పాఠాల్లో అయోధ్య మాయం
ABN , Publish Date - Jun 17 , 2024 | 06:03 AM
గుజరాత్ మత అల్లర్లు, బాబ్రీ మసీదు కూల్చివేత వంటి అంశాలతో కూడిన పాఠాలను సవరించడాన్ని ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ సమర్థించుకున్నారు. మత అల్లర్లు ఉన్న పాఠ్య భాగాలను బోధించడం హింసను ప్రేరేపించి, పౌరులను కుంగుబాటుకు గురిచేసే

అల్లర్ల వివరాలు తీసేసిన ఎన్‌సీఈఆర్‌టీ
బాబ్రీ మసీదు పేరు స్థానంలో 3 గుమ్మటాలు
12వ తరగతి రాజనీతిశాస్త్రంలో మార్పులు
న్యూఢిల్లీ, జూన్ 16: గుజరాత్ మత అల్లర్లు, బాబ్రీ మసీదు కూల్చివేత వంటి అంశాలతో కూడిన పాఠాలను సవరించడాన్ని ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ సమర్థించుకున్నారు. మత అల్లర్లు ఉన్న పాఠ్య భాగాలను బోధించడం హింసను ప్రేరేపించి, పౌరులను కుంగుబాటుకు గురిచేసే ప్రమాదం ఉంటుందని భావించి.. వాటిని తీసివేశామని వివరణ ఇచ్చారు. ఎన్‌సీఈఆర్‌టీని (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్) కాషాయ సంస్థగా మార్చివేశారన్న ఆరోపణను దినేశ్ ప్రసాద్ తిరస్కరించారు. తాజాగా మార్కెట్‌లోకి వచ్చిన 12వ తరగతి రాజనీతి శాస్త్రంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. బాబ్రీ మసీదు అని రాయా ల్సి వచ్చిన చోట మూడు గుమ్మటాల కట్టడం అని పేర్కొన్నారు. 1528లో మీర్ బాబరు బాబ్రీ మసీదును నిర్మించారు అని పూర్వ పాఠంలో ఉండగా, శ్రీరాముని జన్మభూమిలో 1528లో ఇది నిర్మాణమైందంటూ సవరించారు. అయోధ్య గురించి గతంలో నాలుగు పేజీలు ఉన్న పాఠాన్ని రెండు పేజీలకు కుదించారు. హిందువుల పూజల కోసం మసీదు తలుపులు తెరవాలని 1986లో ఫైజాబాద్ జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలు మత హింసకు దారితీశాయని పూర్వ పాఠంలో ఉండగా, దాన్నంతా దాదాపుగా తొలగించారు. ఆలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి పాఠాన్ని కొత్తగా చేర్చారు. ఇలా కత్తిరింపులు, కుదింపులు చేసి సవరించిన 12వ తరగతి రాజకీయ శాస్త్ర పాఠ్య పుస్తకం మార్కెట్‌లోకి రాగానే గగ్గోలు రేగింది. ఈ నేపథ్యంలో దినేశ్ ప్రసాద్ జాతీయ వార్తా సంస్థ పీటీఐ సంపాదకులతో మాట్లాడుతూ దీనిపై వివరణ ఇచ్చారు. ‘‘ఏడాదికోసారి పాఠ్య పుస్తకాలను సవరిస్తూ ఉంటాం. ఇది సాధారణ ప్రక్రియలో భాగం. దీని గురించి గగ్గోలు పడాల్సిన అవసరం లేదు. గుజరాత్ అల్లర్లు, బాబ్రీ మసీదు ధ్వంసం వంటి అంశాలు తొలగింపు సరైనదే. మత అల్లర్లు వంటి వాటి గురించి పెరిగి పెద్దయ్యాక పిల్లలు ఎలాగో తెలుసుకొంటారు. వాటి గురించి ఇప్పటినుంచే తరగతి గదిలో బోధించడం ఎందుకు?’’ అని ఆయన అన్నారు.