Share News

అన్ని హద్దులు దాటేశారు

ABN , Publish Date - Apr 03 , 2024 | 03:11 AM

పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ వ్యవస్థాపకుడు యోగా గురువు బాబా రామ్‌దేవ్‌, ఆ సంస్థ ఎండీ బాలకృష్ణలపై మంగళవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అన్ని హద్దులు దాటేశారు

న్యాయస్థానాలంటే గౌరవం లేదా?

పతంజలి’పై సుప్రీంకోర్టు ఆగ్రహం

బాబా రామ్‌దేవ్‌ క్షమాపణలు.. అంగీకరించని ధర్మాసనం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ వ్యవస్థాపకుడు యోగా గురువు బాబా రామ్‌దేవ్‌, ఆ సంస్థ ఎండీ బాలకృష్ణలపై మంగళవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుదోవ పట్టించే విధంగా మీడియా ప్రకటనలు ఇచ్చిన కేసులో తమ ఆదేశాలను పాటించనందుకు తదుపరి చర్యలకు సిద్థంగా ఉండాలని హెచ్చరించింది. అలోపతి వైద్యవిధానాల గురించి తప్పుదోవ పట్టించేలా పతంజలి మీడియా ప్రకటనలు చేసిందని పేర్కొంటూ గతేడాది నవంబర్‌లో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎమ్‌ఏ) పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసుపై జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఐఎంఏ చేసిన పిటిషన్‌పై గతేడాది నవంబర్‌లో విచారణ జరిపిన ధర్మాసనం పతంజలి సంస్థను మందలించింది. మళ్లీ తప్పుదోవ పట్టించే ప్రకటనలు చెయ్యొద్దని ఆదేశించింది. ఇది పునరావృతం కాదని పతంజలి తరఫు న్యాయవాదులు కోర్టుకు హామీ ఇచ్చారు. ఆ హామీని మళ్లీ ఉల్లంఘించడంతో మరోసారి కోర్టులో విచారణ జరిగింది. ఫిబ్రవరిలో జరిగిన విచారణలో పతంజలి వ్యవహార శైలిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలంటూ రామ్‌దేవ్‌ బాబా, బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు స్పందించకపోవడంతో కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

ఈ క్రమంలో న్యాయస్థానాల పట్ల పతంజలి సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చారు. ఈ విషయంలో అన్ని హద్దులు దాటారు. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులు జారీ చేసే ప్రతి ఉత్తర్వును గౌరవించాలి. లేకపోతే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది కదా? కరోనాకు అల్లోపతిలో నివారణ లేదని పతంజలి ప్రకటనలు ఇచ్చినప్పుడు కేంద్రప్రభుత్వం ఎలా కళ్లు మూసుకుంది? ఈ కేసులో రామ్‌ దేవ్‌, బాలకృష్ణ ఒక వారంలోగా మళ్లీ కొత్త అఫిడవిట్లు దాఖలు చేయాలి. ఏప్రిల్‌ 10న మరోసారి న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. రామ్‌దేవ్‌ బాబా క్షమాపణలు చెప్పడానికి సిద్థంగా ఉన్నారని ఆయన తరఫున న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లగా ధర్మాసనం అందుకు అంగీకరించలేదు. లిఖితపూర్వకంగా అఫిడవిట్‌ ద్వారా సమర్పించాల్సిందేనని ఆదేశించింది.

Updated Date - Apr 03 , 2024 | 03:11 AM