Share News

అయోధ్యకాండలో.. ‘నిర్మోహి అఖాడా’

ABN , Publish Date - Jan 21 , 2024 | 04:44 AM

‘అయోధ్య రామ మందిరం’.. ఈ పేరు వినిపించినప్పుడల్లా ప్రస్తావనకు వస్తుంది ‘నిర్మోహి అఖాడా’. అంతటి సుదీర్ఘ చరిత్ర ఉంది దీనికి. చట్టపరమైన వివాదాలు.. కోర్టు కేసులను ఎదుర్కొంటూ ఆలయం కోసం పోరాటం సాగించిందీ అఖాడా. వైష్ణవ శాఖలోని రామనంది క్రమానికి చెందిన అఖాడాలలో ఇది ఒకటి.

అయోధ్యకాండలో.. ‘నిర్మోహి అఖాడా’

శతాబ్దాల చరిత్రతో పాటు కోర్టు కేసుల్లోనూ ప్రమేయం

‘మందిరం’ వివాదంలో మూడో పక్షంగా పాత్ర

ఒడిదొడుకులను ఎదుర్కొంటూ నిలిచిన ప్రత్యేకత

అయోధ్య, జనవరి 20: ‘అయోధ్య రామ మందిరం’.. ఈ పేరు వినిపించినప్పుడల్లా ప్రస్తావనకు వస్తుంది ‘నిర్మోహి అఖాడా’. అంతటి సుదీర్ఘ చరిత్ర ఉంది దీనికి. చట్టపరమైన వివాదాలు.. కోర్టు కేసులను ఎదుర్కొంటూ ఆలయం కోసం పోరాటం సాగించిందీ అఖాడా. వైష్ణవ శాఖలోని రామనంది క్రమానికి చెందిన అఖాడాలలో ఇది ఒకటి. 1749లో స్థాపితమైనట్లు రికార్డుల్లో ఉంది. దీని సభ్యుడైన గోవింద్‌ దాస్‌.. అయోధ్యలో మొదటి అఖాడాను నెలకొల్పినట్లుగా చరిత్రకారులు పేర్కొన్నారు. దీని సభ్యులు సన్యాసులే అయినప్పటికీ ఆయుధాలు కలిగి ఉంటూ.. ఇతర హిందూ అఖాడాలతో, మత సంబంధిత వివాదాల్లో దూకుడుగా ఉండేవారు. దీంతో ‘మిలిటెంట్‌’ అనే ముద్ర పడింది. గమనార్హం ఏమంటే.. అఖాడాల విస్తరణలో హిందూ-ముస్లిం కోణం ఉండడం. ఫకీర్లు అని పిలిచే మిలిటెంట్‌ ముస్లిం సన్యాసులను ఎదుర్కొనడానికి మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ ఈ అఖాడాలను ప్రోత్సహించారు. గంగా నదిలో స్నానానికి వెళ్లే అఖాడా సభ్యులపై ఫకీర్లు దాడులు చేసి చంపేవారని.. దీంతో అఖాడా నాయకుడు మధుసూదన సరస్వతి, రక్షణ కోరుతూ అక్బర్‌ను సంప్రదించారని చరిత్రకారులు ప్రస్తావించారు. ఇదే అఖాడాలు తర్వాతి కాలంలో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాటం సాగించడం మరో కథ.

1885లో మొదలు..

సిపాయిల తిరుగుబాటుగా పేర్కొనే 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం మరుసటి ఏడాదే అయోధ్య వివాదానికి బీజం పడింది. బాబ్రీ మసీదులో 1858లో నిహంగ్‌ సిక్కు ఫర్కర్‌ ఖల్సా హోమం, పూజలు చేసినట్లు, మసీదు ప్రాంగణంలో దేవుడి చిహాన్ని ప్రతిష్ఠించినట్లు అప్పటి అవధ్‌ థానేదార్‌ శీతల్‌ దూబే ఓ నివేదికలో పేర్కొన్నాడు. ఇక 1883లో ఫైజాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆలయ నిర్మాణాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులివ్వగా.. వాటిని సవాల్‌ చేస్తూ 1885లో నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్‌ రఘువర్‌దాస్‌ ఫైజాబాద్‌ కోర్టులో కేసు వేశారు. వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణానికి అనుమతి కోరారు. కాగా, ఆలయ నిర్మాణంపై.. 1860, 1866, 1870, 1877లో న్యాయస్థానాల్లో దావాలు దాఖలయ్యాయి. 1885 నుంచి పోరాడుతూ వస్తున్న నిర్మోహి అఖాడా తన చివరి కేసును 1959లో వేసింది. సాంకేతిక కారణాలతో ఇది కొట్టివేతకు గురైంది. ఇక 2.27 ఎకరాల వివాదాస్పద భూమిలో మూడింట ఒక వంతును నిర్మోహి అఖాడాకు కేటాయిస్తూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మిగతా భాగాలను రామ్‌లల్లా విరాజ్‌మాన్‌, సున్నీ వక్ఫ్‌ బోర్డులకు కేటాయించింది. కానీ, 2019 ఏడాది నవంబరులో సుప్రీంకోర్టు ఈ తీర్పును కొట్టివేసింది. మొత్తం భూమిని రామ్‌జన్మ భూమి న్యాస్‌కే అప్పగించింది.

పిలుపుపైనా సందిగ్ధత.. చివరకు తెర

అయోధ్యలో రామ మందిర నిర్మాణ పోరాటంలో కీలక పాత్ర పోషించిన నిర్మోహి అఖాడాను ప్రారంభానికి పిలుస్తారా? లేదా? అనే సందిగ్ధత కొన్ని రోజులుగా నెలకొంది. అయితే, వాటికి తెరదించుతూ ఈ అఖాడాకు ఆహ్వానం అందింది. రామజన్మభూమి ట్రస్ట్‌ నుంచి అఖాడాలోని 13 మహంత్‌లకూ పిలుపొచ్చిందని మహంత్‌ దీనేంద్రదాస్‌ తెలిపారు. అందరూ పాల్గొంటున్నారని పేర్కొన్నారు.

ఎంత దగ్గరో.. అంత దూరం..

1992 డిసెంబరు నుంచి అయోధ్యలోని తాత్కాలిక ఆలయంలో ఉన్న రాముడికి పూజాదికాలను నిర్మోహి అఖాడా నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. బాబ్రీ మసీదు ఉన్నప్పుడే.. దాని ఆవరణలోని రామ్‌ చబుత్రాలో సైతం ఈ అఖాడానే చాలా ఏళ్లపాటు పూజలు చేసింది. రామనంది సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తూ వచ్చిన నిర్మోహి అఖాడా.. ఇకమీదట కూడా అదే పద్ధతులను కొనసాగించాలని కోరింది. అయితే, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మాత్రం అందుకు భిన్నంగా.. మిశ్రమ పద్ధతిలో పూజలు నిర్వహిస్తోంది. దీనిపై కినుక వహించిన నిర్మోహి అఖాడా.. కొంతకాలంగా రామ మందిర విషయంలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోంది.

Updated Date - Jan 21 , 2024 | 04:44 AM