Share News

ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి

ABN , Publish Date - Feb 29 , 2024 | 04:15 AM

ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా తిరుచెందూరు సమీపంలోని కులశేఖరపట్టణం వద్ద కొత్త రాకెట్‌ ప్రయోగ కేంద్రం

ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి

చెన్నై, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా తిరుచెందూరు సమీపంలోని కులశేఖరపట్టణం వద్ద కొత్త రాకెట్‌ ప్రయోగ కేంద్రం నిర్మాణానికి ప్రధాని మోదీ బుధవారం శంకుస్థాపన చేశారు. తేలికపాటి, మధ్యతరహా రాకెట్లను ప్రయోగించేందుకు అనువుగా దీన్ని నిర్మిస్తున్నారు. తూత్తుకుడి హార్బర్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ రాకెట్‌ ప్రయోగకేంద్రం నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. అలాగే, రూ.17,300 కోట్ల వ్యయంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి పనులకు కూడా ఈ సందర్భంగా ప్రధాని శ్రీకారం చుట్టారు. కేంద్రప్రభుత్వం తమిళనాడులో ఎన్నో అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నా.. ఆ వివరాలను ప్రసార మాధ్యమాల్లో రాకుండా డీఎంకే ప్రభుత్వం అడ్డుకుంటోందని ఇదే సభలో మోదీ ఆరోపించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రాభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. కాగా, ఇస్రో కొత్త రాకెట్‌ ప్రయోగ కేంద్రం శంకుస్థాపన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం పత్రికలకు ఇచ్చిన వాణిజ్య ప్రకటనల్లో చైనా రాకెట్‌ను ముద్రించడం వివాదం రేపింది. తిరునల్వేలిలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. చైనా రాకెట్‌ ఫొటోను ముద్రించడాన్ని బట్టి డీఎంకే పాలకుల దేశభక్తి స్పష్టమవుతోందని ఎద్దేవా చేశారు.

Updated Date - Feb 29 , 2024 | 07:32 AM