ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధిగా తెలుగు వ్యక్తి
ABN , Publish Date - Aug 15 , 2024 | 04:48 AM
ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా తెలుగు వ్యక్తి పర్వతనేని హరీశ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ బుధవారం ప్రకటించింది. 1990 క్యాడర్‌కు
పర్వతనేని హరీశ్‌కు అపూర్వ గౌరవం
న్యూఢిల్లీ, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధిగా తెలుగు వ్యక్తి పర్వతనేని హరీశ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ బుధవారం ప్రకటించింది. 1990 క్యాడర్‌కు ఐఎ్‌ఫఎ్‌స(ఇండియన్ ఫారిన్ సర్వీసు) బ్యాచ్‌కు చెందిన హరీశ్... ప్రస్తుతం జర్మనీ రాయబారిగా పనిచేస్తున్నారు. ఐక్యరాజ్యసమితిలో భారత తొలి, శాశ్వత మహిళా రాయబారిగా సేవలందించిన సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంభోజ్ జూన్ 1న పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో హరీశ్‌ను కేంద్రం నియమించింది. త్వరలో ఆయన బాధ్యతలు చేపడతారని విదేశాంగశాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్, కోల్‌కత్తాలోని ఐఐఎంలో మేనేజ్‌మెంట్ కోర్సును పూర్తిచేశారు. విదేశాంగ మంత్రిత్వశాఖలో ఆర్థిక సంబంధాల అదనపు కార్యదర్శిగా బాఽధ్యతలు నిర్వర్తించారు. తూర్పు ఆసియాకి చెందిన పలు దేశాల్లో భారత రాయబారిగా, హ్యూస్టన్‌లో భారత కాన్సులేట్ జనరల్‌గా, వియత్నాంలో రాయబారిగా పనిచేసిన ఆయన... దాదాపు మూడు దశాబ్దాలకు పైగా దౌత్య సేవలందించారు. బహుళ దేశాల ఆర్థిక సంబంధాల విభాగానికి అధిపతిగా వ్యవహరించారు. జీ-20, జీ-7, బ్రిక్స్ సమావేశాల్లో దేశం తరపున పాల్గొన్నారు. అమెరికన్ కైరో యూనివర్సిటీలో అరబిక్ నేర్చుకున్న ఆయన... కైరో, రియాధ్‌లలో రాయబారిగా పనిచేశారు. గాజా నగరంలో పాలస్తీనియన్ అథారిటీలో భారత ప్రతినిధిగా ఉన్నారు. పాలస్తీనాలో ఐక్యరాజ్య సమితి తరపున సహాయ కార్యక్రమాలకు ఆధ్వర్యం వహించారు. 2007 నుంచి భారత ఉపరాష్ట్రపతికి జాయింట్ సెక్రటరీగా ఉన్నారు.