Share News

శక్తిమంతులంతా ఏకమైంది నన్ను దించడానికే

ABN , Publish Date - Apr 21 , 2024 | 03:53 AM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. యూపీలోని కంచుకోట అమేఠీ మాదిరిగానే కేరళలోని వయనాడ్‌ నుంచీ ఆయన పారిపోవడం ఖాయమని ఎద్దేవాచేశారు.

శక్తిమంతులంతా ఏకమైంది నన్ను దించడానికే

కాంగ్రెస్‌ పాకుడు తీగ.. ఆసరా ఇచ్చిన పార్టీలను మింగేస్తుంది

అమేఠీలాగే వయనాడ్‌ నుంచీ రాహుల్‌ పరారే!.. మహారాష్ట్ర, కర్ణాటకల్లో మోదీ ప్రచారం

బెంగళూరు-ఆంధ్రజ్యోతి/నాందేడ్‌/పర్భణీ, ఏప్రిల్‌ 20: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. యూపీలోని కంచుకోట అమేఠీ మాదిరిగానే కేరళలోని వయనాడ్‌ నుంచీ ఆయన పారిపోవడం ఖాయమని ఎద్దేవాచేశారు. శనివారం ఆయన మహారాష్ట్రలోని నాందేడ్‌, పర్బణీ, కర్ణాటకలోని చిక్కబళ్లాపుర, బెంగళూరుల్లో జరిగిన ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ‘ఇండీ’ కూటమి భాగస్వాములైన కాంగ్రెస్‌, వామపక్షాలు కేరళలో పరస్పరం కుస్తీలు పడుతున్నాయని, అవమానించుకుంటున్నాయన్నారు. రాహుల్‌ను తాను కూడా అనని మాటలను(అమూల్‌ బేబీ) ఆ రాష్ట్ర సీఎం విజయన్‌ అంటున్నారని.. వయనాడ్‌లో ఈ నెల 26న పోలింగ్‌ ముగిశాక రాహుల్‌ కోసం కాంగ్రెస్‌ మరో సురక్షితమైన సీటు చూడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు (అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాలకు కాంగ్రెస్‌ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు). దేశంలో నాలుగో వంతు సీట్ల కోసం విపక్ష కూటమి భాగస్వాములు పరస్పరం కొట్లాడుకుంటున్నాయని..జూన్‌ 4న ఫలితాల ప్రకటన తర్వాత జుట్లు జుట్లు పట్టుకుంటాయన్నారు. తొలి దశలో 102 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బూత్‌ స్థాయిలో బీజేపీ విశ్లేషించుకుందని.. ప్రజలు ఏకపక్షంగా ఎన్డీయేకే ఓట్లేశారని తేలిందని చెప్పారు. కాంగ్రెస్‌ తన ఓటమిని అంగీకరించేసిందన్నారు. తన ను ప్రధాని పదవి నుంచి దించివేయడానికి దేశ విదేశాల్లోని పెద్దపెద్ద, శక్తిమంతమైన వాళ్లంతా ఏకమయ్యారని మోదీ విమర్శించారు. అయితే నారీశక్తి, మాతృశక్తి ఆశీస్సులు, సురక్షాకవచంతో ఇలాంటి సవాళ్లను దాటుకుంటూ ముందుకుపోతానని తెలిపారు. కాంగ్రెస్‌ పాకుడు తీగలాంటిందని.. ఆసరా ఇచ్చిన పార్టీలను కబళిస్తుందని ధ్వజమెత్తారు. ప్రస్తుత ఎన్నికలు ప్రభుత్వ ఏర్పాటు కోసం మాత్రమే కాదని.. దేశాన్ని స్వావలంబన కలిగిన అగ్రరాజ్యంగా మలచడం కోసమని చెప్పారు. విపక్ష ఇండీ కూటమికి నాయకుడేలేడని.. భవిష్యత్తు విజన్‌ కూడా లేదని విమర్శించారు. వారిదంతా స్కాముల చరిత్రగా పేర్కొన్నారు. మూడో దఫా ప్రధానినైతే.. ఇంతవరకు ఇల్లు, గ్యాస్‌ కనెక్షన్‌, కుళాయి నీరు అందనివారికి కచ్చితంగా అందిస్తానని.. ఇది ‘మోదీ గ్యారెంటీ’ అని చెప్పారు. మహిళా సంక్షేమానికి తన ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. కర్ణాటకలో అవినీతి తారస్థాయికి చేరిందని.. దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, ఓ విద్యార్థినిని కళాశాలలోనే హత్య చేశారని, భజన చేస్తే దాడులు చేస్తున్నారని విమర్శించారు. చిక్కబళ్లాపుర సభలో మాజీ ప్రధాని దేవెగౌడను మోదీ ప్రశంసించారు. 90 ఏళ్ల వయసులో కూడా ఉత్సాహం, నిబద్ధతతో పనిచేస్తున్నారని.. ఆయన తనకు స్ఫూర్తి అని తెలిపారు.

కమలం గూటికి ప్రియాంక సహాయకుడు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20: కీలకమైన సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైన తర్వాత కూడా కాంగ్రెస్‌ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. హస్తం పార్టీని విలవిల్లాడేలా చేస్తోంది. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సహాయకుడు తాజిందర్‌ బిట్టు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ కార్యదర్శిగా, ఏఐసీసీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన శనివారం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ సమక్షంలో కమలం గూటికి చేరిపోయారు. దీనికి ముందు పార్టీ ప్రాథమిక సభ్యత్వం, ఏఐసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం.. ఫేస్‌బుక్‌ పోస్టులో మాత్రం..‘‘బరువెక్కిన హృదయంతో పార్టీ తో నాకున్న 35ఏళ్ల అనుబంధాన్ని వీడుతున్నా’’అని పేర్కొన్నారు. దివంగత ఎంపీ సంతోఖ్‌ చౌధరి సతీమణి కరమ్‌జిత్‌ కౌర్‌ కూడా కాంగ్రెస్‌ వీడి బీజేపీ బాటపట్టారు. మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్‌ కుఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే హరివల్లభ్‌ శుక్లా సహా పలువురు సీనియర్లు పార్టీకి గుడ్‌బై చెప్పి కమలం గూటికి చేరారు. ఇటీవల అనేక మంది హైప్రొఫైల్‌ నేతలు పార్టీని వీడారు. అహ్మదాబాద్‌ తూర్పు నియోజకవర్గం లోక్‌సభ టికెట్‌ ఇచ్చాక కూడా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రోహన్‌ గుప్తా పార్టీకి గుడ్‌బై చెప్పారు.

Updated Date - Apr 21 , 2024 | 03:53 AM