Share News

5 రాష్ట్రాల్లో ఆప్‌-కాంగ్రెస్‌ ఉమ్మడి పోరు

ABN , Publish Date - Feb 25 , 2024 | 05:45 AM

పార్లమెంటు ఎన్నికల్లో పొత్తులపై అనేక తర్జనభర్జనల నడుమ ఢిల్లీ అధికార పార్టీ ఆప్‌.. కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపింది. ఢిల్లీ, గోవా, గుజరాత్‌, హరియాణా, ఛండీగఢ్‌లలోని పార్లమెంటు స్థానాల్లో ఉమ్మడిగా పోటీ

5 రాష్ట్రాల్లో ఆప్‌-కాంగ్రెస్‌ ఉమ్మడి పోరు

పంజాబ్‌లో మాత్రం ఎవరికివారే

అవినీతి పొత్తు మాబాగా కుదిరింది: బీజేపీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: పార్లమెంటు ఎన్నికల్లో పొత్తులపై అనేక తర్జనభర్జనల నడుమ ఢిల్లీ అధికార పార్టీ ఆప్‌.. కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపింది. ఢిల్లీ, గోవా, గుజరాత్‌, హరియాణా, ఛండీగఢ్‌లలోని పార్లమెంటు స్థానాల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని రెండు పార్టీలూ నిర్ణయించాయి. ఆప్‌ ప్రధాన కార్యదర్శి సందీప్‌ పాఠక్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాజకీయ ప్రాధాన్యాల కన్నా దేశ ప్రయోజనాలు మిన్న అని భావించాం. కాంగ్రె్‌సపై నమ్మకంతోనే ఆ పార్టీతో చేతులు కలిపాం’’ అని పేర్కొన్నారు. ఇండియా కూటమిలో ఆప్‌ కొనసాగుతుందని తెలిపారు. కాంగ్రెస్‌ నేత ముకుల్‌ వాస్నిక్‌ మాట్లాడుతూ.. ఢిల్లీ సహా పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ స్థానాల్లో ఆప్‌ పోటీ చేస్తుందన్నారు. చాందినీ చౌక్‌, ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ సీట్లలో కాంగ్రెస్‌ పోటీలోకి దిగుతుందని తెలిపారు. ఈ ఏడు స్థానాల్లోనూ 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం దక్కించుకుంది. ఇక, గుజరాత్‌లోని మొత్తం 26 స్థానాల్లో రెండు చోట్ల(భారుచ్‌, భావ్‌నగర్‌) ఆప్‌, మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయనున్నాయి. అదేవిధంగా గోవాలోని రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ పోటీ చేయనుండగా, ఛండీగఢ్‌లోని ఒకే ఒక స్థానం నుంచి కూడా బరిలోకి దిగనుంది. అయితే, గోవాలోని దక్షిణ నియోజకవర్గం నుంచి ఆప్‌ ఇదివరకే తన అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే వెంజీ వేగా్‌సను ప్రకటించింది. అయితే, ఆయనను పక్కకు తప్పించి కాంగ్రెస్‌ అభ్యర్థి ఫ్రాన్సిస్కో సర్దిన్హా ఇక్కడ నుంచి పోటీ చేయనున్నారు. హరియాణాలోని 10 స్థానాలో కాంగ్రెస్‌ 9 చోట్ల, ఆప్‌ ఒక స్థానం(కురుక్షేత్ర) నుంచి పోటీ చేయనున్నాయి. కీలకమైన పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్‌, ఆప్‌లు ఎవరికి వారుగా పోటీ చేయనున్నారు. ‘‘ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాం’’ కాంగ్రెస్‌ నేత వాస్నిక్‌ తెలిపారు.

aap.jpg

సహకరించేది లేదు: పటేల్‌ కుటుంబం

గుజరాత్‌లోని భారుచ్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కుమారుడు ఫైజల్‌ పటేల్‌ ఆశించారు. కానీ, ఈ సీటును ఆప్‌కు ఇవ్వడంతో ఆయన భగ్గుమన్నారు. ఆప్‌కు సహకరించేది లేదని కుండబద్దలు కొట్టారు. గతంలో అహ్మద్‌పటేల్‌ 1970-1980 మధ్య మూడు సార్లు భారుచ్‌ నుంచి విజయం సాధించారు. అయితే, ఆప్‌ నుంచి పోటీకి సిద్ధమైన చైతర్‌ వాసవ మాత్రం తాను ఇక్కడ నుంచి గెలిచి అహ్మద్‌ పటేల్‌కు అంకితమిస్తానని వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్‌, ఆప్‌ పొత్తులపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రె్‌స-ఆ్‌పల మధ్య ‘అవినీతి పొత్తు’ మాబాగా కుదిరిందన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 05:45 AM