Share News

అహో.. ఏఐ టీచరమ్మ!

ABN , Publish Date - Mar 09 , 2024 | 03:14 AM

ఇప్పటికే కొన్ని కంపెనీలు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌-ఏఐ) ద్వారా యాంకర్లు, మోడళ్లను ప్రవేశపెట్టి ఔరా అనిపించాయి.

అహో.. ఏఐ టీచరమ్మ!

కేరళలోని ఓ స్కూల్లో టీచర్‌ బొమ్మ అద్భుతాలు

‘కృత్రిమ మేధస్సు టీచరమ్మ’ దేశంలోనే తొలిసారి

తిరువనంతపురం, మార్చి 8: ఇప్పటికే కొన్ని కంపెనీలు కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌-ఏఐ) ద్వారా యాంకర్లు, మోడళ్లను ప్రవేశపెట్టి ఔరా అనిపించాయి. అక్షరాస్యత శాతంలో ముందుండి.. విద్యారంగంలోనూ అద్భుతాలు సృష్టిస్తున్న కేరళలో ఓ ‘ఏఐ టీచరమ్మ’ వచ్చేసింది! తరగతి గదిలోకొచ్చి కరచాలనం చేస్తూ విద్యార్థులందరినీ పరిచయం చేసుకోవడమే కాదు.. వినసొంపైన స్వరంతో చక్కగా పాఠం కూడా చెప్పింది. అనంతరం విద్యార్థులడిగిన సందేహాలన్నింటినీ అంతే చక్కగా నివృత్తి చేసింది. ‘అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ ప్రాజెక్టు’లో భాగంగా మేకర్‌ల్యాబ్స్‌ ఎడ్యుటెక్‌ సహకారంతో ఈ ‘టీచరమ్మ కాని టీచరమ్మ’ను రూపొందించారు. చక్కని హెయిర్‌ క్రాఫ్‌, చీరకట్టులో మెడలో బంగారు నగల మాదిరిగా మైక్రో ఫోన్స్‌, స్పీకర్లు తగిలించుకొని తిరువనంతపురం కల్లంబలం ప్రాంతంలోని కేటీపీసీ పాఠశాలలో అడుగుపెట్టిన ఈ ‘టీచర్‌ బొమ్మ’కు ‘ఐరిస్‌’ అని పేరు పెట్టారు. ఈ ఐరిస్‌.. అన్ని భాషల్లోనూ పాఠాలు చెప్పగలదు. కుడి, ఎడమ చేతులతోనూ బాణాలు వేసే నైపుణ్యం గల సవ్యసాచి మాదిరిగా.. ఏ వైపు నుంచి సందేహాలు వ్యక్తమైతే ఆ వైపునకు తలను బొంగరంలా తిప్పుతూ అర్థమయ్యేలా వివరించనూ గలదు. అయితే ఈ ‘ఐరి్‌స’తో ఓ చిక్కుంది! స్కూల్‌ పిల్లలు అంటేనే అల్లరికి చిరునామా. తరగతి గదిలో గోల గోల చేస్తుంటారు. అయితే విద్యార్థుల అల్లరితో తరగతి గది గందరగోళంగా ఉంటే మాత్రం ఈ ఏఐ టీచరమ్మ పాఠాలు చెప్పదట!! విద్యార్థులంతా ఈ ఐరిస్‌ టీచింగ్‌ను తెగ ఆసక్తిగా విన్నారు! కారణం.. ఈ టీచరమ్మను కోపమే రాదు.. పిల్లలపై విసుక్కోదట కూడా! అందునా హోం వర్కే ఇవ్వదట! ఏఐ టీచర్‌ను రూపొందించడం దేశంలోనే తొలిసారి అని చెబుతున్నారు. తరగతి గదిలో విద్యార్థులకు ఐరిస్‌ పాఠాలు చెబుతున్న దృశ్యాలు నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. అయితే.. ఈ ఐరిస్‌, స్కూల్లోని టీచింగ్‌ స్టాఫ్‌కు సపోర్టివ్‌ సిస్టమ్‌గానే ఉంటుందని స్కూల్‌ ప్రిన్సిపల్‌ మీరా సురేశ్‌ చెప్పారు.

Updated Date - Mar 09 , 2024 | 03:14 AM