Share News

పాక్‌లో మతగురువుఅల్లామా మసూద్‌ దారుణ హత్య

ABN , Publish Date - Jan 08 , 2024 | 04:19 AM

కరడుగట్టిన భారత వ్యతిరేకిగా ముద్రపడిన పాక్‌ మతగురువు అల్లామా మసూద్‌ ఉర్‌ రెహమాన్‌ ఉస్మానీ దారుణ హత్యకు గురయ్యారు.

పాక్‌లో మతగురువుఅల్లామా మసూద్‌ దారుణ హత్య

ఇస్లామాబాద్‌లో పట్టపగలే ఘటన

తుపాకీతో కాల్చి చంపిన దుండగులు

భారత వ్యతిరేకిగా మసూద్‌పై ముద్ర

న్యూఢిల్లీ, జనవరి 7: కరడుగట్టిన భారత వ్యతిరేకిగా ముద్రపడిన పాక్‌ మతగురువు అల్లామా మసూద్‌ ఉర్‌ రెహమాన్‌ ఉస్మానీ దారుణ హత్యకు గురయ్యారు. పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ శివారులోని ఘౌరీ టౌన్‌ పరిసరాల్లో శుక్రవారం పట్టపగలు కొందరు దుండగులు ఆయనను అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చి చంపారు. ఇస్లామాబాద్‌ పోలీసుల కథనం మేరకు.. ఉస్మానీ లక్ష్యంగా ఇద్దరు దుండగులు తుపాకీతో అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఇదేసమయంలో ఆయన కారు డ్రైవర్‌ను కూడా తీవ్రంగా గాయపరిచి ఘటనా ప్రాంతం నుంచి పరారయ్యారు. ఈ సంచలన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పాకిస్థానీ మీడియా ‘ది నేషన్‌’ కథనం మేరకు.. పోలీసు అధికార ప్రతినిధి తాఖీ జావేద్‌ ఉస్మానీ హత్య ఘటనను నిర్ధారించారు. ఉస్మానీ మృత దేహాన్ని, తీవ్రంగా గాయపడిన ఆయన డ్రైవర్‌ను పాకిస్థాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌సకు తరలించారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించలేదు. కాగా, భారత దేశానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఉస్మానీ హత్య మత రాజకీయ కోణంలో పాకిస్థాన్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. దేశంలో కొన్ని వేల మంది హత్యకు కారణమైన ఉగ్రవాద సంస్థ సిఫా-ఏ-సహాబాపై పాకిస్థాన్‌ ప్రభుత్వం నిషేధం విధించిన దరిమిలా.. సున్నీ ఉలేమా కౌన్సిల్‌ పేరుతో ఒక సంస్థ ఏర్పాటైంది. దీనికి ఉస్మానీ డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - Jan 08 , 2024 | 04:19 AM