పోలీసు రికార్డులు సాక్ష్యాలా?
ABN , Publish Date - Mar 03 , 2024 | 05:10 AM
గంజాయి పట్టివేత కేసులో ఇద్దరు వ్యక్తులకు తెలంగాణ హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది.
ఎవిడెన్స్ యాక్ట్ అందుకు అనుమతించదు
గంజాయి పట్టివేత కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు
నిందితుల విడుదలకు ఆదేశాలు
న్యూఢిల్లీ, మార్చి 2: గంజాయి పట్టివేత కేసులో ఇద్దరు వ్యక్తులకు తెలంగాణ హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది. వీసమెత్తు సాక్ష్యాధారాలు కూడా లేకుండానే నిందితులకు శిక్ష విధించారని, విచారణ కోర్టు వేసిన శిక్షను హైకోర్టు ఏమాత్రం సమీక్షించకుండా యాంత్రికంగా ఆమోదించిందని మండిపడింది. నిందితులకు శిక్ష నుంచి విముక్తి ప్రసాదిస్తూ తీర్పు జారీ చేసింది. కారులో 80 కిలోల గంజాయిని తరలిస్తున్నారన్న ఆరోపణలపై మహమ్మద్ ఖాలిద్‌తోపాటు మరో వ్యక్తిని పోలీసులు 2009లో అరెస్టు చేశారు. 2010లో విచారణ కోర్టు నార్కోటిక్ చట్టం కింద.. నిందితులు నేరానికి పాల్పడ్డారంటూ తీర్పు చెప్పింది. దీనిపై వారు హైకోర్టులో అప్పీల్ చేయగా.. హైకోర్టు 2022 నవంబరులో విచారణ కోర్టు ఇచ్చిన ఆదేశాలనే సమర్థించింది. దీనిపై నిందితులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసుపై విచారణ జరిపింది. పోలీసు అధికారి రికార్డు చేసిన నిందితుల వాంగ్మూలాన్ని ఎవిడెన్స్ యాక్ట్‌లోని సెక్షన్ 25 ప్రకారం సాక్ష్యంగా అంగీకరించలేమని, ఈ విషయాన్ని విచారణ కోర్టు, హైకోర్టు పూర్తిగా విస్మరించాయని ధర్మాసనం పేర్కొంది. పోలీసులు రికార్డు చేసిన స్టేట్‌మెంట్లను, ఇంటరాగేషన్ నోట్స్‌ను సాక్ష్యంగా ఎలా పరిగణిస్తారని నిలదీసింది. ఈ కేసులో పట్టుబడిన గంజాయిని సరిగా భద్రపరచలేదని, ఫోరెన్సిక్ పరీక్షలనూ సరిగా జరపలేదని ధర్మాసనం పేర్కొంది. ‘మిర్చి బస్తాలతో కలిపి గంజాయిని పట్టుకున్నట్లు రికార్డుల్లో ఉంది. కానీ, మిర్చిని వేరు చేసి వాస్తవానికి దొరికిన గంజాయి ఎంత అన్నదానిని సదరు అధికారి లెక్కించనేలేదు. పంచనామాలోనైతే గంజాయితోపాటు మిర్చి కూడా ఉందన్న విషయమే లేదు’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ కోర్టు, హైకోర్టుల తీర్పులను కొట్టివేస్తూ నిందితులను విడుదల చేయాలని ఆదేశించింది.
ద్విసభ్య ధర్మాసనం తీర్పును
ఇద్దరు జడ్జిల బెంచ్ ఎలా కొట్టివేస్తుంది?
బిల్కిస్ కేసు ముద్దాయిల పిటిషన్
న్యూఢిల్లీ, మార్చి 2: తమ శిక్షను తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని ఇద్దరు ముద్దాయిలు సవాలు చేశారు. దీనిపై మళ్లీ సుప్రీంకోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు. బిల్కి్‌సబానోపై గ్యాంగ్‌రేప్ కేసులో 11 మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షను గతంలో గుజరాత్ సర్కారు తగ్గించింది. దీనిపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు కాగా, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసింది. దాంతో ముద్దాయిలంతా మళ్లీ జైలుకు వెళ్లారు. ఈ తీర్పును రాధేశ్యాం భగవాన్ దాస్ షా, రాజుభాయ్ బాబూలాల్ సోని అనే ముద్దాయిలు సవాలు చేశారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టులోని ఒక ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును మరో ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసినట్టయిందని, ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. బిల్కి్‌సబానోపై అత్యాచారం గుజరాత్‌లో చోటుచేసుకోగా, కేసు విచారణ మాత్రం మహారాష్ట్రలో జరిగింది. ఈ నేపథ్యంలో ముద్దాయిలకు శిక్ష తగ్గింపు అఽధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న ప్రశ్న తలెత్తింది. ఆ అఽధికారం గుజరాత్ ప్రభుత్వానికే ఉందని జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ విక్రంనాథ్‌ల సుప్రీం ధర్మాసనం తీర్పు చెప్పింది. దీన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు కాగా, ఈ సారి జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం ముద్దాయిలు మళ్లీ జైలుకు వెళ్లాలని ఆదేశాలు ఇచ్చింది.