Share News

ఏ పాము కరిచినా ఒకే ఇంజెక్షన్‌

ABN , Publish Date - Mar 06 , 2024 | 03:40 AM

ఎవరినైనా పాము కాటేస్తే.. వారికి యాంటీ వెనమ్‌ ఇంజెక్షన్‌ ఇవ్వడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు.

ఏ పాము కరిచినా ఒకే ఇంజెక్షన్‌

న్యూయార్క్‌, మార్చి 5: ఎవరినైనా పాము కాటేస్తే.. వారికి యాంటీ వెనమ్‌ ఇంజెక్షన్‌ ఇవ్వడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు. కానీ, ఇక్కడో చిక్కుంది. పాముల్లో చాలా రకాలుంటాయి. కరిచిన పామును బట్టి యాంటీవెనమ్‌ ఇంజెక్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే.. ఏ ప్రాంతంలో ఏ రకం పాములు ఎక్కువగా ఉంటే.. వాటి విషానికి విరుగుడుగా పనిచేసే ఇంజెక్షన్లను ఎక్కువగా ఉంచుతారు. పాము విషాన్ని స్వల్ప మోతాదుల్లో గుర్రాలు, గొర్రెల వంటివాటికి ఇచ్చి వాటి శరీరాల్లో ఆ విషానికి తయారైన యాంటీబాడీలను సేకరించి, వాటిని శుద్ధి చేసి తయారు చేసే ఇంజెక్షన్లు అవి. ఇంత ప్రయాస లేకుండా.. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో కనిపించే పలు రకాల ‘ఎలాపిడ్‌’ పాముల్లో ఏ జాతి సర్పం కరిచినా కాపాడే సింథటిక్‌ యాంటీబాడీతో తయారైన ఇంజెక్షన్‌ అందుబాటులోకి వస్తే? ‘95మ్యాట్‌5’ అనే యాంటీబాడీతో అలాంటి సూదిమందునే తయారుచేశామని స్ర్కిప్స్‌ రిసెర్చ్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. సాధారణంగా పాముల విషాలు.. న్యూరోటాక్సిక్‌, హీమోటాక్సిక్‌ అని రెండు రకాలుగా ఉంటాయి. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో కనిపించే కింగ్‌ కోబ్రా, బ్లాక్‌ మాంబా, సముద్రపాములు, కోరల్‌ స్నేక్స్‌, క్రెయిట్స్‌ వంటి 200 రకాల పాములు న్యూరోటాక్సిన్లను విడుదల చేస్తాయి. ఇవన్నీ ఎలాపిడ్‌ కుటుంబానికి చెందిన పాములు. వీటి విషం మన నాడీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది.

ఫలితంగా మరణం సంభవిస్తుంది. ఇక హీమోటాక్సిక్‌ అంటే.. రక్తాన్ని గడ్డకట్టించే రకం విషం. ఈ తరహా విషాన్ని విడుదల చేసేవి వైపర్లు. ర్యాటిల్‌ స్నేక్స్‌, కాపర్‌హెడ్స్‌, కాటన్‌మౌత్‌ వంటివి ఈ కోవలోకి వస్తాయి. స్ర్కిప్స్‌ రిసెర్చ్‌ శాస్త్రవేత్తలు.. ఎలాపిడ్‌ పాముల విషంలో ఉండే లాంగ్‌చైన్‌ త్రీ ఫింగర్‌ ఆల్ఫా న్యూరోటాక్సిన్లను నిర్వీర్యం చేసే యాంటీబాడీని గుర్తించడం కోసం 10 వేల కోట్ల యాంటీబాడీలను జల్లెడ పట్టారు. వాటిలో.. 95మ్యాట్‌5 అనే యాంటీబాడీకి ఒక్క కింగ్‌కోబ్రా తప్ప బ్లాక్‌మాంబా సహా అన్ని రకాల పాముల విషాన్నీ విరిచే గుణం ఉన్నట్టు వెల్లడైంది. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో అది రుజువైంది. కింగ్‌ కోబ్రా విషాన్ని ఎక్కించిన ఎలుకల్లో మాత్రం ఈ యాంటీబాడీ పనిచేయలేదు. విషప్రభావంతో అవి చనిపోయాయి. కానీ.. వాటి మరణాన్ని కొంత ఆలస్యం చేయగలిగిందీ యాంటీబాడీ!! కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఏటా ప్రపంచవ్యాప్తంగా 81 వేల మంది నుంచి 1.38 లక్షల మంది పాముకాటుకు బలవుతున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 03:40 AM