అణుశక్తి స్వావలంబన!
ABN , Publish Date - Jul 31 , 2024 | 06:16 AM
దేశంలోనే అత్యాధునిక, అత్యంత సంక్లిష్టమైన ‘ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్’ (పీఎ్‌ఫబీఆర్) సాకారం దిశగా మరో ముందంజ పడింది. తమిళనాడులోని కల్పక్కంలో నిర్మిస్తున్న ఈ అణుకేంద్రంలో అణు ఇంధనాన్ని నింపి, నియంత్రిత శృంఖల చర్యను
కీలక దశలోకి కల్పక్కం ‘ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్’.. ఇంధనం నింపి పరీక్షించటానికి అనుమతి
విజయవంతమైతే రష్యా తర్వాత మన దేశంలోనే ఈ తరహా రియాక్టర్
న్యూఢిల్లీ, జూలై 30: దేశంలోనే అత్యాధునిక, అత్యంత సంక్లిష్టమైన ‘ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్’ (పీఎ్‌ఫబీఆర్) సాకారం దిశగా మరో ముందంజ పడింది. తమిళనాడులోని కల్పక్కంలో నిర్మిస్తున్న ఈ అణుకేంద్రంలో అణు ఇంధనాన్ని నింపి, నియంత్రిత శృంఖల చర్యను ప్రారంభించటానికి అణుశక్తి నియంత్రణ బోర్డు అనుమతి మంజూరు చేసింది. దేశ స్వయంసమృద్ధ అణుశక్తి కార్యక్రమంలో ఇదొక మైలురాయి అని ఈ సందర్భంగా బోర్డు చైర్మన్ దినేశ్ శుక్లా పేర్కొన్నారు. పీఎ్‌ఫబీఆర్ పూర్తయితే ప్రపంచంలోనే ఈ తరహా అణుశక్తి కేంద్రం ఉన్న రెండోదేశంగా భారత్ నిలుస్తుంది. ప్రస్తుతం రష్యా వద్ద మాత్రమే ఇటువంటి న్యూక్లియర్ రియాక్టర్ ఉంది. పీఎ్‌ఫబీఆర్ నిర్మాణం వెనుక 20 ఏళ్లకుపైగా కృషి ఉంది. ఈ అణుకేంద్రాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘భారతీయ నభికియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్’ (భవానీ) అనే సంస్థను 2003లో ఏర్పాటు చేసింది. నాటి నుంచీ పీఎ్‌ఫబీఆర్ నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 200కుపైగా దేశీయ పరిశ్రమలు పాలుపంచుకున్నాయి. ఈ ఏడాది మార్చి 4వ తేదీన ప్రధాని మోదీ పీఎ్‌ఫబీఆర్‌ను సందర్శించారు.
థోరియంను వాడగలిగితే తిరుగుండదు
పీఎ్‌ఫబీఆర్.. 500 మెగావాట్ల శీతల ద్రవ సోడియం రియాక్టర్. నిర్మాణం పూర్తయిన తర్వాత దీంట్లో విద్యుదుత్పత్తి కోసం తొలుత యురేనియం-ప్లుటోనియం సమ్మిళిత ఆక్సైడ్ ఇంధనాన్ని వినియోగిస్తారు. తర్వాత థోరియం ద్వారా యురేనియం-233ని సృష్టించి ఇంధనంగా వాడాలన్నది ప్రణాళిక. మన దేశంలో యురేనియం నిల్వలు పరిమితంగా ఉన్నాయి. ప్లుటోనియం ప్రకృతిలో దొరకదు. ఇక, థోరియం విషయానికొస్తే, దేశంలో థోరియం నిల్వలు విస్తారంగా ఉన్నాయి. థోరియంను అణు ఇంధనంగా ఉపయోగించుకోగలిగితే, విద్యుదుత్పత్తికి సంబంధించి దేశం పూర్తి స్వావలంబనను సాధించగలుగుతుంది. అందుకే థోరియంను ‘ఇంధన అక్షయపాత్ర’గా మన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో హై ఎనర్జీ ఫాస్ట్ న్యూట్రాన్లను వినియోగిస్తారు. అందుకే, వీటికి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లనే పేరు వచ్చింది. పీఎ్‌ఫబీఆర్‌లో ఇంధనాన్ని నింపటం ద్వారా భారత్, అణుశక్తి కార్యక్రమం రెండో దశలోకి ప్రవేశించినట్లవుతుంది. థోరియం నిల్వలను ఉపయోగించుకోగలిగితే మూడో దశ మొదలవుతుంది.
అణువ్యర్థాలను తగ్గించే అత్యాధునిక రియాక్టర్
పీఎ్‌ఫబీఆర్ అత్యాధునిక అణు రియాక్టర్. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఇది దానంతట అదే నిలిచిపోతుంది. దేశంలోని ఇతర అణుకేంద్రాల్లో తొలిదశలో ఉపయోగించిన ఇంధనాన్ని దీంట్లో తిరిగి వాడవచ్చు. తద్వారా అణువ్యర్థాలను గణనీయంగా తగ్గించవచ్చు. అణువ్యర్థాలను ఎలా వదిలించుకోవాలన్న సంక్లిష్ట సమస్యను కూడా ఈ మేరకు పరిష్కరించవచ్చు. పీఎ్‌ఫబీఆర్ విజయవంతమైతే కల్పక్కంలోనే మరో రెండు ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లను నిర్మించాలన్న యోచనతో కేంద్రం ఉంది.