Share News

గగన వీరులు సిద్ధం!

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:53 AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర.. గగన్‌యాన్‌ ద్వారా రోదసీలోకి వెళ్లే వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి పరిచయం చేశారు.

గగన వీరులు సిద్ధం!

గగన్‌యాన్‌ వ్యోమగాములను దేశానికి పరిచయం చేసిన మోదీ

వైమానిక దళం నుంచి నలుగురిని

2019లోనే ఎంపిక చేసిన ఇస్రో

యూపీ నుంచి ఇద్దరు, చెన్నై, కేరళ

నుంచి ఒక్కొక్కరు ఎంపిక

నాలుగేళ్లుగా వివిధ స్థాయుల్లో శిక్షణ

వీరు వ్యక్తులు కాదు.. ప్రజల ఆకాంక్షలను

అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు

సరికొత్త శిఖరాలకు భారత కీర్తి

2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం

ఇస్రోలో మహిళా శక్తి అనిర్వచనీయం

‘ఆగస్టు 23’ ఇక.. జాతీయ అంతరిక్ష దినోత్సవం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు

మూడు కీలక ప్రాజెక్టులు జాతికి అంకితం

తిరువనంతపురం, ఫిబ్రవరి 27: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర.. గగన్‌యాన్‌ ద్వారా రోదసీలోకి వెళ్లే వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి పరిచయం చేశారు. గగన్‌యాన్‌ కోసం భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్‌) చెందిన నలుగురిని 2019లోనే ఎంపిక చేశారు. వీరిలో గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్‌ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌, అజిత్‌ కృష్ణన్‌, సుభాంశు శుక్లా ఉన్నారు. వీరిని ప్రత్యేకంగా అభినందించిన ప్రధాని, భారత దేశం నుంచి రోదసీలోకి వెళ్లనున్న వ్యోమగాములు వీరేనని పరిచయం చేశారు. మంగళవారం కేరళలోని తిరువనంతపురంలో పర్యటించిన ప్రధాని తుంబాలోని విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రానికి(వీఎ్‌సఎ్‌ససీ) వెళ్లారు. రోదసీలోకి వెళ్లనున్న వ్యోమగాములను అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘‘40 ఏళ్ల తర్వాత భారతీయులు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ‘సమయం మనదే-కౌంట్‌డౌన్‌ కూడా మనదే’. ప్రతి దేశ అభివృద్ధిలో ఒక సమయం ఆసన్నమవుతుంది. ఈ రోజు ఆ సమయం భారత్‌కు వచ్చింది. మన ప్రస్తుత తరం ఎంతో ధన్యమైంది. ఎందుకంటే, వారు నీటిలోను, భూమి మీద, ఇప్పుడు అంతరిక్షంలో కూడా విజయాన్ని చూడగలుగుతారు. ఇది ఒక కొత్త శకానికి నాంది. ప్రపంచ స్థాయిలో భారత్‌ విస్తరిస్తోంది. ఇప్పుడు అంతరిక్ష రంగంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది’’ అని అన్నారు. ‘‘గతేడాది చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ ప్రయోగించి ప్రపంచంలోనే తొలిదేశంగా కీర్తిగడించాం. నేడు మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారి ఈ దేశం నుంచి నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఈ నలుగురు కేవలం వ్యక్తులు కారు. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లే శక్తులు’’ అని మోదీ పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో ఈ నలుగురి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. నాలుగేళ్లుగా వీరు కఠిన శిక్షణ పొందారని, దీనిలో యోగా కీలక పాత్ర పోషించిందని వివరించారు.

నాలుగేళ్లుగా తపస్సు చేశారు: మోదీ

‘‘రోదసీలోకి వెళ్లే ఈ నలుగురు వీరులు గత నాలుగు సంవత్సరాలుగా తపస్సు చేశారు. వారు ఇంకా చాలా దూరం(అంతరిక్షం) వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో అనేక సవాళ్లు ఉన్నాయి. అయితే, వారు ఇప్పుడు సెలబ్రిటీలు. నాకు తెలుసు.. ప్రజలు వీరితో సెల్ఫీలు దిగాలని, ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలని ఉత్సుకతతో ఉన్నారు. వారి జీవిత విశేషాలు తెలుసుకునేందుకు ఆతృతగా కూడా ఉన్నారు. కానీ, ఇలా చేయడం వారి విజయాలకు ఇబ్బంది కలిగిస్తుంది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. మనమంతా వారికి, వారి కుటుంబాలకు సహకరించాలి. లక్ష్య సాధన దిశగా వారిని ముందుకు నడిపించాలి’’ అని మోదీ అన్నారు.

మహిళల పాత్ర అమోఘం

అంతరిక్ష రంగంలో మహిళల శక్తి కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని కొనియాడారు. ‘‘చంద్రయాన్‌, గగన్‌యాన్‌ ఇలా ఏది రూపుదాల్చినా మహిళా శక్తిని విస్మరించలేం. వారి పాత్ర అమోఘం. దాదాపు 500 మంది మహిళలు ఇస్రోలో నాయకత్వ పాత్ర పోషిస్తున్నారు. వారందరినీ నేను అభినందిస్తున్నా’’ అన్నారు. అంతరిక్ష రంగం యువతను ఎంతో ఆకర్షిస్తోందని తెలిపారు. ఇస్రో సాధిస్తున్న అద్భుతాలను చూసిన చిన్నారులు సైతం శాస్త్రవేత్తలు కావాలని అభిలషిస్తున్నారని, లక్షల మంది చిన్నారులకు ఇస్రో స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు. ‘‘చంద్రయాన్‌-2 ల్యాండింగ్‌ సమయంలో ఎంతో మంది చిన్నారులు దీనిని వీక్షించారు. ఎన్నో నేర్చుకున్నారు. చంద్రయాన్‌-3 ఆగస్టు 23న విజయవంతంగా ల్యాండైంది. ఈ నేపథ్యంలో రానున్న ఆగస్టు 23, 2024ను ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా పేరు పెట్టనున్నాం. ఇస్రో అనేక అద్భుత రికార్డులను సొంతం చేసుకుంది’’ అని ప్రధాని తెలిపారు. అనేక దేశాలు సాధించడంలో విఫలమైన ఆదిత్య-ఎల్‌ 1(సూర్యుడిపై ప్రయోగం)ను ఇస్రో సాధించిందని కొనియాడారు. ఈ సందర్భంగా మూడు కీలక ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. వీటిలో శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పీఎ్‌సఎల్వీ ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటీ కూడా ఉంది.

ప్రపంచం మనవైపే

‘‘పలు కీలక ప్రయోగాల ద్వారా ఇస్రోను పరుగులు పెట్టిస్తున్నాం. ముఖ్యంగా చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌ 1 వంటివి ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసేలా చేశాయి. 2047 నాటికి దేశాన్ని ‘వికసిత భారత్‌’గా అభివృద్ధి పరచాలన్న కీలక లక్ష్యంలో ఇస్రో కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది. ఆదిశగా అడుగులు వేస్తోంది’’ అని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ తెలిపారు. 40 ఏళ్లలో దేశ ప్రధాని ఇస్రోని సందర్శించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు.

సుదీర్ఘ శిక్షణ

రోదసీ ప్రయాణానికి 2019లో మొత్తం 12 మంది టెస్ట్‌ పైలట్‌లు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అనేక వడపోతల తర్వాత ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోస్పేస్‌ మెడిసిన్‌, ఇస్రో సంయుక్తంగా నలుగురిని ఎంపిక చేశాయి. తర్వాత వారిని రష్యాలో ప్రాథమిక శిక్షణకు పంపించారు. అయితే, కరోనా నేపథ్యంలో ఈ శిక్షణ కొంత ఆలస్యంగా 2021 నాటికి పూర్తయింది. అప్పటి నుంచి దేశంలోనే వారికి వివిధ మాడ్యూల్స్‌లో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కోసం సాయుధ బలగాలు సహా పలు ఏజెన్సీలతో ఇస్రో ఒప్పందం చేసుకుంది. వైమానిక దళంలోనూ వీరికి మరింత శిక్షణ ఇచ్చారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలోనూ అనేక జాగ్రత్తలు పాటించారు. భారత్‌ నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ బృందంగా వీరు రికార్డు సృష్టించనున్నారు.

మూడు రోజులపాటు సాగే ‘గగన్‌యాన్‌’లో వ్యోమగాములను 400 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశ పెడతారు. అనంతరం వారిని సురక్షితంగా కిందికి తీసుకువస్తారు. 2025లో ఈ ప్రయోగాన్ని చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకొంది.

2035లో అంతరిక్ష కేంద్రం

ఈ ఏడాది స్వల్ప కాలంలో ఎక్స్‌పోశాట్‌, ఇన్‌శాట్‌-3డీఎస్‌ వంటివి పూర్తి చేసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 40 బిలియన్‌ డాలర్లకు చేరుకోనుందని ప్రధాని తెలిపారు. అంతరిక్ష రంగంలో భారత్‌ అతి పెద్ద వాణిజ్య కేంద్రంగా అవతరించనుందని వెల్లడించారు. 2035 నాటికి భారత్‌ సొంతగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని తెలిపారు. ‘‘ఇది మాత్రమేకాదు, ఈ అమృత కాలంలో భారత వ్యోమగామి.. చంద్రునిపై కాలు మోపే రోజు త్వరలోనే రానుంది’’ అని మోదీ పేర్కొన్నారు.

ప్రశాంత్‌ నాయర్‌: కేరళలో 1976లో జన్మించారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ విద్యార్థి. ఖడ్గ సత్కార గ్రహీత. 1998లో ఐఏఎఫ్‌ యుద్ధ విమానాల విభాగంలో నియామకం పొందారు. 3000 గంటల అనుభవం ఉంది. ఎస్‌యూ-30 ఎంకేఐ, మిగ్‌-21, మిగ్‌-29, హాక్‌, డార్నియర్‌, ఏఎన్‌-32లను నడిపిన అనుభవం ఉంది.

అజిత్‌ కృష్ణన్‌: చెన్నైలో 1982లో జన్మించారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ విద్యా ర్థి. రాష్ట్రపతి పసిడి పతకంతో సహా వైమానిక అకాడమీలో ఖడ్గ సత్కార గ్రహీత. 2003 లో ఐఏఎఫ్‌ యుద్ధ విమానాల విభాగంలో నియామకం పొందారు. 2900 గంటల అనుభవం ఉంది. ఎస్‌యూ-30 ఎంకేఐ, మిగ్‌-21, మిగ్‌-29, హాక్‌, డార్నియర్‌, ఏఎన్‌-32లను నడిపిన అనుభవం ఉంది.

అంగద్‌ ప్రతాప్‌: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో 1982లో జన్మించారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ విద్యార్థి. 2004లో ఐఏఎఫ్‌ యుద్ధ విమానాల విభాగంలో నియామకం పొం దారు. 2000 గంటల అనుభవం ఉంది. ఎస్‌యూ-30 ఎంకేఐ, మిగ్‌-21, మిగ్‌-29, హాక్‌, డార్నియర్‌, జాగౌర్‌, ఏఎన్‌-32లను నడిపిన అనుభవం ఉంది.

సుభాంశు శుక్లా: ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవులో 1985లో జన్మించారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ విద్యార్థి. 2006లో ఐఏఎఫ్‌ యుద్ధ విమానాల విభాగంలో నియామకం పొందారు. 2000 గంటల అనుభవం ఉంది. ఎస్‌యూ-30 ఎంకేఐ, మిగ్‌-21, మిగ్‌-29, హాక్‌, డార్నియర్‌, జాగౌర్‌, ఏఎన్‌-32లను నడిపిన అనుభవం ఉంది.

Updated Date - Feb 28 , 2024 | 03:53 AM