Share News

AP-TS: ఆస్తి పంపకాలకు వేళాయె!.. తెలంగాణ ప్రతిపాదనకు ఏపీ ఓకే

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:31 AM

దేశ రాజధాని ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న ఆస్తుల విభజనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉమ్మడి(ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ)భవన్‌ విభజనకు మార్గం సుగమమైంది.

AP-TS: ఆస్తి పంపకాలకు వేళాయె!.. తెలంగాణ ప్రతిపాదనకు ఏపీ ఓకే

ఢిల్లీలోని ఉమ్మడి ఆస్తుల విభజనపై ముందడుగు

19.781 ఎకరాలలో.. ఏపీకి 11.356, తెలంగాణకు 8.245 ఎకరాలు

తెలంగాణ ప్రతిపాదనకు ఏపీ ఓకే.. మొత్తం ఆస్తుల విలువ పదివేల కోట్లు

ఆక్రమణకు గురైన భూమికి మరో చోట భూమి ఇవ్వాలన్న రాష్ట్ర సర్కారు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న ఆస్తుల విభజనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉమ్మడి(ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ)భవన్‌ విభజనకు మార్గం సుగమమైంది. మొత్తం 19.781 ఎకరాలలో ఉన్న ఉమ్మడి భవన్‌ ఆస్తులలో ఏపీకి 11,356 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించాలని టి-ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఏపీ సర్కారు సముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ స్పందనను కేంద్ర హోంశాఖ బుధవారం తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసింది. ఏపీ భవన్‌ కింద ఉన్న గోదావరి బ్లాక్‌ 4.315 ఎకరాలు, శబరి బ్లాక్‌తో పాటు అంతర్గత రహదారులు, దుకాణాలు(ఆక్రమణకు గురైన ప్రాంతం) ఉన్న 0.512 ఎకరాలు, నర్సింగ్‌ హాస్టల్‌ 3.359 ఎకరాలు, పటౌడీ హౌస్‌లో 2.396 ఎకరాలు ఏపీకి ఇచ్చేలా ప్రతిపాదన చేశారు. అదే విధంగా శబరి బ్లాక్‌ కింద ఉన్న 3 ఎకరాలు, పటౌడీ హౌస్‌లో ఉన్న 5.245 ఎకరాలు తమకు కేటాయించేలా తెలంగాణ ప్రతిపాదన చేసింది.

అయితే తమకు ప్రతిపాదించిన అంతర్గత రహదారులు, దుకాణాలు(ఆక్రమణలు) ఉన్న ప్రాంతం(0.512 ఎకరాలు) విలువ దాదాపు రూ.250 కోట్లు ఆని, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోలేకపోతే అందుకు సరిసమానమైన భూమిని శబరి బ్లాక్‌ లేదా పటౌడీ హౌస్‌లోని భూమి నుంచి కేటాయించాలని ఏపీ షరతు విధించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరుతూ కేంద్ర హోంశాఖ బుధవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. కాగా ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్‌కు భూములు, భవనాలు సహా దాదాపు రూ.9,913.505 కోట్ల(దాదాపు పది వేల కోట్లు) విలువైన ఆస్తులు ఉన్నాయి. గోదావరి బ్లాక్‌, శబరి బ్లాక్‌, నర్సింగ్‌ హాస్టల్‌, పటౌడీ హౌస్‌ అనే విభాగాల కింద ఉమ్మడి భవన్‌ ఆస్తులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి బయట ఉన్న ఆస్తులను రెండు తెలుగు రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచారు.

Updated Date - Feb 15 , 2024 | 08:21 AM