Jharkhand CM Champai Soren : సోరెన్ సర్కారు ఘన విజయం
ABN , Publish Date - Feb 06 , 2024 | 03:36 AM
ఝార్ఖండ్‌లో సీఎం చంపయి సోరెన్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఘన విజయం సాధించింది. అసెంబ్లీలో 81మంది సభ్యులు ఉండగా సోమవారం నిర్వహించిన బలపరీక్షకు 77మంది హాజరయ్యారు. వారిలో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుగా 47మంది, వ్యతిరేకంగా 29మంది
47-29 ఓట్లతో నెగ్గిన విశ్వాస పరీక్ష.. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ప్రజాస్వామ్యానికి ముప్పు
నియంత అహంకారాన్ని ఝార్ఖండ్ బద్దలు కొట్టింది: కాంగ్రెస్
అవినీతిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా: హేమంత్
రాంచీ, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఝార్ఖండ్‌లో సీఎం చంపయి సోరెన్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఘన విజయం సాధించింది. అసెంబ్లీలో 81మంది సభ్యులు ఉండగా సోమవారం నిర్వహించిన బలపరీక్షకు 77మంది హాజరయ్యారు. వారిలో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుగా 47మంది, వ్యతిరేకంగా 29మంది ఓటు వేశారు. స్వతంత్ర అభ్యర్థి సరయు రాయ్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. సంకీర్ణ కూటమిలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ భాగస్వామ్య పార్టీలు కాగా, సీపీఐఎంఎల్(ఎల్) పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే బయటి నుంచి ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేశారు. ప్రతిపక్ష బీజేపీకి చెందిన 26మంది, ఏజేఎ్‌సయూ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. జేఎంఎం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను జనవరి 31న మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడంతో ఆ పార్టీ సీనియర్ నేత చంపయి సోరెన్ ఈనెల 2న సీఎంగా ప్రమాణం చేశారు. బల నిరూపణకు 10 రోజులు గడువిచ్చినా ప్రభుత్వం సోమవారమే బల పరీక్షను ఎదుర్కొంది. విశ్వాస పరీక్ష సందర్భంగా సీఎం చంపయి సోరెన్ మాట్లాడుతూ ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ ప్రయత్నించిందని, హేమంత్ సోరెన్‌ను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుందని మండిపడ్డారు.
ఈడీ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగంచేయడం ప్రజాస్వామ్యానికి ముప్పుగా ఆయన అభివర్ణించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. కాగా అరెస్టయిన మాజీ సీఎం హేమంత్ సోరెన్ కూడా కోర్టు అనుమతితో బలపరీక్షకు హాజరై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. తనపై మోపిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని హేమంత్ బీజేపీకి సవాల్ విసిరారు. అవినీతి ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలగుతానని ప్రకటించారు. తనపై బీజేపీ పన్నిన కుట్రలో రాజ్‌భవన్ పాత్ర ఉందని ఆరోపించారు. ‘దేశ చరిత్రలోనే జనవరి31 ఒక చీకటి అధ్యాయం. రాజ్‌భవన్ ఆదేశంతో ఒక సీఎంను అరెస్టు చేశారు. ఝార్ఖండ్‌లో ఒక గిరిజన సీఎం ఐదేళ్లు పాలించడం బీజేపీకి ఇష్టంలేదు. గిరిజనులను బీజేపీ అంటరానివారిలా చూస్తోంది. కేంద్రంలోని బీజేపీ పాలనలో గిరిజనులు, దళితులకు రక్షణ లేదు’అని హేమంత్ సోరెన్ అన్నారు. కాగా ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలుచేస్తూ హేమంత్ సోరెన్ దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ ను ఝార్ఖండ్‌హైకోర్టు ఈనెల12కు వాయిదా వేసింది .
విశ్వాస పరీక్షలో చంపయి సోరెన్ ప్రభుత్వం ఘన విజయం సాధించడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ‘నియంత అహంకారాన్ని ఝార్ఖండ్ బద్దలు కొట్టింది. ఇది ప్రజల గెలుపు. ఇండియా సంకీర్ణ కూటమి ఈరోజు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గింది’ అని ఆ పార్టీ ట్వీట్ చేసింది. ఝార్ఖండ్‌లో ఆపరేషన్ లోటస్ విఫలమైందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు.
సీఎం అరెస్టు సరికాదు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఝార్ఖండ్‌లో సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేయడాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తప్పుబట్టారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. మద్యం విధానం కేసులో ఈడీ విచారణకు కేజ్రీ గైర్హాజరవుతున్న సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ ఆరోపణలపై ఇదే తరహాలో పలుమార్లు విచారణకు హాజరవని సోరెన్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఢిల్లీలో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన కేజ్రీ.. దేశంలో ప్రభుత్వాలను కూల్చుతున్నది, పార్టీలను చీల్చుతున్నది ఎవరో అందరికీ తెలుసని పరోక్షంగా బీజేపీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఝార్ఖండ్‌లో ప్రభుత్వం పడిపోతుందేమోనని రెండు రోజుల పాటు వేచి చూశారని.. జేఎంఎం ఎమ్మెల్యేలు చెక్కుచెదరకుండా ఉండడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. మరోవైపు ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలపై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు తనకు జారీ చేసిన నోటీసులను కేజ్రీవాల్ తప్పుబట్టారు. వాటిలో ఎఫ్‌ఐఆర్ ప్రస్తావనే లేదన్నారు. తమను తాము అవమానించుకుంటూ రాజకీయ నేతలు చెప్పినట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కేజ్రీ ఆరోపించారు.