Share News

ఎన్‌ఐఏ అధికారులపై లైంగిక వేధింపుల కేసు

ABN , Publish Date - Apr 08 , 2024 | 03:57 AM

జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులపై పశ్చిమబెంగాల్‌ పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.

ఎన్‌ఐఏ అధికారులపై లైంగిక వేధింపుల కేసు

నమోదు చేసిన పశ్చిమ బెంగాల్‌ పోలీసులు

అరెస్టయిన నిందితుల కుటుంబసభ్యుల ఫిర్యాదే ఆధారం

కోల్‌కతా, ఏప్రిల్‌ 7: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులపై పశ్చిమబెంగాల్‌ పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఎన్‌ఐఏ అధికారులపై శనివారం తూర్పు మిడ్నపూర్‌ జిల్లా భూపతినగర్‌లో రాళ్లదాడి జరిగిన కొన్ని గంటలకే ఎన్‌ఐఏ అధికారులపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేయడం గమనార్హం. 2022 డిసెంబరు 3న భూపతినగర్‌లోని ఓ ఇంట్లో పేలుడు సంభవించి ముగ్గురు మృతిచెందారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి భూపతినగర్‌లో సోదాలు జరిపి అధికార తృణమూల్‌ కాంగ్రె్‌స(టీఎంసీ) పార్టీ కార్యకర్తలు మనబ్రతో జన, బలాయి మైతీలను అరెస్టు చేశారు. ఆ ఇద్దరినీ తమ వాహనాల్లో కోల్‌కతాకు తీసుకెళ్తుండగా గ్రామస్థులు శనివారం ఎన్‌ఐఏ అధికారుల వాహనాలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అయితే, అరెస్టయిన మనబ్రతో జన కుటుంబంలోని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్‌ఐఏ అధికారులపైనే పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి తమ ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన ఎన్‌ఐఏ అధికారులు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇది భారత రాజ్యాంగంపై దాడి: బీజేపీ

భూపతినగర్‌ ఘటనపై బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ‘కేంద్ర సంస్థలపై దాడిచేయడమంటే భారత రాజ్యాంగంపై దాడి చేయడమే. తమ విధులు నిర్వర్తిస్తున్న ఎన్‌ఐఏ అధికారులపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయడం అన్ని రాజ్యాంగ వ్యవస్థలూ కుప్పకూలడానికి ఒక సంకేతం’ అని బీజేపీ ఎంపీ శామిక్‌ భట్టాచార్య విమర్శించారు. కాగా, తమ నాయకులు, కార్యకర్తలపై బీజేపీ దాడి ప్రారంభించిందని టీఎంసీ ఆరోపించింది. కాగా, రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి(సీఈవో) ఆరిజ్‌ ఆఫ్తాబ్‌ భూపతినగర్‌ ఘటనపై నివేదిక కోరారు.

Updated Date - Apr 08 , 2024 | 03:57 AM