వయసు ధ్రువీకరణకు ఆధార్ సరైన పత్రం కాదు
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:31 AM
వయసు ధ్రువీకరణకు ఆధార్ సరైన పత్రం కాదని గురువారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జూవినైల్ జస్టిస్ చట్టం-2015లోని సెక్షన్ 94 ప్రకారం స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్‌లో

సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ, అక్టోబరు 24: వయసు ధ్రువీకరణకు ఆధార్ సరైన పత్రం కాదని గురువారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జూవినైల్ జస్టిస్ చట్టం-2015లోని సెక్షన్ 94 ప్రకారం స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్‌లో పేర్కొన్న పుట్టిన తేదీనే ప్రామాణికంగా తీసుకోవాలని తెలిపింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి వయసును ఆధార్ కార్డు ఆధారంగా నిర్ణయించి, ఆ మేరకు నష్ట పరిహారాన్ని తగ్గిస్తూ పంజాబ్-హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఆధార్ గుర్తింపు కార్డుగా పనికొస్తుందే తప్ప, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడదంటూ కేంద్ర ఎలకా్ట్రనిక్స్, ఐటీ శాఖ జారీ చేసిన సర్క్యులర్‌ను ఈ సందర్భంగా గుర్తు చేసింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి వయసును స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ ఆధారంగానే నిర్ణయించాల్సి ఉంటుందని కేసును విచారించిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం తెలిపింది. 2015లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.19.35 లక్షల పరిహారం ఇవ్వాలని రోహ్‌తక్‌లోని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ (ఎంఏసీటీ) ఆదేశించింది. స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ ఆధారంగా వయసు 45 ఏళ్లు అని నిర్ధారించి పరిహారాన్ని లెక్కించింది. ట్రైబ్యునల్ తీర్పుపై హైకోర్టులో అప్పీలు దాఖలు కాగా ఆధార్ కార్డు ఆధారంగా వయసు 47 ఏళ్లు అని లెక్కించి దానికి అనుగుణంగా పరిహారాన్ని రూ.9.22 లక్షలకు తగ్గించింది. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆధార్ ఆధారంగా వయసు లెక్కించడం సరికాదన్న ధర్మాసనం ట్రైబ్యునల్ తీర్పును సమర్థించింది.