రానా పాలరాతిని వాడారు.

సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - Jan 21 , 2024 | 04:50 AM