Share News

ఫిరాయింపుదార్లదే నిజమైన పార్టీయా?

ABN , Publish Date - Mar 20 , 2024 | 03:50 AM

ఫిరాయింపుదార్లనే నిజమైన పార్టీగా గుర్తిస్తున్న ప్రస్తుత విధానం ఓటర్ల తీర్పును అపహాస్యం చేయడం కిందకే వస్తుందని మంగళవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ఫిరాయింపుదార్లదే నిజమైన పార్టీయా?

చట్టసభలోని బలాన్నే పరిగణనలోకి తీసుకుంటారా?

ఓటర్లను అపహాస్యం చేయడం కాదా?

ఎన్‌సీపీ వివాదంలో సుప్రీం వ్యాఖ్యలు

‘అలారం’ గుర్తు కోర్టు పరిధిలో ఉందని

అన్ని ప్రకటనల్లో పేర్కొనాలని ఆదేశం

న్యూఢిల్లీ, మార్చి 19: ఫిరాయింపుదార్లనే నిజమైన పార్టీగా గుర్తిస్తున్న ప్రస్తుత విధానం ఓటర్ల తీర్పును అపహాస్యం చేయడం కిందకే వస్తుందని మంగళవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పార్టీ ఫిరాయింపులను నిషేధించడానికి ఉద్దేశించిన రాజ్యాంగంలోని పదో షెడ్యూలును పక్కనపెట్టి ఎన్నికల కమిషన్‌ నిర్ణయాలు తీసుకుంటుండడాన్ని ప్రశ్నించింది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ)లోని అజిత్‌ పవార్‌, శరద్‌ పవార్‌ వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌ల ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. అజిత్‌ పవార్‌ వర్గాన్నే నిజమైన ఎన్‌సీపీగా ఈసీ గుర్తించడాన్ని సవాలు చేస్తూ శఽరద్‌ పవార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌సీపీ ఎన్నికల గుర్తు అయిన ‘అలారం క్లాక్‌’ను అజిత్‌ వర్గానికి కేటాయించడాన్ని కూడా ప్రశ్నించారు. ఆ గుర్తును స్తంభింపచేయాలని కోరారు. ఈ విషయంలో శరద్‌ పవార్‌ వర్గానికి ధర్మాసనం కాస్త ఊరట కలిగించింది. ప్రస్తుత పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వర్గం నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ-శరద్‌చంద్ర పవార్‌ అన్న పేరు పెట్టుకోవచ్చంటూ అనుమతి ఇచ్చింది. ‘బాకా ఊదుతున్న వ్యక్తి’ అన్న చిహ్నాన్ని ఎన్నికల గుర్తుగా వాడుకోవచ్చని తెలిపింది. ‘అలారం క్లాక్‌’ను అజిత్‌ వర్గానికి కేటాయించినా కొన్ని షరతులు విధించింది. ఆ గుర్తు కోర్టు విచారణ పరిధిలో ఉందంటూ ఇంగ్లీషు, హిందీ, మరాఠీ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని అజిత్‌ పవార్‌ వర్గాన్ని ఆదేశించింది.

Updated Date - Mar 20 , 2024 | 03:50 AM